Love and Divorce : ప్రేమ వివాహాల్లోనూ విడాకులు ఎందుకు పెరుగుతున్నాయ్?

లవ్ మ్యారేజ్ అయినా, అది అరైంజ్డ్ మ్యారేజ్ అయినా.. వైవాహిక బంధం నిండు నూరేళ్లు కొనసాగుతుందని ఒకప్పుడు నమ్మేవారు. కానీ ఇప్పుడా నమ్మకం సడలుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జంటలు డివోర్స్ తీసేకునే సంఖ్య పెరిగిపోతోందని రిలేషన్‌షిప్ నిపుణులు చెప్తున్నారు.

Update: 2024-05-27 12:45 GMT

దిశ, ఫీచర్స్ : లవ్ మ్యారేజ్ అయినా, అది అరేంజ్డ్ మ్యారేజ్ అయినా.. వైవాహిక బంధం నిండు నూరేళ్లు కొనసాగుతుందని ఒకప్పుడు నమ్మేవారు. కానీ ఇప్పుడా నమ్మకం సడలుతోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో జంటలు డివోర్స్ తీసేకునే సంఖ్య పెరిగిపోతోందని రిలేషన్‌షిప్ నిపుణులు చెప్తున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా చిన్న చిన్న తగాదాలతో విడిపోతున్నారు. ఎందుకిలా?..

అరేంజ్డ్ మ్యారేజ్‌లో అయితే అంటే.. అప్పటి వరకు ముక్కూ ముహం తెలియని వ్యక్తితో కలిసి నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెంటనే కొన్ని ఇబ్బందులు తలెత్తవచ్చు. అర్థం చేసుకోవడానికి బదులు అపార్థాలకు ప్రయారిటీ ఇవ్వడంవల్ల అరుదుగా కొందరు డివోర్స్ వరకూ వెళ్లవచ్చు. కానీ ప్రేమ వివాహాల్లోనూ ఎందుకలా జరుగుతోందనే ఆందోళన, సందేహాలు పలువురిని వెంటాడుతున్నాయి.

లవ్ కొంత కాలమేనా?

‘లవ్ కొంత కాలమే బాగుంటుంది’ ఓ సినిమాలోని డైలాగ్ ఇది. కానీ ఇటీవల పలువురి వాస్తవ జీవితాలను కూడా ప్రతిబింబిస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు కూడా ఎక్కువకాలం కలిసి మెలిసి జీవించలేకపోతున్నారు. ఇక చిన్న చిన్న కారణాలతో ఇన్‌స్టాంట్ బ్రేకప్స్ (Instant Breakups) షరా మామూలైపోతున్నాయి. కామన్‌మెన్ నుంచి సెలబ్రిటీల వరకు మొదట్లో గాఢంగా ప్రేమించుకుని, పెళ్లి చేసుకున్న వారు కూడా తర్వాత అంతే చిరాకుతో విడిపోతున్నారు.

అసలు కారణాలు ఇవేనా?

అరైంజ్డ్ మ్యారేజెస్‌లో విడాకులు అంత ఈజీ కాదు. విడిపోవాలని భార్యా భర్తలు క్షణికావేశంలో అనుకున్నంత మాత్రాన సరిపోదు. అది జరగాలంటే వారి తరఫున రెండు కుటుంబాల జోక్యం, నిర్ణయాలపై కూడా ఆధారపడి ఉంటుంది. దాదాపు సర్దుకుపోవడం, సర్దిచెప్పడం ద్వారా సమస్య సద్దుమణగడమే ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డివోర్స్ రేట్ తక్కువగా ఉంటుందని ఫ్యామిలీ కౌన్సెలర్లు, రిలేషన్‌షిప్ నిపుణులు చెప్తున్నారు. కానీ లవ్ మ్యారేజెస్‌లో ఇందుకు భిన్నంగా ఉంటుంది. ఇక్కడ విడాకులు తీసుకోవాలా? వద్దా అనేది భార్యా భర్తల నిర్ణయంపైనే ఎక్కువ ఆధారపడి ఉంటుంది. ఏవైనా మనస్పర్థలు, గొడవలు వచ్చినప్పుడు పెద్దలకు చెప్తే ‘మీరే ప్రమించి పెళ్లి చేసుకున్నారని అంటారనే భయం, నలుగురిలో చులకనగా చూస్తారనే ఆలోచనతో ప్రేమ వివాహాలు చేసుకున్న వారిలో చాలామంది పెద్దలకు చెప్పకుండానే విడాకుల నిర్ణయం తీసేసుకుంటున్నారు.

క్రమంగా తగ్గిపోతున్న ప్రేమ

సహజంగానే ఒక వ్యక్తి ప్రేమలో పడిన కొత్తలో తన ప్రేమికుడు లేదా ప్రేమికురాలితో ఎక్కువసేపు గడిపే సమయం ఉండదు. చదువు, ఉద్యోగం, సమాజం, పెళ్లి అవ్వకముందే చనువు ఇవ్వకూడదనే ఆలోచన.. వంటివి ఇక్కడ కీ రోల్ పోషిస్తుంటాయి. కాబట్టి సహజంగానే ప్రేమికుల్లో తరచూ కలుసుకోవాలి. కలిసి జీవించాలి అనే ఆతృత అధికంగా ఉంటుంది. కానీ పెళ్ల తర్వాత పరిస్థితి వేరు. ఉదయం నిద్రలేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రేమించిన వ్యక్తి కళ్ల ముందే ఉండటం, పరస్పర అవసరాలు, కోరికలు తీరిపోవడం అనేవి క్రమంగా ప్రేమ తగ్గిపోవడానికి, బాధ్యతలు పెరగడానికి దారితీస్తుంది. ఇక్కడే చాలామంది అర్థం చేసుకోవడంలో పొరపాటు పడతారు. ప్రేమించిన తొలినాటి అనుభవం, అనుభూతి లేకుండా పోయిందనే నిర్ణయానికి వచ్చిన వారిలో ఏదో ఒక కారణంతో మనస్పర్థలు పెరిగిపోయి, విడాకుల వరకు దారితీయవచ్చు.

అసౌకర్యంగా ఫీలవడం..

సౌకర్యంగా ఉండలేని పరిస్థితుల నడుమ ఎక్కువకాలం కలిసి ఉండలేమనే ఆలోచనలు కూడా ప్రేమ వివాహాల్లో విడాకులకు మరో కారణమని నిపుణులు చెప్తున్నారు. ఉద్యోగాలకు వెళ్లినా, ఇంటిలో ఉంటున్నా, బంధువులు వచ్చినా, స్నేహితులతో మాట్లాడినా.. ఇలా ఎక్కడో ఒకచోట మనస్పర్థలు స్టార్ట్ అవుతుంటాయి. స్వతంత్రంగా ఉండటం కష్టంగా అనిపిస్తుంది. ప్రేమించుకున్న కొత్తలో ప్రతిదీ తానే నిర్ణయించుకొని, తనకు నచ్చినట్లు ఉన్న వ్యక్తి, పెళ్లి తర్వాత కొన్ని విషయాల్లో కుటుంబానికి సంజాయిషీ చెప్పాల్సి రావడం, కుటుంబ అవసరాలను బట్టి నడుచుకోవడం కారణంగా ఇద్దరిలో ఎవరో ఒకరు అసౌకర్యంగా భావించే సందర్భాలు క్రమంగా విడాకులకు దారితీస్తున్నాయి.

ఎక్కువసేపు కలిసి ఉంటే..

లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తులు ఎక్కువసేపు కలిసి ఉంటున్న సందర్భంలో కుటుంబ సమస్యలను ప్రస్తావిస్తూ తగాదా పడే సందర్భాలు ఎక్కువగా ఉంటున్నాయి. భార్యా భర్తలు పెళ్లి తర్వాత జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడం, ఏ ఒక్కరు కూడా లాయల్‌గా ఉండకపోవడం విడాకులకు దారితీస్తున్నాయి. ప్రేమించిన వ్యక్తితోపాటు అతని లేదా ఆమె కుటుంబ సభ్యుల జోక్యం ఎక్కువైందని కొందరు భావిస్తుంటారు. ఈ సందర్భంలో పరస్పరం మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందాం అనే స్టేజ్ నుంచి కళ్ల ముందు ఉంటే గొడవలే అవుతాయనే స్టేజ్‌కి వెళ్లిపోతారు. ఇలా అనేక అంశాల్లో ఎవరూ తగ్గకపోవడంతో విడాకులు ఫైనల్ చేసేసుకుంటున్నారు. 

Similar News