ఢిల్లీ-జమ్మూ హైవేపై ఘోర యాక్సిడెంట్.. ఒకే కుటుంబంలో 7 గురు మృతి

ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

Update: 2024-05-24 04:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ-జమ్మూ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి ఏడుగురు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ముందు ఉన్నటువంటి ట్రక్కు డ్రైవర్ సడన్‌గా బ్రేకులు వేయడంతో వెనక వస్తున్న మినీ బస్సు దానిని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే, ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ నుంచి మినీ బస్సులో ఒకే కుటుంబానికి చెందిన 30 మందికి పైగా జమ్మూలోని వైష్ణో దేవి తీర్థయాత్రకు వెళుతున్నారు. ఈ క్రమంలో అంబాలా సమీపంలో బస్సుకు ముందు వెళ్తున్న ట్రక్కు అకస్మాత్తుగా బ్రేక్‌లు వేయడంతో, బస్సు డ్రైవర్ సకాలంలో వాహనాన్ని కంట్రోల్ చేయలేపోయాడు. దీంతో వేగంగా ప్రయాణిస్తున్న బస్సు ట్రక్కును ఢీకొట్టింది, దీంతో బస్సు ముందు భాగం చితికిపోయింది.

బస్సులోనే ప్రయాణికులు చిక్కుకున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రమాదంలో కుటుంబ సభ్యులు ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడిన మిగతా వారికి దగ్గరిలోని ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. వీరిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉండటంతో పెద్ద ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

ట్రక్కు డ్రైవర్ సంఘటనా స్థలం నుండి పారిపోయాడని, అయితే అతని వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడిన ధీరజ్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ట్రక్కు ముందు ఉన్న కారు పెట్రోల్ పంపు వద్ద అకస్మాత్తుగా మలుపు తిరిగింది, దాంతో ట్రక్ డ్రైవర్ తన బ్రేక్‌లు వేయడంతో, దాని వెనక ఉన్న మా బస్సు సడన్‌గా కంట్రోల్ కాలేకపోవడంతో ట్రక్కును ఢీకొట్టినట్లు తెలిపాడు.

Similar News