ప్లాంట్ బ్లైండ్‌నెస్ అంటే ఏమిటి?.. పర్యావరణానికి హానిచేసే ఈ ధోరణి ఎందుకు పెరుగుతోంది?

‘ప్లాంట్ బ్లైండ్‌నెస్’ గురించి మీరెప్పుడైనా విన్నారా? పర్యావరణ వ్యవస్థలో సంభవించే ప్రతి కూల మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు మానవాళినే కాదు, సమస్త జీవరాశి మనుగడను ప్రమాదంలో పడేస్తాయి. ఇప్పటికే ఈ విధమైన ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి.

Update: 2024-05-22 12:57 GMT

దిశ, ఫీచర్స్ : ‘ప్లాంట్ బ్లైండ్‌నెస్’ గురించి మీరెప్పుడైనా విన్నారా? పర్యావరణ వ్యవస్థలో సంభవించే ప్రతి కూల మార్పులు, ప్రకృతి వైపరీత్యాలు మానవాళినే కాదు, సమస్త జీవరాశి మనుగడను ప్రమాదంలో పడేస్తాయి. ఇప్పటికే ఈ విధమైన ఆందోళనలు ప్రపంచ వ్యాప్తంగా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్లాంట్ బ్లైండ్‌నెస్ ట్రెండింగ్‌లోకి వచ్చింది. మన చుట్టూ ఉన్న మొక్కలను, వృక్షజాలాన్ని మనం తక్కువ అంచనా వేయడం లేదా చులకన చేయడాన్నే నిపుణులు ‘ప్లాంట్ బ్లైండ్‌నెస్’గా పేర్కొంటున్నారు. మనుషుల్లో ఈ ధోరణి పర్యావరణ వ్యవస్థకు, మానవ ఆరోగ్యానికి హానిచేస్తుందని చెప్తున్నారు. అదెలాగో చూద్దాం.

ప్లాంట్ బ్లైండ్‌నెస్ అంటే?

వాస్తవానికి మొక్కలు, చెట్లు మొత్తం పర్యావరణ వ్యవస్థకు, మావవాళికి మేలు చేస్తున్నాయి. కానీ అత్యధిక మందికి ఈ విధమైన అవగాహన లేకపోవడం, వాటి ప్రాధాన్యతను గుర్తించకపోవడం, వాటితో అనుబంధం లేకపోవడం, మన చుట్టూ ఉన్న మొక్కల పేర్లను, రూపాలను గుర్తించకపోవడం వంటివి ప్లాంట్ బ్లైండ్‌నెస్ ప్రాథమిక లక్షణాలకు నిలువెత్తు నిదర్శనం. అడవిలో నిల్చొని ఉన్నప్పుడు కూడా చాలామందికి పులులు, సింహాలు వంటి జంతువుల పేర్లు, వాటి రూపాలు ఠక్కున గుర్తుకు వస్తుంటాయి. కానీ మొక్కలు లేదా చెట్ల పేర్లు, రూపాలు గుర్తుకు రావు. ఒక యూఎస్ స్టడీ ప్రకారం పిల్లలు మొక్కల చిత్రాలకంటే కూడా జంతువుల చిత్రాలనే బాగా గుర్తుంచుకుంటున్నారు.

మొదట ఎవరు గుర్తించారు?

ప్లాంట్ బ్లైండ్‌నెస్ ప్రపంచ వ్యాప్తంగా ఉందని యూఎస్ జీవశాస్త్రజ్ఞులు, అధ్యాపకులు అయినటువంటి ఎలిసబెత్ సుష్లర్ అండ్ జేమ్స్ వాండర్నీ తమ నివేదికలో పేర్కొన్నారు. వీరు మొట్ట మొదటిసారిగా1998లో పర్యావరణ వ్యవస్థలు, ప్రకృతి పరిరక్షణ అధ్యయనాల్లో భాగంగా ప్రజల్లో ఈ ధోరణిని గుర్తించి దానికి ‘ప్లాంట్ బ్లైండ్‌నెస్’ అనే పేరు పెట్టారు. తమ సొంత వాతావరణంలోనే మొక్కలను గమనించలేకపోయే రుగ్మతగా దానిని అభివర్ణించారు.

మొక్కల ప్రాధాన్యత

వాస్తవానికి మానవ జీవితం, జీవరాశి మనుగడ అంతా మొక్కలపై ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే మొక్కలు జీవావరణ వ్యవస్థలకు పునాది వంటివి. లెక్కలేనన్ని జీవ జాతులకు ఆశ్రయాన్ని కల్పిస్తాయి. ఆహారాన్ని, ఆక్సిజన్‌ను అందిస్తాయి. కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించి ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేయడం ద్వారా వాతావరణంలో ప్రతికూల మార్పులను తగ్గిస్తాయి. మానవులకు, జంతువులకు ప్రధాన ఆహార వనరు కూడా మొక్కలే.

ఔషధాల తయారీలో..

ప్రస్తుతం అనేక రోగాలను నయం చేయగల ఔషధాల తయారీలో మొక్కలు లేదా చెట్ల ఆధారిత ఉత్పత్తులు కీలకంగా ఉంటున్నాయి. భవిష్యత్తులో మెరుగైన వైద్య పురోగతికి, పరిశోధనలకు మొక్కలే కీలకం. శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణలో, చికిత్సలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మొక్కలు ఉపయోగపడుతున్నాయి. సుమారు 28,000 కంటే ఎక్కువ వృక్షజాతులు నేడు ప్రధాన ఔషధ వనరులుగా ఉంటున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రక్తహీనతను దూరం చేసే మెడికేషన్స్, క్యాన్సర్ నిరోధక మందులు అన్నీ మొక్కల ఆధారిత ఔషధాలే.

పర్యావరణంపై నిర్లక్ష్యం

ప్లాంట్ బ్లైండ్‌నెస్ రోజు రోజుకూ విస్తరించడం ప్రపంచ వ్యాప్తంగా మొక్కల సంరక్షణపై తగ్గుతున్న ఆసక్తిని వెల్లడిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకృతి, పర్యావరణ వ్యవస్థలపట్ల అవగాహన కల్పించే ప్లాంట్ బయాలజీ కోర్సులు కూడా ఇటీవల మూతపడుతున్నాయి. ప్లాంట్ సైన్స్ కోసం నిధుల కేటాయింపులు తగ్గుతున్నాయి. పెరుగుతున్న అర్బనైజేషన్, టెక్నాలజీతో గడిపే సమయం వంటివి ‘ప్రకృతి లోటు రుగ్మత’లకు (nature deficit disorder)దారితీస్తున్నాయి. మొక్కలతో గడిపే సమయం తగ్గడంవల్ల ప్లాంట్ బ్లైండ్ నెస్ మరింత పెరుగుతోంది.

పరిష్కారం ఏమిటి? 

వివిధ రకాల మొక్కలు, పర్యావరణ వ్యవస్థలో వాటి పాత్ర గురించి తెలుసుకుంటే సగం పరిష్కారం లభించినట్లే. ప్రజలు తమవంతు బాధ్యతగా మొక్కలతో అనుబంధం పెంచుకోవాలి. తోటల పెంపకం, సంరక్షణ వంటివి నిర్వహించాలి. ఇంటి ఆవణలో, అడవుల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలను పెంచడం, వాటి పేర్లను, రూపాలను గుర్తు పెట్టుకోవడం, వాటి గురించి చర్చించడం, అవగాహన కల్పించడం వంటివి చేయాలి. హార్టికల్చర్ యార్టివిటీస్‌లో పాల్గొనాలి. ఇలాంటివన్నీ మీలోని ప్లాంట్ బ్లైండ్‌నెస్‌ను పోగొట్టి పర్యావరణ వ్యవస్థకు మేలు చేస్తాయి. అలాగే ప్రభుత్వాలు మొక్కలు, పర్యావరణం వంటి అంశాలకు ప్రాయారిటీ ఇవ్వాలి. కోర్సులుగా బోధించాలి.

Similar News