కాంగ్రెస్ పార్టీ మనస్తత్వమే అలా ఉంటుంది.. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై అన్నామలై కౌంటర్

భారతదేశం ఆక్రమణదారుల భూమి అని కాంగ్రెస్ నమ్ముతోందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు.

Update: 2024-05-08 11:12 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: భారతదేశం ఆక్రమణదారుల భూమి అని కాంగ్రెస్ నమ్ముతోందని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై అన్నారు. ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ సామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ మనస్తత్వం, ఆలోచన అలాగే ఉంటాయని, భారతదేశం ఆక్రమణ దారుల భూమి అని కాంగ్రెస్ నమ్ముతుందన్నారు. తమని కూడా ఆక్రమణదారుల వారసులుగా చూస్తోందని, ఇది చాలా క్రూరమైన దుర్వినియోగమైన విషయమని ఆయన పేర్కొన్నారు.

మనం చైనీయుల్లా, ఆఫ్రికన్లలా కనిపించినా తప్పేం లేదు కానీ మనం ఈ దేశ వారసులం కాదా? మనం భారతీయులం కాదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే దేశం బయట ఉండి వీడియో కన్ఫరెన్స్ లాంటి వాటి ద్వారా మాట్లాడుతున్నారో వాళ్లకే మనం ఆక్రమణదారుల వారసులు లాగా కనిపిస్తున్నామని అన్నారు. ఈ వ్యాఖ్యలు మనల్ని కించపరచడం ఒక్కటే కాకుండా దీంతో కాంగ్రెస్ పార్టీ యొక్క మనస్తత్వం బయటపడిందని తెలిపారు.

అందుకే నరేంద్ర మోడీ కాంగ్రెస్ ముక్త్ భారత్ అని అన్నారని, ఆయనకు కాంగ్రెస్ ఇంకెప్పుడు మన జీవితాల్లో ఉండకూడదని కోరుకుంటాన్నారని, అందుకే ప్రజలు తప్పకుండా 2024 లో కాంగ్రెస్ ను మరోసారి రిజెక్ట్ చేస్తారని అన్నామలై అన్నారు. కాగా శామ్ పిట్రోడా దేశంలో వైవిధ్యం గురించి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రజాస్వామ్యానికి మనమే ఓ చక్కని ఉదహారణ అని.. దేశంలోని తూర్పు ప్రజలు చైనీస్ లా కనిపిస్తారు, పశ్చిమంలో అరబ్ లా, ఉత్తరాది ప్రజలు తెల్లవారిలా దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్ లా కనిపిస్తారంటూ వివాదాస్పధ వ్యాఖ్యలు చేశారు.

Similar News