ఆంధ్రకు నీళ్లిద్దామా? తొందరగా చెప్పండి
దిశ, తెలంగాణ బ్యూరో : వేసవికాలం రీత్యా తాగునీటి అవసరాల కోసం మే నెలకు సరిపోయేలా ఏడు టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ నుంచి వాడుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందని, దీనిపై వీలైనంత తొందరగా అభిప్రాయం చెప్తే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల కంటే దిగువకు నీటి మట్టం ఉంటే ఏ రాష్ట్రం కూడా కృష్ణా జలాలను వాడుకోడానికి వీల్లేదని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ […]
దిశ, తెలంగాణ బ్యూరో : వేసవికాలం రీత్యా తాగునీటి అవసరాల కోసం మే నెలకు సరిపోయేలా ఏడు టీఎంసీల నీటిని నాగార్జునసాగర్ నుంచి వాడుకోడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోందని, దీనిపై వీలైనంత తొందరగా అభిప్రాయం చెప్తే నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ రాసింది. శ్రీశైలం రిజర్వాయర్‌లో 834 అడుగుల కంటే దిగువకు నీటి మట్టం ఉంటే ఏ రాష్ట్రం కూడా కృష్ణా జలాలను వాడుకోడానికి వీల్లేదని ఈ ఏడాది ఫిబ్రవరి 5వ తేదీన జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగినా ఇప్పుడు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నందున తెలంగాణ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని బోర్డు సభ్య కార్యదర్శి రాయపూర్ ఆ లేఖలో వివరించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య నీటి వినియోగానికి సంబంధించి ఏప్రిల్ 9వ తేదీన వీడియో కాన్ఫరెన్సు జరిగిందని, ఆ రోజుకు శ్రీశైలంలో 808 అడుగుల మేర మాత్రమే నీటి మట్టం ఉందంది. కానీ వీడియో సిగ్నల్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా సమావేశం అర్ధాంతరంగా ముగిసిపోయిందని, నిర్ణయం తీసుకోలేదని వివరించారు. ఏపీ కోరినట్లుగా 808 అడుగుల కంటే దిగువన నీటి మట్టం ఉన్నా ఆ రాష్ట్ర తాగునీటి అవసరాల కోసం ఏడు టీఎంసీలను ఇవ్వడం వీలవుతుందో లేదో తెలంగాణ తన అభిప్రాయాన్ని తెలియజేయాలని ఇంజినీర్-ఇన్-చీఫ్ మురళీధర్ రావుకు లేఖ రాశారు.
నిజానికి రెండు రాష్ట్రాల మధ్య కుదిరిన అంగీకారం ప్రకారం 834 అడుగుల కంటే తక్కువ నీటి మట్టంలో ఏ రాష్ట్రం కూడా నీటిని వినియోగించరాదనే నిర్ణయం జరిగినా కొన్ని సందర్భాల్లో దానికి భిన్నంగా వ్యవహరించినందున ఇప్పుడు ఏపీ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవచ్చో లేదో తెలంగాణ అభిప్రాయాన్ని కోరుతున్నట్లు పేర్కొన్నారు. గురువారం రాత్రి తెలంగాణకు ఈ లేఖను రాయగా, ఇంకా జవాబు ఇవ్వలేదు.