మరోసారి పవర్ లోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు.. బీజేపీపై రాహుల్ గాంధీ విమర్శలు

బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.

Update: 2024-04-30 16:21 GMT

దిశ, నేషనల్ బ్యూరో: బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం ప్రమాదంలో పడుతుందన్నారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. మధ్యప్రదేశ్ లోని భింద్ లో జరిగిన ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగించారు. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు.. రెండు సిద్ధాంతాల మధ్య పోరు అని పేర్కొన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని లేదా దాన్ని రద్దు చేస్తారని మండిపడ్డారు.

రాజ్యాంగం వల్లే పేదలు, ఎస్టీలు, ఓబీసీలు అనేక హక్కులు పొందారు. రాజ్యాంగం వల్లే ఉపాధిహామీ హక్కులు, భూమి హక్కులు, రిజర్వేషన్లు సహా అనేక హక్కులు కల్పించిందన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని మండిపడ్డారు. తాము ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామ‌ని లేదా రద్దు చేస్తామ‌ని అమిత్ షా స‌హా బీజేపీ అగ్ర‌నేత‌లు స్ప‌ష్టంగా చెప్పార‌ని వెల్ల‌డించారు.

రిజర్వేషన్ల అంశంపై కూడా బీజేపీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. కేంద్ర ప్రభుత్వం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాకపోతే.. పీఎస్‌యూలు, రైల్వేలు, ఇతర రంగాలను ఎందుకు ప్రైవేటీకరించారని ప్రశ్నించారు. అగ్నివీర్ పథకం ఎందుకు తీసుకొచ్చారని అడిగారు. కాంట్రాక్ట పద్ధతిని ఎందుకు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈ చర్యలన్నీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఫైర్ అయ్యారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహాలక్ష్మి యోజన ద్వారా కోట్లాది మంది మహిళలను “లఖ్ పతి”గా మారుస్తామని చెప్పారు. మహిళల ఖాతాల్లోకి నెలకు రూ.8500 వేస్తామని గుర్తుచేశారు. మోడీ కేవలం 22నుంచి 25 మంది పారిశ్రామిక వేత్తలను బిలియనీర్లుగా మార్చగలిగితే..కాంగ్రెస్ కోట్లాది మంది మహిళలను లక్షాధికారులుగా మారుస్తుందని అన్నారు రాహుల్ గాంధీ.


Similar News