'శశివదనే' టైటిల్ సాంగ్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్!
రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా రూపొందుతోన్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా ‘శశివదనే’
దిశ, సినిమా: రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా రూపొందుతోన్న లవ్ అండ్ యాక్షన్ డ్రామా 'శశివదనే'. గౌరీ నాయుడు సమర్పణలో ఎస్.వి.ఎస్. కన్స్ట్రక్షన్స్ ప్రై.లి, ఎ.జి.ఫిల్మ్ కంపెనీ బ్యానర్లపై సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో అహితేజ బెల్లంకొండ నిర్మిస్తున్నారు. అయితే త్వరలో విడుదల కానున్న సినిమా నుంచి తాజాగా డైరెక్టర్ హరీష్ శంకర్ టైటిల్ సాంగ్ విడుదల చేశారు.
హరి చరణ్, చిన్మయి శ్రీపాద పాడిన ఈ పాటను కిట్టు విస్సాప్రగడ రాయగా శరవణ వాసుదేవన్ సంగీతం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శంకర్..'చాలా రోజుల తర్వాత మంచి శాస్త్రీయ సంగీతాన్ని వినిపించినందుకు శరవణన్ థాంక్స్ అండ్ కంగ్రాట్స్. మూవీ టైటిల్ బాగా నచ్చింది. హీరోహీరోయిన్ల కెమిస్ట్రీ బాగుంది. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. మంచి కంటెంట్, సంగీతంతో వచ్చే సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నా' అన్నాడు.
అలాగే ఇంగ్లీష్ పదం లేకుండా పూర్తిగా తెలుగు పదాలున్న పాట బాగుంటుందన్న దర్శకనిర్మాతలు.. హరీష్ శంకర్ లాంటి పెద్ద దర్శకుడు తన మూవీ సాంగ్ రిలీజ్ చేయడం డ్రీమ్ కమ్ ట్రూ మోమెంట్గా పేర్కొన్నారు. చివరగా తమ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నట్లు తెలిపారు.