లోక్‌సభ అభ్యర్థుల్లో 1644 మంది నేరచరితులు: ఏడీఆర్ రిపోర్టులో కీలక విషయాలు

ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తు్న్న 1644 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది.

Update: 2024-05-23 04:10 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ప్రస్తుతం జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తు్న్న 1644 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్(ఏడీఆర్) వెల్లడించింది. ఈ అభ్యర్థుల్లో 1,188 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారని, ఇందులో హత్య, హత్యాయత్నం, మహిళలపై అఘాయిత్యాలు, ద్వేషపూరిత ప్రసంగాలకు సంబంధించిన కేసులు ఉన్నాయని తెలిపింది. మొత్తంగా 8,360 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా.. అందులో 8,337 మంది అభ్యర్థుల అఫిడవిట్లను విశ్లేషించి ఏడీఆర్ ఈ నివేదికను రూపొందింది.

మొదటి దశ ఎన్నికల్లో 1618 మంది అభ్యర్థులకు గాను 252 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని పేర్కొంది. ఇందులో161 మందిపై తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నట్టు తెలిపింది. ఇక, రెండో దశలో 1192 మందికి గాను 250 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా..167 మందిపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. అలాగే మూడో దశలో 1,352 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా..244 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. అందులోనూ 172 అభ్యర్థులపై తీవ్ర నేరారోపణలు ఉన్నాయి. ఫేజ్ 4లో అత్యధిక సంఖ్యలో 1,710 అభ్యర్థుల్లో 360 మందిపై నేరారోపణలు ఎదుర్కొంటుండగా, 274 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయి.

ఫేజ్ 5లో 695 మంది అభ్యర్థుల్లో 159 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా, 122 మంది తీవ్రమైన నేరారోపణలు ఎదుర్కొంటున్నారు. ఆరో దశలో 866 మంది క్యాండిడేట్స్‌కు గాను 180 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. 141 మంది తీవ్రమైన కేసుల్లో ఉన్నారు. ఏడో దశలో 904 అభ్యర్థుల్లో 199 మంది నేరారోపణలు ఎదుర్కొంటున్నారు.151 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయి. కాగా, ఏడు దశల్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు గాను ఇప్పటి వరకు ఐదు దశల పోలింగ్ ముగిసింది. మే 25 జూన్ 1 తేదీల్లో మరో రెండు దశలకు పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఫలితాలు వెల్లడి కానున్నాయి. 

Tags:    

Similar News