మూడో దశలో 61.45 శాతం పోలింగ్..ఆ రాష్ట్రంలోనే అత్యధికం!

దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ 6గంటల వరకు కొనసాగింది.

Update: 2024-05-07 16:49 GMT

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల మూడో విడత పోలింగ్ ముగిసింది. మొత్తం 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 93 నియోజకవర్గాల్లో మంగళవారం ఉదయం 7గంటలకు మొదలైన పోలింగ్ 6గంటల వరకు కొనసాగింది. అయితే పోలింగ్ సమయం ముగిసినప్పటికీ పలు కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. దీంతో వారందరికీ అధికారులు ఓటు వేసే అవకాశం కల్పించారు. పలు రాష్ట్రాల్లో స్వల్ప ఉద్రిక్తతలు మినహా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. పోలింగ్ నేపథ్యంలో భారీగా బలగాలను కేంద్రాల వద్ద మోహరించారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకారం..6గంటల వరకు మొత్తంగా 61.45 శాతం పోలింగ్ నమోదైంది. అసోంలో అత్యధికంగా 75.26శాతం పోలింగ్ నమోదు కాగా..మహారాష్ట్రలో అత్యల్పంగా 54.77శాతం ఓటింగ్ నమోదైంది.

గుజరాత్‌లోని మొత్తం 26లోక్ సభ స్థానాలకు గాను సూరత్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడంతో 25 స్థానాలకు పోలింగ్ జరగగా 56.76శాతం పోలింగ్ నమోదైంది. ఇక పశ్చిమ బెంగాల్‌లో నాలుగు సీట్లకు గాను 73.93శాతం, బిహార్‌లో 5 స్థానాలకు గాను 56.55శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 11 లోక్ సభ స్థానాలకు 66.99శాతం, దాద్రానగర్ హవేలీలో 2 సెగ్మెంట్లకు గాను 65.23శాతం, గోవాలో 2 స్థానాలకు 74.27 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం తెలిపింది. అలాగే కర్ణాటకలో 14 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగగా 67.76, మధ్యప్రదేశ్‌లో 9 స్థానాలకు 63.9 శాతం, ఉత్తరప్రదేశ్ లో 10 స్థానాల్లో 57.34శాతం ఓటింగ్ నమోదైంది. వీటితో కలిపి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 20రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 283 లోక్ సభ స్థానాలకు పోలింగ్ ముగిసింది. కాగా, మొదటి దశలో 66.14శాతం, రెండో దశలో 66.71శాతం ఓటింగ్ నమోదైంది.

పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత

ఓటింగ్ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ముర్షిదాబాద్‌ బీజేపీ అభ్యర్థి, టీఎంసీ మద్దతుదారు మధ్య ఘర్షణ జరిగింది. అలాగే ఓ పోలింగ్ కేంద్రంలో నకిలీ ఏజెంట్‌ను గుర్తించి పోలీసులు అదపులోకి తీసుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్‌లో ప్రజలపై పోలీసులు లాఠీచార్జ్ చేయగా పలువురికి గాయాలైనట్టు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్‌పూర్‌లో ఓటు వేసేందుకు వస్తూ ఓ వృద్ధ ఓటర్ మృతి చెందాడు. ఇక, బిహార్‌లో ఓటింగ్ సందర్భంగా సుపాల్‌ పోలింగ్ బూతులో ప్రిసైడింగ్ అధికారి గుండెపోటుతో మరణించాడు.

ఓటేసిన ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో మోడీ ఓటు వేశారు. ఓటేసిన అనంతరం మోడీ పోలింగ్ బయట ఉన్న చిన్నారులతో సరదాగా గడిపారు. వారి చేతులపై ఆటోగ్రాఫ్ ఇచ్చారు. ప్రజలు అధిక సంఖ్యలో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం అహ్మదాబాద్‌లో ఓటేశారు. ఇక, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జు ఖర్గే తన సతీమణి రాధాబాయి ఖర్గేతో కలిసి కర్ణాటకలోని కలబురగిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆయన భార్య ప్రీతి అదానీ ఓటు వేశారు. ఉత్తరప్రదేశ్‌లో అఖిలేష్ యాదవ్ సైతం ఓటు వేశారు.

మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామం

మహారాష్ట్రలోని బారామతి నియోజకవర్గంలో జరిగిన ఓటింగ్‌లో ఆసక్తి కర పరిణామం చోటుచేసుకుంది. ఇక్కడ ఎన్సీపీ(శరద్ పవార్ వర్గం) తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థి సుప్రియా సూలే ఓటు వేసిన తర్వాత మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఇంటికి వెళ్లారు. అజిత్ తల్లితో కాసేపు మాట్లాడారు. అయితే ఈ స్థానం నుంచి ఎన్సీపీ తరఫున అజిత్ భార్య సునేత్ర పవార్ పోటీలో ఉండటం గమనార్హం.  

Tags:    

Similar News