జీహెచ్ఎంసీలో భారీగా తొలగింపులు.. లిస్ట్ రెడీ చేసిన అధికారులు..!

దిశ తెలంగాణ బ్యూరో: అవి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రోజులు. మొట్టమొదటి సారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కవాతు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్ సఫాయమ్మా.. నీకు సలాం అమ్మ అని అభినందించారు. ప్రస్తుతం అర్ధరాత్రి వేళలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మెయిన్ నడిరోడ్లపై విధులు నిర్వర్తించే ఈ కార్మికులంటే బల్దియా అధికారులకు చిన్నచూపు. అధికారులు చేసే అక్రమాలకు, అవినీతికి వీరు […]

Update: 2021-06-05 07:04 GMT

దిశ తెలంగాణ బ్యూరో: అవి తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన రోజులు. మొట్టమొదటి సారిగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ట్యాంక్‌బండ్‌పై నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో కవాతు నిర్వహించిన పారిశుద్ధ్య కార్మికులను ఉద్దేశించి సాక్ష్యాత్తు సీఎం కేసీఆర్ సఫాయమ్మా.. నీకు సలాం అమ్మ అని అభినందించారు. ప్రస్తుతం అర్ధరాత్రి వేళలో తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి మెయిన్ నడిరోడ్లపై విధులు నిర్వర్తించే ఈ కార్మికులంటే బల్దియా అధికారులకు చిన్నచూపు. అధికారులు చేసే అక్రమాలకు, అవినీతికి వీరు బలి పశువులు. తెల్లారేసరికి నగరాన్ని శుభ్రపరుస్తుంటే అధికారులు మాత్రం వారిని ఎలా పీకెయ్యాలా? వారి స్థానంలో కొత్త వారిని నియమించి ఎంత క్యాష్ చేసుకోవాలా? అని ఆలోచిస్తున్నారు. వారి సేవలను అభినందిచాల్సిన అధికారులు రోడ్డున పడేసేందుకు సిద్ధమయ్యారు.

శానిటేషన్ విభాగంలో 60 ఏళ్లు దాటిన స్వీపర్లు, శానిటరీ ఫీల్డు అసిస్టెంట్లు(ఎస్ఎఫ్ఏ)లను విధుల నుంచి తొలగించేందుకు అధికారులు జాబితాను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని మొత్తం 30 సర్కిళ్ల పరిధిలో సుమారు 964 మంది ఎస్ఎఫ్ఏలు, ఒక్కో ఎస్ఎఫ్ఏ ఆధీనంలో 21 మంది స్వీపర్లతో కూడిన మూడు స్వీపింగ్ యూనిట్లలో వేలాది మంది కార్మికులు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిని తొలగించేందుకు మెడికల్ ఆఫీసర్లు, డిప్యూటీ కమిషనర్లు జాబితాను సిద్ధం చేసి సంబంధిత జోనల్ కమిషనర్లకు పంపారు. తొలగించనున్న కార్మికులు, ఎస్ఎఫ్ఏల స్థానంలో వేరే వారిని నియమించేందుకు సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు భారీగా బేరసారాలు కుదుర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. కూకట్‌పల్లి జోన్ పరిధిలో కొందరు కార్మికులను, ఎస్ఎఫ్ఏలను శనివారమే విధుల నుంచి తొలగిస్తున్నట్లు తెలియజేసి, ఇళ్లకు పంపించేశారు. బాధితులు కార్మిక సంఘాల నేతలను కలిసినా ఫలితం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.

భారం తగ్గించుకునేందుకా? జేబులు నింపుకునేందుకా?

కార్మికుల తొలగింపు బల్దియా ఖజానాపై భారం తగ్గించుకునేందుకా? జేబులు నింపుకునేందుకా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 4-5 సంవత్సరాల క్రితం బి. జనార్దన్ రెడ్డి కమిషనర్‌గా ఉన్నపుడు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం విధుల నుంచి తొలగించిన కార్మికుల స్థానంలో వారసులను విధుల్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉత్తర్వులపై కార్మికులకు అవగాహన లేకపోవటం, ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న బల్దియాకు భారాన్ని తగ్గించేందుకే వేల సంఖ్యలో ఉన్న కార్మికులను విధులు నుంచి తప్పిస్తున్నట్లు సమాచారం. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ సమయంలో కార్మికులను విధుల నుంచి తొలగించేందుకు అధికారులు యత్నించటంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలగిస్తున్న కార్మికుల స్థానంలో రూ.3 లక్షలకు స్వీపర్‌ను, మరో ఐదు లక్షల రూపాయలకు ఎస్ఎఫ్ఏలను నియమించుకునేందుకు పలువురు డీసీలు, మెడికల్ ఆఫీసర్లు బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం.

Tags:    

Similar News