ముగిసిన సూర్యగ్రహణం.. తెరచుకున్న ఆలయాలు

దిశ, వెబ్‌డెస్క్: విశ్వవ్యాప్తంగా సూర్యగ్రహణం ఏర్పడింది. ఖగోళంలో అద్భుతం జరిగింది. ఉదయం 9.16 నుంచి మధ్యాహ్నం 3.04గంటల వరకు ఏర్పడిన రాహుగ్రస్త సూర్యగ్రహణం మొదట మనదేశంలోని గుజరాత్ రాష్ట్రం ద్వారకాలో స్టార్ట్ అయి సుందర దృశ్యంతో కనువిందు చేసింది. ఈ గ్రహణాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా పలుచోట్ల జనాలు ఉత్సాహం చూపారు. కొన్నిచోట్ల స్పష్టమైన వలయాకారంలో కనువిందు చేసిన సూర్యుడు, మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అస్పష్టంగా కనిపించాడు. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 వరకు […]

Update: 2020-06-21 08:30 GMT

దిశ, వెబ్‌డెస్క్: విశ్వవ్యాప్తంగా సూర్యగ్రహణం ఏర్పడింది. ఖగోళంలో అద్భుతం జరిగింది. ఉదయం 9.16 నుంచి మధ్యాహ్నం 3.04గంటల వరకు ఏర్పడిన రాహుగ్రస్త సూర్యగ్రహణం మొదట మనదేశంలోని గుజరాత్ రాష్ట్రం ద్వారకాలో స్టార్ట్ అయి సుందర దృశ్యంతో కనువిందు చేసింది. ఈ గ్రహణాన్ని చూసేందుకు దేశవ్యాప్తంగా పలుచోట్ల జనాలు ఉత్సాహం చూపారు. కొన్నిచోట్ల స్పష్టమైన వలయాకారంలో కనువిందు చేసిన సూర్యుడు, మరికొన్ని ప్రాంతాల్లో ప్రజలకు అస్పష్టంగా కనిపించాడు. తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి మధ్యాహ్నం 1.44 వరకు 51శాతం గ్రహణం ఉండగా, అటు ఏపీలో ఉదయం 10.21 నుంచి మధ్యాహ్నం 10.49వరకు 46శాతం గ్రహణం ఏర్పడింది.

ఈ ఏడాది తొలిసారిగా ఏర్పడిన సూర్యగ్రహణంతో దేశవ్యాప్తంగా శనివారం రాత్రి నుంచే ఆలయాలను మూసివేశారు. కానీ ఏపీలోని శ్రీళాహస్తీశ్వర ఆలయాన్ని తెరిచే ఉంచారు. గ్రహణం రోజున ఈ ఆలయంలో రాహుకేతు పూజలు నిర్వహిస్తే దోషం పోతుందని భక్తుల నమ్మకం. అటు తిరుమలలో ఉదయం 10.18 నుంచి మధ్యాహ్నం 1.35 గంటల వరకు టీటీడీ గ్రహణ శాంతియజ్ఞం చేపట్టింది. సూర్యగ్రహణం కారణంగా శనివారం రాత్రి నుంచే ఇరురాష్ట్రాల్లో ఆలయాలను మూసివేసిన అధికారులు, గ్రహణం అయిపోయాక ఆలయంలో సంప్రోక్షణ జరిపి భక్తుల దర్శనానికి అనుమతి ఇచ్చారు. తిరుమల శ్రీవారి ఆలయం తెరచుకోగా, శ్రీశైలం, బెజవాడ కనకదుర్గమ్మ, కాణిపాకం, పద్మావతి అమ్మవారి ఆలయాలు సోమవారం తెరచుకోనున్నాయి.

ఇటు తెలంగాణలో యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి ఆలయంతో పాటు, బాసర సరస్వతి అమ్మవారి ఆలయం ఆదివారం సాయంత్రమే తెరచుకున్నాయి. భద్రాద్రి రామాలయంలోకి కూడా సాయంత్రం నుంచి భక్తులను దర్శనానికి అనుమతి ఇచ్చారు. సోమవారం ఉదయం నుంచి వేములవాడ రాజన్న దర్శనం భక్తులకు కలగనుంది. మొత్తానికి సూర్యగ్రహణం ఏర్పడిన మూడున్నర గంటల సమయంలో జనాలు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉన్నారు. హైదరాబాద్, సహా పలు పట్టణాల్లో రోడ్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. లాక్‌డౌన్ పూర్తిగా కొనసాగిన సమయంలో రోడ్లు ఏవిధంగా ఖాళీగా కనిపించాయో సూర్యగ్రహణం ఉన్న మూడున్నర గంటల పాటు అదే సీన్ రిపీట్ అయ్యింది.

Tags:    

Similar News