వరల్డ్ వాక్: జి-20 లో భారత్ పెద్దన్న పాత్ర

వరల్డ్ వాక్: జి-20 లో భారత్ పెద్దన్న పాత్ర... world walk: india role in g20 summit

Update: 2022-12-20 18:30 GMT

జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు 2023 సెప్టెంబర్ వరకు ఉంటాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనం పేదలకు అండగా నిలవడంతో పాటు ప్రపంచ దేశాల పౌరులకు అవసరమైన ఆహార సరఫరాలో లోపం రాకుండా చూసుకోవలసిన అవసరం ఉన్నది. ప్రతి దేశం ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకునేలా చూసే బాధ్యత కూడా భారత్ పైన ఉంటుంది. అంతవరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహరించే తీరుపై భారత ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదేమైనా ఈ కూటమి అధ్యక్ష హోదాలో భారతదేశ ప్రతిష్ట మరింత పెరగాలని మనం కోరుకుందాం.

ప్రపంచంలోని అనేక దేశాలు కలిసి అనేక కూటములు ఏర్పాటు చేసుకున్నాయి. యూరోపియన్ యూనియన్(EU), షాంఘై కో-ఆపరేషన్(SCO), ఒపెక్(OPEC) దేశాల కూటమిలాంటివి. అలాగే మరో ప్రధాన కూటమి జి-20(G20) కూడా. అమెరికా, రష్యా, చైనా, భారత్‌లాంటి ఉద్దండ దేశాలున్న కూటమి ఇది. ప్రస్తుతానికి ఈ కూటమి అధ్యక్ష హోదా భారతదేశానికి దక్కింది. ఈ మేరకు కూటమి అధ్యక్ష బాధ్యతలను ఈ డిసెంబర్ నెలలో భారతదేశం అధికారికంగా తీసుకున్నది. ప్రధాని మోడీ గత సంవత్సరం ఇండోనేషియా బాలి నగరంలో జరిగిన జి-20 కూటమి సమావేశంలో అధ్యక్ష బాధ్యతలను అంగీకరించారు. డిసెంబర్ నుంచి ఈ బాధ్యతలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.

ఇండోనేషియా సమావేశంలో జి-20 కూటమి ప్రాధాన్యతలను వివరిస్తూ కుటుంబం పునాదిగా పని చేయాలని అన్ని దేశాలకు మోడీ విజ్ఞప్తి చేశారు. ఈ దేశాలన్నీ ఆర్థిక, మిలిటరీ, వాణిజ్య, సంపన్న దేశాలుగా ప్రపంచ దేశాలను శాసిస్తున్నాయి. భారతదేశ అత్యంత విలువ కలిగిన ప్రజాస్వామ్య దేశంగా ఆయా దేశాల మన్ననలను అందుకుంటున్నది. ఈ కూటమిలో పారిశ్రామికంగా బలమైన దేశాలకు సభ్యత్వం ఉంది. ప్రపంచ వాణిజ్యంలో అధిక వాణిజ్యం జి-20 కూటమి దేశాల ద్వారా జరుగుతుంది. ఈ కారణంగా కూటమి సభ్య దేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. బాలి నగరంలో జరిగిన సమావేశంలో మోడీ ప్రసంగిస్తూ 'ఇది యుద్ధాల యుగం కాదని, శాంతి సౌభ్రాతృత్వం, పరస్పర సహకారం ఉండేలా దేశాలు కృషి చేస్తే బాగుంటుందని' ఉద్బోధించారు. 'ఒకే ప్రపంచం-ఒకే భూమి- ఒకే భవిష్యత్తు' (One Earth, One Family, One Future) నినాదంతో తాము పని చేస్తామని ప్రపంచ దేశాలకు సందేశం పంపారు.

సమావేశాలు మొదలు

జి-20కి భారతదేశం అధ్యక్ష బాధ్యతలో ఉన్నందున వచ్చే యేడాది పొడుగూతా దేశంలోని పలు నగరాలలో దాదాపు రెండు వందల సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలకు జి-20 కూటమి దేశాల నాయకులు, అధిపతులు దశలవారీగా హాజరవుతారు. మూడు నాలుగు రోజుల క్రితం ముంబైలో అభివృద్ధిపై సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయా దేశాల ప్రతినిధులు, నిపుణులు సుస్థిరాభివృద్ధి గురించి చేయవలసిన, చేపట్టవలసిన పనుల గురించి వివరంగా చర్చించారు. ఇలాంటి ఇంకా ఎన్నో సమావేశాలు భారతదేశంలో జరగనున్నాయి. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని, అందుకు అన్ని దేశాలు కలిసికట్టుగా పని చేయాలని, యుద్ధాల శకానికి ముగింపు పలకాలని ప్రధాని మోడీ(narendra modi) విజ్ఞప్తి చేశారు.

ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ పిలుపునకు ప్రాధాన్యత ఏర్పడింది. దేశాలన్నీ తమ సమస్యలను శాంతి, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని కూడా మోడీ సూచించారు. ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. ఆయా దేశాల మధ్య పరస్పర ఆర్థిక, వాణిజ్య సహకారం ఉండాలని, సులభతర వాణిజ్యం జరిగేలా దేశాలు సహకరించుకోవాలని సూచించారు. ఈ కోణంలోనే భారత్ పెద్దన్న పాత్రను పోషిస్తూ జి-20 కూటమి దేశాలకు నాయకత్వం వహిస్తున్నది.

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా

అంతేకాకుండా, ఐక్యరాజ్యసమితి సమావేశాలలో కూడా భారతదేశం ఉగ్రవాదంపై స్పష్టంగా మాట్లాడుతున్నది. ఉగ్రవాద దేశాలను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలను పక్కకు పెట్టాలని కోరుతున్నది. ప్రస్తుతం జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వెంటనే ఆపాలని ఆకాంక్షిస్తున్నది. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న పాకిస్తాన్-చైనా లాంటి దేశాలకు పరోక్షంగా హెచ్చరికలు చేస్తున్నది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు(putin) భారత ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఫోన్ చేసి యుద్ధం ఆపాలని కోరారు. జి-20 కూటమి దేశాల అధ్యక్ష బాధ్యతలో భారతదేశం ప్రపంచ ప్రజల అవసరాలను అందరి దృష్టికి తేవడం వలన, ఆహార భద్రతకు తీసుకోవాల్సిన చర్యల గురించి అన్ని దేశాలకు విజ్ఞప్తి చేయడం వలన భారతదేశ ప్రతిష్ట పెరగడమే కాకుండా ఒక రకమైన పెద్దన్న పాత్ర కూడా సంప్రాప్తించింది.

భారతదేశానికి ప్రపంచ దేశాలు ఎంతో విలువనిస్తాయి. ఆర్థికంగా, మిలటరీ పరంగా చైనాకు దీటుగా లేకున్నా పెద్ద ప్రజాస్వామ్య దేశంగా రానున్న కాలంలో చైనా, అమెరికాకు దీటుగా భారత్ ఎదుగుతుందని ప్రపంచం భావిస్తున్నది. జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలు మన దేశానికి రావడంతో ప్రతిష్టను పెంచుకునే అవకాశం ఏర్పడింది. గత ఐరాస సమావేశాల సందర్భంగా భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు కూడా భారతదేశానికి లభించాయి. ఆ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకుని ఉగ్రవాద నిర్మూలనతోపాటు, అన్ని రంగాలలో పరస్పర సహకారం ఉండాలని భారత్ సూచించింది. ఈ నేపథ్యంలో ఆహార ధాన్యాల సరఫరా సక్రమంగా జరుగుతున్నది. భారత్ ఒత్తిడి కారణంగా చమురు, ఆహారధాన్యాలను తగ్గింపు ధరలలో ఆయా దేశాలు కొనుక్కుంటున్నాయి.

చివరగా

జి-20 కూటమి అధ్యక్ష బాధ్యతలు భారత్‌కు 2023 సెప్టెంబర్ వరకు ఉంటాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకుని మనం పేదలకు అండగా నిలవడంతో పాటు ప్రపంచ దేశాల పౌరులకు అవసరమైన ఆహార సరఫరాలో లోపం రాకుండా చూసుకోవలసిన అవసరం ఉన్నది. ప్రతి దేశం ఒకరికొకరు పరస్పరంగా సహకరించుకునేలా చూసే బాధ్యత కూడా భారత్ పైన ఉంటుంది. అంతవరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం, ముఖ్యంగా ప్రధాని మోడీ వ్యవహరించే తీరుపై భారత ప్రతిష్ట ఆధారపడి ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏదేమైనా ఈ కూటమి అధ్యక్ష హోదాలో భారతదేశ ప్రతిష్ట మరింత పెరగాలని మనం కోరుకుందాం.

శ్రీనర్సన్

జర్నలిస్ట్, కాలమిస్ట్

8328096188

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Also Read... .

పాకిస్తాన్‌పై 39 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన England ప్లేయర్ 

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News