ఎడారి ఇసుకలో పాపడ్ కాల్చిన బీఎస్ఎఫ్ జవాన్!.. (వీడియో వైరల్)

శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటానికి భద్రతా దళాలు ఎండా వాన అనే బేధం లేకుండా కాపలా కాస్తునే ఉంటారు.

Update: 2024-05-22 09:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శత్రువుల నుంచి దేశాన్ని కాపాడటానికి భద్రతా దళాలు ఎండా వాన అనే బేధం లేకుండా కాపలా కాస్తునే ఉంటారు. కన్న వారిని సొంత ఊరిని వదిలిపెట్టి దేశ రక్షణే ప్రథమ కర్తవ్యంగా సర్వస్వాన్ని త్యాగం చేస్తారు. వారి కష్టాన్ని గుర్తించడానికి ఎటువంటి కొలమానాలు సరిపోవనేది అక్షర సత్యం. వారి కష్టం ఎలా ఉందో తెలిపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎడారి ఇసుకలో పాపడ్ ను కాల్చిన బీఎస్ఎఫ్ జవాన్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఎండ తీవ్రతను చూపించేందుకు కొందరు రోడ్డుపై కోడిగుడ్డు పగలకొట్టి ఆమ్లేట్ వేయడం చూస్తుంటాం. కానీ రాజస్థాన్ ఎడారిలో ఎండ తీవ్రతను చూపించేందుకు ఓ బీఎస్ఎఫ్ జవాన్ పాపడ్ ను కాల్చి చూపించాడు.

రాజస్థాన్ ఎడారిలో బికనీర్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా ఎండ తీవ్రత 45 డిగ్రీల నుంచి 47 డిగ్రీల మధ్య ఉంటోంది. అక్కడే అంత ఎండలో గస్తీ కాస్తున్న బీఎస్ఎఫ్ జవాన్ ఎడారి ఇసుకలో పాపడ్ ను ఉంచాడు. 30 సెకన్ల తర్వాత తీసి చూస్తే ఆ పాపడ్ పూర్తిగా కాలి తినడానికి రెడీ అయిపోయింది. దానిని తీసి నలిపి చూపించాడు. దీనికి సంబందించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీంతో జవాన్లపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. జవాన్లకు సెల్యూట్ చేస్తున్నారు. దేశం కోసం ఎండను, చలిని లెక్కచేయకుండా ప్రాణాలకు తెగించి కాపాలా కాస్తున్న జవాన్లకు ధన్యవాదాలు చెబుతున్నారు. జవాన్లు ఎండలో గస్తీ కాస్తున్నందునే మనం ఇంత చల్లగా ఏసీలో బ్రతుకుతున్నామని, కనీసం వారి కోసం అయినా చెట్లు నాటాలి అని ఇలా పలు రకాల కామెంట్లు పెడుతున్నారు. 

Similar News