ఇండియా కూటమికి మమతా బెనర్జీ షాక్: బెంగాల్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతామని ప్రకటన
త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు.
దిశ, నేషనల్ బ్యూరో: త్వరలో పార్లమెంటు ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇండియా కూటమికి భారీ షాక్ తగిలింది. పశ్చిమ బెంగాల్‌లో ఒంటరిగా బరిలోకి దిగుతామని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా బెనర్జీ బుధవారం ప్రకటించారు. ఎన్నికల ఫలితాల తర్వాతే ఇండియా కూటమిలో చేరడంపై ఆలోచిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీట్ల షేరింగ్ విషయంపై కాంగ్రెస్‌తో జరిగిన చర్చలు విఫలమయ్యాయని తేల్చి చెప్పారు. రాష్ట్రంలోని 42స్థానాల్లో పోటీచేసి బీజేపీని ఓడిస్తామని వెల్లడించారు. మంగళవారం బిర్బూమ్ జిల్లాలో పార్టీ నాయకులతో మమతా బెనర్జీ సమావేశం ఏర్పాటు చేశారు. అప్పటి నుంచే టీఎంసీ ఒంటరిగా పోటీ చేస్తుందని జాతీయ మీడియాతో కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మమతా బెనర్జీ అధికారికంగా ప్రకటించడం గమనార్హం.
కాంగ్రెస్‌తో టీఎంసీకి ఎటువంటి సంబంధం లేదు
కాంగ్రెస్ పార్టీతో ఇక నుంచి టీఎంసీకి ఎటువంటి సంబంధం లేదని మమతా బెనర్జీ తెలిపారు. రాష్ట్రంలో పొత్తు ఉండబోదని చెప్పారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర గురువారం పశ్చిమ బెంగాల్ మీదుగా వెళ్లాల్సి ఉన్నా తమకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. నేను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రానికి వచ్చినపుడు చెప్పాల్సిన బాధ్యత వారికి లేదా అని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, కొద్ది రోజులుగా రాష్ట్రంలో సీట్ల పంపకం విషయంలో టీఎంసీ, కాంగ్రెస్ మధ్య వాదోపవాదాలు జరుగుతున్న విషయం తెలిసిందే.