భీమా కోరేగావ్ కేసు: గౌతం నవ్‌లఖాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

భీమా కోరేగావ్ కేసులో పౌర హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖాకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది.

Update: 2024-05-14 11:28 GMT

దిశ, నేషనల్ బ్యూరో: భీమా కోరేగావ్ కేసులో పౌర హక్కుల కార్యకర్త గౌతమ్ నవ్‌లాఖాకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో నవ్‌లాఖాకు మంజూరైన బెయిల్‌పై బాంబే హైకోర్టు విధించిన స్టేను పొడిగించేందుకు న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది. స్టే వ్యవధిని పెంచడానికి ఎటువంటి కారణం కనిపించడం లేదని పేర్కొంది. సాక్షుల సంఖ్య, ఇతర సంబంధిత అంశాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణ ముగియడానికి చాలా ఏళ్లు పట్టొచ్చని తెలిపింది. గౌతం నాలుగేళ్లుగా జైలులోనే ఉన్నారని, ఆయనపై ఇంకా అభియోగాలు కూడా నమోదు చేయలేదని వెల్లడించింది. ఈ మొత్తం వ్యవహారాన్ని చర్చించకుండా.. హైకోర్టు నిర్ణయంపై స్టే విధించడం సరికాదని తెలిపింది. ఈ మేరకు నవ్ లఖాకు బెయిల్ మంజూరు చేసింది. అయితే నవ్‌లఖా 2022లో నెల రోజుల పాటు గృహ నిర్భంధంలో ఉన్నందున ఆయన భద్రతకు గాను ఖర్చయిన రూ. 20లక్షలు చెల్లించాలని నవ్‌లఖాను ఆదేశించింది.

2017లో మహారాష్ట్రలోని పూణెలో ఎల్గార్ పరిషత్ నిర్వహించిన కార్యక్రమంలో ఆవేశపూరిత ప్రసంగం తర్వాత భీమా-కోరెగావ్‌లో హింస చెలరేగిన విషయం తెలిసిందే. అనంతరం ఈ కార్యక్రమ నిర్వాహకులకు నక్సలైట్లతో సంబంధాలున్నాయని పోలీసులు ఆరోపించి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే 2018లో నవ్ లఖాను అరెస్టు చేశారు. గతేడాది నవంబర్‌లో బాంబే హైకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.అయితే ఎన్‌ఐఏ అభ్యర్థన మేరకు నవ్‌లాఖా బెయిల్‌పై సుప్రీంకోర్టు స్టే విధించింది. అప్పటి నుంచి స్టేను పొడిగించిన న్యాయస్థానం తాజాగా బెయిల్ మంజూరు చేసింది.

కాగా, భీమా కోరేగావ్ కేసులో నవ్‌లఖాతో పాటు వరవరరావు, అరుణ్ ఫెరీరా, వర్షన్ గోన్సాల్వేస్, సుధా భరద్వాజ్‌, సురేంద్ర గాడ్లింగ్, సుధీర్ ధావలే, రోనావిల్సన్ సహా తదితరులను పోలీసులు నిందితులుగా చేర్చారు. మొత్తంగా ఈ కేసులో 16 మంది పౌర హక్కుల కార్యకర్తలను అరెస్టు చేయగా వారిలో ఐదుగురు ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. ఈ కేసులో అరెస్టైన స్టన్ స్వామి అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. 

Tags:    

Similar News