ఎన్నికల్లోకి చర్మం రంగు అంశాన్ని తెచ్చి మోడీ జాత్యహంకారానికి పాల్పడ్డారు: చిదంబరం

కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం గురువారం ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు

Update: 2024-05-09 07:57 GMT

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి చిదంబరం గురువారం ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లోకి చర్మ రంగు గురించిన అంశాన్ని తీసుకువచ్చి మోడీ జాత్యహంకారానికి పాల్పడ్డారని చిదంబరం ఆరోపించారు. ఎక్స్‌లో వ్యాఖ్యానించిన ఆయన ఏ అభ్యర్ధికి కూడా చర్మం రంగు ఆధారంగా మద్దతు గానీ, వ్యతిరేకత గానీ ఉండదు అని అన్నారు. రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ద్రౌపది ముర్ము, సిన్హా ఉన్నారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు ముర్ముకు మద్దతు ఇవ్వగా, కాంగ్రెస్‌తో సహా 17 ప్రతిపక్ష పార్టీలు సిన్హాకు మద్దతు ఇచ్చాయి. అభ్యర్థికి మద్దతు అనేది చర్మ రంగు ఆధారంగా ఎప్పటికీ ఉండదు. ప్రతి ఓటరు తన ఇష్టానుసారం లేదా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఓటు వేస్తారని చిదంబరం తెలిపారు.

"గౌరవనీయులైన ప్రధానమంత్రి చర్మం రంగును ఎన్నికల చర్చలోకి ఎందుకు తీసుకువచ్చారు" అని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలు పూర్తిగా జాత్యహంకారపూరితమైనవని చిదంబరం అన్నారు. ఇటీవల చర్మం రంగుపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదస్పదం కాగా, కాంగ్రెస్ పార్టీపై, అధినేత రాహుల్ గాంధీపై ప్రధాని మోడీ విమర్శలు చేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ముర్ము "చర్మం రంగు ముదురు రంగులో ఉన్నందున" ఆమెను ఓడించాలని కాంగ్రెస్ ప్రయత్నించిందని తనకు ఇప్పుడు అర్థమైందని అన్నారు. దీనికి కౌంటర్‌గా చిదంబరం ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు.

Similar News