oxygen : ప్రళయం రాబోతోందా?.. భూమిపై క్రమంగా క్షీణిస్తోన్న ఆక్సిజన్.. మానవ మనుగడ కష్టమే !

ఒకప్పుడు వాతావరణ మార్పులను, పరిస్థితులను ఆయా సీజన్లు లేదా రుతువులను బట్టి కచ్చితంగా అంచనా వేసేవాళ్లం. ఇప్పుడు గనుక అలాచేస్తే తప్పులో కాలేసినట్టే అంటున్నారు నిపుణులు.

Update: 2024-05-08 08:46 GMT

దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు వాతావరణ మార్పులను, పరిస్థితులను ఆయా సీజన్లు లేదా రుతువులను బట్టి కచ్చితంగా అంచనా వేసేవాళ్లం. ఇప్పుడు గనుక అలాచేస్తే తప్పులో కాలేసినట్టే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఇటీవల రుతువులు గతులు తప్పుతున్నాయి. ప్రకృతిలో సంభవించే వరుస పరిణామాలు దారి తప్పుతున్నాయి. వెదర్ ఎప్పుడెలా మారిపోతుందో చెప్పలేం. ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అనే విషయం తెలిసిందే. అయితే శాస్త్రవేత్తలు మరో కొత్త అంశంతో మన ముందుకు వచ్చారు. ఏంటంటే.. భూమిపై ఆక్సిజన్ శాతం క్రమంగా తగ్గుతోందని జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఎర్త్ సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది.

గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్

ప్రపంచ పర్యావరణ వ్యవస్థను, గ్లోబల్ వార్మింగ్ పరిణామాలను, భూమిపై ఆక్సిజన్ లెవల్స్‌లో వస్తున్న మార్పులను శాస్త్రవేత్తలు ఆధునిక టెక్నాలజీతో విశ్లేషించారు. ప్రస్తుతం భూమిపై ఆక్సిజన్ పడిపోతుండటం ఆందోళనకరమైన విషయమని అంటున్నారు. 2.4 బిలియన్ సంవత్సరాల క్రితం ఈ భూమిపై జీవం పుట్టకముందు ఆక్సిజన్ ఉండేది కాదు, ఇక నుంచి పర్యావరణ వ్యవస్థను, ఈ భూగోళాన్ని కాపాడుకోకపోతే భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయని తాజా అధ్యయనం పేర్కొంటున్నది. పరిశోధకుల ప్రకారం.. భూ వాతావరణంలో ఆక్సిజన్ లైఫ్ టైమ్ అనేది దాదాపు ఒక బిలియన్ సంవత్సరాలకు పైగా ఉంటుంది. ఆ తర్వాత ఇది క్రమంగా క్షీణించవచ్చు. ఇలా సుమారు 110 బిలియన్ సంవత్సరాల తర్వాత ఆక్సిజన్ లెవల్ మొత్తం ఒక శాతానికి పడిపోవచ్చునని రీసెర్చర్స్ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఆ క్షీణత మొదలైందనే ఆందోళన వ్యక్తం అవుతోంది.

సూర్యుడే కారణమా?

భూ వాతావరణంలో ఆక్సిజన్ క్షీణతకు సూర్యుడే ప్రధాన కారణమని జార్జియా ఇన్‌స్టిట్యూట్ సైంటిస్టులు అంటున్నారు. వీరి ప్రకారం ‘సూర్యుడి వయస్సు’ పెరిగే కొద్దీ అది మరింత ఎక్కువ వేడితో ప్రకాశిస్తుంది. అందుకు ప్రకృతిని నాశనం చేసే మానవ చర్యలు తోడవుతాయి. దీని కారణంగా భూమిపై ఉష్ణోగ్రత అనేక రెట్లు పెరుగుతుంది. ప్రస్తుతం ఇది ప్రారంభం అయింది. దీని కారణంగానే భూమి కూడా వేడెక్కుతోంది. అయితే ఇది దీర్ఘకాలంపాటు కొనసాగితే అధిక వేడి కారణంగా భూ వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ మొత్తం విచ్ఛిన్నం అవుతుందని నిపుణులు చెప్తున్నారు. ఫలితంగా భూమిపై ఆక్సిజన్‌‌ను విడుదలచేసే ప్రధాన వనరులైన మొక్కలు, చెట్లు కిరణజన్యం సంయోగక్రియను సాగించలేవు. దీంతో ఆక్సిజన్ ఉత్పత్తి ఆగిపోయి జీవజాలం నశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని పరిశోధకులు సూచిస్తున్నారు.

Similar News