ప్రజ్వల్ రేవణ్ణ దౌత్య పాస్‌పోర్ట్‌ రద్దు ప్రతిపాదనను పరిశీలిస్తున్న కేంద్రం

మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే

Update: 2024-05-23 07:40 GMT

దిశ, నేషనల్ బ్యూరో: మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడు, హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆయన దేశం నుంచి పారిపోయి విదేశాల్లో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రేవణ్ణకు సంబంధించిన దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక ప్రభుత్వం నుండి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు లేఖ అందినట్లు అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి. ఈ అభ్యర్థనపై కేంద్రం కసరత్తు చేస్తోందని సమాచారం.

మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడటం వంటి అనేక కేసులు ప్రజ్వల్ రేవణ్ణపై నమోదు చేశారు. అయితే మొదటి కేసు నమోదు చేయడానికి ముందుగానే దౌత్య పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి ఏప్రిల్ 27న ఆయన దేశం విడిచి జర్మనీకి పారిపోయినట్లు సమాచారం. కర్ణాటక పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేశారు. రేవణ్ణ జాడ కోసం లుక్ అవుట్ నోటీసు, బ్లూ కార్నర్ నోటీసులను కూడా జారీ చేశారు. ప్రత్యేక కోర్టు రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ చేసినందున, పాస్‌పోర్ట్ రద్దు చేయాలని కర్ణాటక ప్రభుత్వం కోరినప్పటికి దీనిపై స్పందించడంలో కేంద్రం జాప్యం చేయడంపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర ఇటీవల ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పుడు తాజాగా రేవణ్ణ పాస్‌పోర్ట్‌ రద్దును పరిశీలిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ గతంలో వెల్లడించిన వివరాల ప్రకారం, రేవణ్ణ తన దౌత్య పాస్‌పోర్ట్‌ను రాజకీయ అనుమతి పొందకుండానే జర్మనీకి వెళ్లడానికి ఉపయోగించారని, ఇది తీవ్రమైన నేరంగా పరిగణిస్తారని అన్నారు. ఎంపీ జర్మనీకి వెళ్లడానికి సంబంధించి MEA నుండి ప్రత్యేకంగా ఎటువంటి రాజకీయ క్లియరెన్స్ కోరలేదు అని జైస్వాల్ చెప్పారు. కిడ్నాప్ ఆరోపణలపై ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి, దేవెగౌడ కుమారుడు, హెచ్‌డీ రేవణ్ణను కూడా ఇంతకుముందు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల మొదట్లో అరెస్టయిన ఆయన ఇప్పుడు బెయిల్‌పై బయటకు వచ్చారు.

Tags:    

Similar News