పగలు ప్రసవించిన వెలుగులను
రాత్రి దుప్పటి కప్పేస్తుంది
పగలంతా అలసిన కళ్ళు
అవుతాయి విశ్రాంతి గుడారాలు!
రాత్రంతా కనురెప్పల కౌగిలింతలు
మనసంతా కలల పంటలు
జ్ఞాపకాలు దోబూచులాడుతాయి
నిన్నటివే కాదు చిన్నప్పటివి కూడా!
ఓ రాత్రంతా ఆనందం వెల్లువిరిస్తుంది
మరో రాత్రి ఎంతో ఆవేదనల రోదన
ఆవేశాలు వద్దని ఆదేశాలు
సహనంగా ఉండాలని సందేశాలు!
రేపటి పనుల సంపుటి
ఈ రాత్రే ముద్రించబడుతుంది
మంచీ చెడులకు రాత్రంతా
చర్చా వేదిక అవుతుంది!
రాతిరికి ఆలోచనల కుంచెలు
రేపటి భవిష్యత్తును చిత్రీకరిస్తాయి
రాత్రి బోధివృక్షం అవుతుంది
ఎంతో జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది!!
జగ్గయ్య.జి
98495 25802