డీడీ కిసాన్ కు ఏఐ యాంకర్లు.. 50 భాషల్లో మాట్లాడే సామర్థ్యం

రైతుల కోసం ప్రారంబించిన ప్రత్యేక ఛానెల్ డీడీ కిసాన్ కీలక నిర్ణయం తీసుకుంది. వార్తలు చదివేందుకు ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనుంది.

Update: 2024-05-24 14:18 GMT

దిశ, నేషనల్ బ్యూరో: రైతుల కోసం ప్రారంబించిన ప్రత్యేక ఛానెల్ డీడీ కిసాన్ కీలక నిర్ణయం తీసుకుంది. వార్తలు చదివేందుకు ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనుంది. డీడీ కిసాన్ మే 26తో 9 వసంతాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా న్యూస్ చదివేందుకు ఏఐ క్రిష్, ఏఐ భూమి పేరుతో ఇద్దరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్లను తీసుకురానున్నట్లు తెలిపింది. ఈ ఏఐ యాంకర్లు మొత్తం 50 భాషల్లో మాట్లాడగలరని స్పష్టం చేసింది. దీనితో దేశంలోనే ఏఐ యాంకర్లు రాబోతున్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్ గా ఘనత సాధిస్తుంది.

ఈ ఏఐ యాంకర్లు పూర్తిగా ఏఐ కనెక్టెడ్ కంప్యూటర్లని, ఇవి అచ్చం మనుషుల్లాగే పనిచేస్తాయని డీడీ కిసాన్ తెలిపింది. వ్యవసాయ రంగ పరిశోధనలు, మార్కెట్‌లో ధరలు, ప్రభుత్వ పథకాలు, వాతావరణ సమస్యలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఏఐ యాంకర్లు అందజేస్తారని వెల్లడించింది. 24 గంటలు ఆగకుండా, అలసిపోకుండా ఏఐ యాంకర్లు వార్తలు చదవగలరని వ్యవసాయ, రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.

Similar News