‘రెమాల్’ తుపాన్ బీభత్సం.. గంటకు135కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు

బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని కానింగ్‌లో సోమవారం తెల్లవారుజామున తీరాన్ని తాకింది. దీంతో బంగ్లాదేశ్, బెంగాల్‌లలో భారీ వర్షాలు కురుశాయి.

Update: 2024-05-27 06:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బంగాళాఖాతంలో ఏర్పడిన రెమాల్ తుపాన్ పశ్చిమ బెంగాల్‌లోని కానింగ్‌లో సోమవారం తెల్లవారుజామున తీరాన్ని తాకింది. దీంతో బంగ్లాదేశ్, బెంగాల్‌లలో భారీ వర్షాలు కురుశాయి. అంతేగాక గంటకు సుమారు 135 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురు గాలులు వీచాయి. పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో తుపాను భారీ విధ్వంసం సృష్టించింది. పలు ప్రాంతాల్లో అనేక చెట్లు, విద్యుత్ స్థంబాలు నేలకూలగా కరెంటు సరఫరా నిలిచిపోయింది. బెంగాల్ తీర ప్రాంతాల నుంచి దాదాపు 1.10 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇందులో ఎక్కువగా దక్షిణ 24 పరగణాల జిల్లాకు చెందిన వారే ఉన్నారు. సహాయక చర్యల నిమిత్తం కోల్‌కతాతో సహా దక్షిణ బెంగాల్‌లోని పలు జిల్లాల్లో 14 నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ( ఎన్డీఆర్ఎఫ్) బృందాలను మోహరించారు.

బంగ్లాదేశ్‌లో తుపాను గత రాత్రి తీరాన్ని తాకడంతో ఇద్దరు వ్యక్తులు మరణించినట్టు ఆ దేశ విపత్తు మంత్రిత్వ శాఖ అధికారి తెలిపారు.అలాగే కోల్ కతాలోని ఎంటెల్లీ వద్ద ఓ వ్యక్తి మరణించినట్టు తెలుస్తోంది. దక్షిణ పరగణాస్ జిల్లాలో చెట్టు మీద పడి ఓ వృద్దురాలు మరణించింది. నేలకొరిగిన చెట్లను తొలగించి విద్యుత్‌ స్తంభాలను పునరుద్ధరించే పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రజలుకు పలు సూచనలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప ఇంటి నుంచి బయటకు రావొద్దని సూచించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గవర్నర్ డాక్టర్ ఆనంద బోస్ సైతం పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

అయితే రెమల్ తుపాన్ సోమవారం ఉదయం బలహీనపడిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తీరం దాటిన తర్వాత కంటే తెల్లవారుజామున 5:30 గంటలకు 80-90 కిలోమీటర్ల వేగంతోనే గాలులు వీచినట్టు వెల్లడించింది. ఇది ఈశాన్య దిశగా కదిలి మరింత బలహీనపడే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌లోని నాడియా, ముర్షిదాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ ప్రాంతంలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మరోవైపు తుపాను కారణంగా కోల్‌కతా ఎయిర్‌పోర్ట్ అథారిటీ సేవలను నిలిపివేయగా తాజాగా కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. 

Tags:    

Similar News