ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా పోటీ చేసినందుకు పవన్ సింగ్‌ను సస్పెండ్ చేసిన బీజేపీ

ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు భోజ్‌పురి నటుడు గాయకుడు పవన్ సింగ్‌ను పార్టీ నుంచి బీజేపీ బుధవారం సస్పెండ్ చేసింది.

Update: 2024-05-22 08:56 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్డీయే అభ్యర్థికి వ్యతిరేకంగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నందుకు భోజ్‌పురి నటుడు గాయకుడు పవన్ సింగ్‌ను పార్టీ నుంచి బీజేపీ బుధవారం సస్పెండ్ చేసింది. బీహార్‌లోని కరకత్ లోక్‌సభ స్థానం నుంచి ఎన్డీయే అభ్యర్థిగా రాష్ట్రీయ లోక్ మోర్చా అధినేత, కేంద్ర మాజీ మంత్రి ఉపేంద్ర కుష్వాహా పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయనకు పోటీగా స్వతంత్ర అభ్యర్థిగా పవన్ సింగ్‌ మే 9న తన నామినేషన్‌ను దాఖలు చేశారు. పార్టీ అధిష్టానం నిర్ణయానికి వ్యతిరేకంగా పోటీ చేస్తుండటంతో పార్టీ ప్రతిష్టను దిగజార్చడంతో పాటు, సిద్ధాంతాలకు విరుద్ధంగా క్రమశిక్షణను ఉల్లంఘించినట్లుగా పేర్కొంటూ పవన్ సింగ్‌‌ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు బీజేపీ బీహార్ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి ఆయనకు లేఖ రాశారు.

బీహార్ ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి మాట్లాడుతూ, "పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తే, పార్టీ చర్య తీసుకుంటుందని'' అన్నారు. తన తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకునేందుకే లోక్‌సభ ఎన్నికల్లో పోరాడుతున్నట్లు పవన్‌సింగ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లోని అసన్‌సోల్‌ నుంచి బీజేపీ టిక్కెట్‌ను తిరస్కరించిన తర్వాత ఆయన కరకత్‌ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. పవన్‌సింగ్‌ను బహిష్కరిస్తూ బీజేపీ తీసుకున్న నిర్ణయంపై రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వి యాదవ్ విలేకరులతో మాట్లాడుతూ, "ఉపేంద్ర కుష్వాహాను ఓడించడానికి ఇది కుట్ర. అంతర్గతంగా, బీజేపీ పవన్ సింగ్‌కు సహాయం చేస్తోంది" అని అన్నారు. జూన్ 1న కరకత్ లోక్‌సభ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.

Similar News