RCB వర్సెస్ ఆర్ఆర్ మ్యాచ్.. గెలిచేది ఏ జట్టో తేల్చేసిన సునీల్ గవాస్కర్

ఐపీఎల్ 2024లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో రాయల్

Update: 2024-05-22 13:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2024లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. టైటిల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన డూ ఆర్ డై మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, రాజస్థాన్ రాయల్స్ మరి కాసేపట్లో తలపడబోతున్నాయి. గుజరాత్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో తలపడేందుకు ఆర్సీబీ, రాజస్థాన్ జట్లు రెడీ అయ్యాయి. సీజన్ మొదట్లో వరుస విజయాలతో దుమ్మురేపిన ఆర్ఆర్.. సెకండాఫ్‌లో వరుస పరాజయాలతో ఢీలా పడింది. ఇక, సీజన్ మొదటి దశలో వరుస పరాజయాలతో లీగ్ నుండే నిష్క్రమిస్తుందనుకున్న ఆర్సీబీ.. అనుహ్య విజయాలతో ఊహించని విధంగా ప్లే ఆఫ్స్‌లోకి దూసుకొచ్చింది. ఈ క్రమంలో ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో ఏ జట్టు గెలిచే అవకాశం ఉందో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ జోస్యం చెప్పారు. ఓ స్పోర్ట్స్ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తుందని గవాస్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగుతోందని తాను భావిస్తున్నానని అన్నారు. వరుస విజయాలు సాధించిన ఆర్సీబీ ఆత్మ విశ్వాసంతో ఉండగా.. వరుస పరాజయాలతో ఆర్ఆర్ తీవ్ర ఒత్తిడితో బరిలోకి దిగుతోందన్నారు. ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్థాన్ విజయం సాధించాలంటే.. క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై కోల్ కతా చేసినట్లుగా ఏదైనా అద్భుతం చేయాల్సిందేనని.. అంతే తప్పితే ఆర్ఆర్ గెలిచే ఛాన్స్ లేదని గవాస్కర్ అభిప్రాయపడ్డారు. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధించకపోతే తాను ఆశ్చర్య పోతానని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆర్సీబీ కెప్టెన్ డుప్లెసిస్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీమ్ మేట్స్‌ను బాగా ప్రోత్సహిస్తున్నారని.. తద్వారా ఆర్సీబీ అద్భుత ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. ఇక, గవాస్కర్ అభిప్రాయపడ్డట్లు ఎలిమినేటర్-1 మ్యాచ్‌లో ఆర్సీబీ విజయం సాధిస్తుందో లేదో చూడాలంటే మరీ కాసేపు ఆగాల్సిందే. 

Similar News