Heat wave : వలస పక్షుల విల విల.. వేడి వాతావరణానికి తట్టుకోలేక ప్రాణాలు వదులుతున్నాయంటున్న నిపుణులు

ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో వస్తున్న ప్రతికూల మార్పులు, రోజు రోజుకూ వేడెక్కుతున్న వేసవి వాతావరణం పక్షులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తున్న సందర్భంలో హీట్‌వేవ్‌ను తట్టుకోలేక అనేక పక్షులు మృత్యువాత పడుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి.

Update: 2024-05-16 09:10 GMT

దిశ, ఫీచర్స్ :  ప్రపంచ పర్యావరణ వ్యవస్థలో వస్తున్న ప్రతికూల మార్పులు, రోజు రోజుకూ వేడెక్కుతున్న వేసవి వాతావరణం పక్షులకు ప్రాణాంతకంగా మారుతోంది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వలస వెళ్తున్న సందర్భంలో హీట్‌వేవ్‌ను తట్టుకోలేక అనేక పక్షులు మృత్యువాత పడుతున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి ప్రతి సమ్మర్ సీజన్‌లో మిలియన్ల కొద్దీ పక్షులు వేడి వాతావరణం నుంచి తమను తాము రక్షించుకోవడానికి చల్లటి ప్రదేశాలకు ఎగిరిపోతుంటాయి. ఇలా జర్నీ చేసే క్రమంలో సడెన్‌గా మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్నాయి.

ప్రయాణిస్తూనే చనిపోతున్న పక్షులు

రెక్కలతో ఎగురుతూ లక్షలాది కిలోమీటర్లు ప్రయాణించే పక్షులు వలసల క్రమంలో ఎదురయ్యే క్లైమేట్ చేంజ్ మార్పులను ఎదుర్కొంటాయి. అయితే ఇటీవల పెరుగుతున్న హీట్‌వేవ్‌ను మాత్రం కొన్ని పక్షులు తట్టుకోలేక మధ్యలోనే ప్రాణాలు వదులుతున్నట్లు జార్జ్‌టౌన్ యూనివర్సిటీ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ఎన్విరాన్‌మెంట్ & సస్టైనబిలిటీ నిపుణుల అధ్యయనంలో వెల్లడైంది. ఆయా పక్షిజాతులు వలసల్లో భాగంగా ప్రయాణిస్తున్న క్రమంలో మధ్య మధ్యలో ఒక్కసారిగా మారుతున్న వాతావరణం, వేడిగాలులు, అదే సందర్భంలో తగిన ఆహారం, నీరు దొరకకపోవడంతో మృత్యువాత పడుతున్నాయి. మరికొన్ని పక్షులు తీవ్రంగా అలసిపోయి చనిపోతున్నాయి.

పక్షుల నివాసాలు, ఆహార లభ్యతపై ప్రభావం

హీట్‌వేవ్ ప్రభావం వలస పక్షులను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకునే క్రమంలో పరిశోధకులు కెనడా, కరేబియన్ మధ్య వలస వెళ్లే చిన్న చిన్న సాంగ్ బర్డ్స్, అలాగే ‘అమెరికన్ రెడ్‌స్టార్ట్’ పక్షులను పరిశీలించారు. ఇందుకోసం వారు ఆటోమేటెడ్ రేడియో ట్రాకింగ్, ‘లైట్- లెవల్ ట్యాగ్‌’ల వంటి పరికరాలను ఉపయోగించారు. అలాగే గత కొన్ని సంవత్సరాలకు సంబంధించి పలు దేశాలకు సంబంధించి ఆయా పక్షుల మైగ్రేషన్ డేటాను కూడా ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా వారు వేడి వాతావరణం పక్షుల నివాసలు, ఆహార లభ్యతపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు గుర్తించారు. మార్గ మధ్యలో తక్కువ స్టాప్‌ ఓవర్‌లను తీసుకోవడం, దాహం వేసిన సందర్భాల్లో నీళ్లు దొరకకపోవడం వంటి పరిస్థితులకు ఎదురీదుతూ వలస పక్షులు అవస్థలు పడుతున్నట్లు కనుగొన్నారు.

మనుగడకు ముప్పు

పర్యావరణ మార్పులకు అనుగుణంగా పక్షులు తట్టుకోగలగడం, వలసలు పోవడం సహజంగా జరిగిపోతుంటాయి. కానీ ఇటీవల గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఈ పరిస్థితిలో కొంత మార్పు కనిపిస్తోందని, వలస పక్షులు వేడివాతావరణం తట్టుకోలేక చనిపోతున్నాయని పరిశోధకులు చెప్తున్నారు. ఆయా పరిస్థితులకు అనుగుణంగా చాలా పక్షులు మనగలుగుతున్నప్పటికీ, వేసవిలో పెరుగుతున్న వేడి కారణంగా అనేక పక్షుల మనుగడ రేటులో సుమారు ఆరు శాతం వరకు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయని నిపుణులు అంచనా వేశారు.

వలసలు ఎక్కడి నుంచి ఎక్కడికి?

వాతావరణ మార్పుల కారణంగా కొన్ని పక్షులు ఉత్తరం నుంచి దక్షిణం వైపు, మరికొన్ని తూర్పు నుంచి పడమరవైపు వలస వెళ్తున్నాయి. 2021 నాటి కరెంట్ బయాలజీ స్టడీలోను ఈ విషయం వెల్లడైంది. రిచర్డ్ పిపిట్స్ సాంగ్‌బర్డ్స్, ఇంకా కొన్ని రకాల పక్షులు సైబీరియా నుంచి యూరప్‌లోకి వలసపోతున్నాయి. ఇక్కడి వేడి వాతావరణంతోపాటు ఆగ్నేయ ఆసియాలో హాబిటేట్ మాడిఫికేషన్, పట్టణీకరణ పెరుగుదల, అడవులు, జలాశయాలు, బహిరంగ మైదానాలు తగ్గిపోవడం వంటి పరిస్థితులు కూడా పక్షులు వలసపోయేందుకు, ఈ సందర్భంగా హీట్‌వేవ్ తగ్టుకోలేక చనిపోయేందుకు కారణం అవుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.


Similar News