ఢిల్లీ చిల్డ్రన్ హాస్పిటల్‌ అగ్నిప్రమాద ఘటనలో యజమాని, మరో డాక్టర్ అరెస్ట్

ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలను కోల్పోగా, కొందరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది

Update: 2024-05-26 15:15 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుది. ఈస్ట్-ఢిల్లీలోని వివేక్ విహార్‌లో ఉన్న న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్‌లో శనివారం అర్ధరాత్రి అగ్నికీలలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు నవజాత శిశువులు ప్రాణాలను కోల్పోగా, మరో ఐదుగురికి చికిత్స కొనసాగుతోంది. వారిలో కొందరు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని అధికారులు అధికారిక ప్రకటనలో తెలిపారు. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. చిన్నారుల మృతితో తల్లిదండ్రులు కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. దాంతో హాస్పిటల్‌ పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం రాత్రి 11:30 గంటలకు ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. వెంటనే పక్కనే ఉన్న మరో రెండు భవనాలకు వ్యాపించాయి. ఆక్సిజన్ సిలిండర్ పేలడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ చీఫ్ అతుల్ గార్గ్ చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో నాలుగైదు పేలుళ్ల శబ్దాలు సంభవించాయని, ఆ సిలిండర్లు 50 మీటర్ల దూరం వరకు ఎగిరిపడినట్లు అధికారులు తెలిపారు. హాస్పిటల్‌లో చెలరేగిన మంటలు పక్కనే ఉన్న ఓ భవనంలోని బొటిక్, ప్రైవేట్ బ్యాంకుకు, మరో భవనంలోని కళ్లద్దాల షోరూమ్, ఓ దుకాణానికీ వ్యాపించాయి. ఒక స్కూటర్, అంబులెన్స్, దగ్గర్లోని పార్క్‌లో కొంతభాగం మంటల్లో చిక్కుకుపోయాయి. ఆదివారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. ఆసుపత్రికి ఆనుకుని ఉన్న రెండు భవనాలు కూడా మంటల్లో చిక్కుకున్నాయి, అయితే ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్పత్రి బయట ఉన్న అంబులెన్స్​లోని సిలిండర్​లో ఆక్సిజన్​ రీఫిల్లింగ్ సమయంలో సిలిండర్ పేలుడు సంభవించింది. ఆ వెంటనే మూడు సిలిండర్లు ఒకదాని తర్వాత మరోకటి పేలాయి. ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పక్కనే ఉన్న భవనంలోకి కూడా వ్యాపించాయని స్థానికులు చెప్పారు.

హాస్పిటల్ నిర్వహణలో అన్నీ లోపాలే..

న్యూ బోర్న్ బేబీ కేర్ హాస్పిటల్‌కు నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్ఓసీ) లేదని అతుల్ గార్గ్ తెలిపారు. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రికి గతంలోనూ నేరపూరిత నిర్లక్ష్య చరిత్ర ఉంది. నర్సింగ్‌హోమ్‌లో చికిత్స సమయంలో పసికందు పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు యజమాని నవీన్ ఖిచిపై కేసు ఉంది. అలాగే, 2021లో ఢిల్లీ నర్సింగ్ హోమ్ చట్టం కింద ఆసుపత్రి రిజిస్టర్ కాలేదు. అయితే, దీనికి సంబంధించి అప్పట్లో అధికారులు జరిమానా విధించారు. జరిమానా చెల్లించిన అనంతరం హాస్పిటల్ కార్యకలాపాలు తిరిగి ప్రారంభించారు.

శనివారం రాత్రి ఘటన జరిగిన తర్వాత నవీన్ ఖిచి జైపూర్‌కు పారిపోయాడు. అతడిని పట్టుకునేందుకు పోలీసు బృందాన్ని పంపించారు. ఢిల్లీ పోలీసులు ఆదివారం డాక్టర్ నవీన్ ఖిచిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం షహదారాలోని వివేక్ విహార్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అతను ఢిల్లీలో ఇంకా పలు ఆసుపత్రులను నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. శనివారం రాత్రి ఘటన జరిగిన సమయంలో డాక్టర్ ఆకాష్ అనే వ్యక్తి డ్యూటీలో ఉన్నాడు.

హృదయ విదారక ఘటన: ప్రధాని మోడీ..

ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దిల్లీలోని ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం హృదయ విదారకం. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని ట్వీట్‌ చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై విచారణ జరుగుతోందని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని విడిచి పెట్టే ప్రసక్తి లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.   

Tags:    

Similar News