అందంగా లేనని, ఆఫర్స్ రాలేదని సంవత్సరం పాటు రోజు ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లో వాటి కోసం తిరిగాను: అల్లు అర్జున్

'గంగోత్రి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Update: 2024-05-09 05:01 GMT

దిశ, సినిమా: 'గంగోత్రి' సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ హీరోగా అల్లు అర్జున్‌కి గుర్తింపు తెచ్చిన మూవీ మాత్రం 'ఆర్య' అనే చెప్పుకోవాలి. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా అను మెహతా హీరోయిన్ గా శివ బాలాజీ ప్రధాన పాత్రలో అప్పట్లొ 125 రోజులు ఆడి ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఈ సినిమా విడుదలై నిన్నటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం 'ఆర్య' 20 ఏళ్ల సెలబ్రేషన్స్ నిర్వహించింది.

ఈ కార్యక్రమానికి అల్లు అరవింద్, 'దిల్' రాజు, డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన జర్నీ గురించి ఆసక్తికర విషయాలు తెలియజేశారు. ఆర్య మూవీ సింగిల్ మూమెంట్లో నా జీవితాన్ని మార్చేసిన అతిపెద్ద సినిమా అని, "గంగోత్రి సినిమా సూపర్ హిట్. కానీ నేను అందంగా లేనని, స్క్రీన్ ప్రెజెన్స్ బాగా లేదని నన్ను ఎవరూ పట్టించుకోలేదు. అలా ఏడాది పాటు ఆర్టీసీ క్రాస్ రోడ్డు కి వెళ్లి సినిమాలు చూస్తూ పని పాట లేకుండా పిచ్చివాడిలా తిరుగుతున్న టైం లో దిల్ రాజు గారి 'దిల్' సినిమా వచ్చింది. ఆ సినిమాను ప్రసాద్ ల్యాబ్స్ కి వెళ్లి చూసాను. అక్కడ సుకుమార్ గారు నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నాతో సినిమా చేస్తానని, కథ చెప్పారు. ఇంకా కథ నాకు పిచ్చి పిచ్చిగా నచ్చింది. అప్పుడు ఇండస్ట్రీకి అందరూ కొత్తవారే.

అప్పుడే ఓ సినిమా చేసిన దిల్ రాజు గారికి అప్పుడప్పుడే గుర్తింపు వస్తుంది. సుకుమార్ గారు కొత్త డైరెక్టర్. నేను కొత్తవాడినే. నన్ను నమ్మి సినిమా హిట్ కొడతారు అనే నమ్మకం లేదు. కథ మాత్రం చాలా బాగుంది. అప్పుడే వివి వినాయక్ గారు మా డాడి దగ్గరికి వచ్చి ఒకటే మాట చెప్పారు. మీరు సినిమా తీయండి, ఆ కుర్రాడు తీయగలడు. నన్ను నమ్మండి. మూవీ చేయండి అన్నారు. ఒకవేళ ఏదైనా సీన్ మీకు నచ్చకపోతే నేను వచ్చి సినిమా చేస్తాను అని ఆ ఒక్క మాట చేప్పడంతో మా అందరిలో వెయ్యి ఏనుగుల ధైర్యం వచ్చింది. ఈ విషయంలో వివి వినాయక్ గారికి మరోసారి థాంక్స్ చెప్పుకుంటున్నాను" అంటూ బన్నీ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’ షూటింగ్‌తో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఆగస్ట్ 15న థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. ఇప్పటికే పుష్ప-2 నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి.

Similar News