మొహమ్మద్ అలీ జిన్నాను "గ్రేట్" అన్నందుకు అఖిలేష్‌పై మండిపడ్డ అమిత్ షా

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Update: 2024-05-08 13:38 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పాకిస్థాన్ వ్యవస్థాపకుడు మహ్మద్ అలీ జిన్నాను గతంలో 'గొప్ప' నాయకుడిగా అఖిలేష్ యాదవ్‌ పేర్కొన్నారని గుర్తు చేస్తూ ఆయనపై విమర్శలు చేశారు. ఉత్తర ప్రదేశ్‌‌లోని హర్దోయ్‌లో జరిగిన ర్యాలీలో మాట్లాడిన అమిత్‌షా, 2021లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహావిష్కరణ సందర్భంగా అఖిలేష్ యాదవ్‌ జిన్నా గొప్ప నాయకుడిగా అభివర్ణించారని అన్నారు. అఖిలేష్ యాదవ్ చరిత్ర చదవాలి ఎందుకంటే భారతదేశ విభజనకు కారణం జిన్నా. ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే అఖిలేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. అలాంటి వారికి ఓటేయాలా? అని అమిత్ షా ప్రశ్నించారు.

అలాగే, ఇదే ర్యాలీలో రాహుల్‌పై కూడా విమర్శలు చేశారు. ఆయన ప్రతి వేసవిలో విశ్రాంతి తీసుకోవడానికి విదేశాలకు వెళ్తారని మండిపడ్డారు. ఎండలు పెరిగినప్పుడు రాహుల్ బాబా థాయ్‌లాండ్‌కు వెళతారు, కానీ ప్రధాని నరేంద్ర మోడీ 23 ఏళ్లలో విరామం తీసుకోలేదు. రాహుల్ బాబా అమేథీ నుండి వయనాడ్ వెళ్లి, ఆపై రాయ్‌బరేలీకి వచ్చారు, అక్కడి నుండి నేరుగా ఇటలీకి వెళతారు. ఇండియా కూటమి సభ్యుల మొత్తం కుంభకోణం రూ.12 లక్షల కోట్లుగా ఉంది, కానీ మోడీపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని అమిత్‌షా అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌లు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతాయని షా పేర్కొన్నారు.

Similar News