అధ్యక్షుడు మరణిస్తే సంబరాలా..?

ప్రపంచంలో పెక్కుదేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలన చేస్తున్నారు. కానీ కొన్ని దేశాలు మాత్రం ప్రజాస్వామ్య ముసుగులో మతపరమైన కఠిన చట్టాలు

Update: 2024-05-23 00:45 GMT

ప్రపంచంలో పెక్కుదేశాలు ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలన చేస్తున్నారు. కానీ కొన్ని దేశాలు మాత్రం ప్రజాస్వామ్య ముసుగులో మతపరమైన కఠిన చట్టాలు మరియు మతాధికారుల పాలనలో ఉన్నాయి. ఇందులో వాటికన్ సిటీ, సౌదీ అరేబియా (ఇది రాచరికం) ఇరాన్ (ఇది అధ్యక్ష, మతాధికారుల ప్రజాస్వామ్యం)లు ఉన్నాయి.

1979 లో ఖమేనీ ఆధ్వర్యంలో ఇరానియన్ విప్లవంతో ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ఏర్పడింది. గతంలో పర్షియా అని పిలిచేవారు. దాదాపు పదివేల సంవత్సరాల నాటి సుదీర్ఘ చరిత్ర కలిగిన ఇరాన్ ప్రపంచంలోని అతి పురాతన దేశాలలో ఒకటి. ప్రాచీన కాలం నుండి ఈ దేశంలో హింసాత్మక ఘటనలు చాలా చవిచూసుకున్నాయి. 1979 నుండి ఇరాన్ లో మతచట్టాలను అడ్డుపెట్టుకుని మానవ హక్కుల్ని మంటగలిపారు. ప్రపంచంలోనే ఎక్కువ ఉరి శిక్షలు అమలుపరిచే దేశంగా కూడా రికార్డుల్లోకెక్కింది. దీనికి అధ్యక్షుడిగా శాశ్వత సుప్రీమ్ లీడర్.. ప్రజల చేత ఎన్నుకోబడ్డ (4 సం౹౹ కాలం) అధ్యక్షుడి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఇక న్యాయ వ్యవస్థ అంతా ఇస్లాం షరియా చట్టం ఆధారంగా నడుస్తుంది. 1979 నుండి ఇద్దరు మాత్రమే శాశ్వత సుప్రీంలీడర్ గాను, 13 మంది అధ్యక్షులు గా 42 సంవత్సరాలు పరిపాలించి అనేక రక్తపు మరకలు అంటించుకున్నారు.

అణిచివేతల పాలన..

ఇబ్రహీం రైసీ 2021 జూన్ అధ్యక్ష ఎన్నికల్లో 18 మిలియన్లకు పైగా అక్రమ ఓట్లను సాధించి ఇరాన్ 13వ అధ్యక్షుడయ్యారు. అధ్యక్షుడి కన్నా ముందు ఆయన సుప్రీమ్ లీడర్ ఆశీర్వాదంతో వివిధ పదవుల్లో పనిచేశాడు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే ఇరాన్ ప్రజలపై అణచివేత విధానాలు తీవ్రమయ్యాయి. ఉరిశిక్షల అమలు భయంకరంగా పెరిగింది. రాజకీయ నాయకులపై అణచివేత తీవ్రమైంది. ఆయన సుప్రీం లీడర్ నుంచి పార్లమెంటు, ఆర్మీ, నిఘా వరకు హస్తగతం చేసుకున్నారు. ఈ విధానంతో ఇరాన్‌లోని సంస్కరణవాదులు మితవాదుల భవిష్యత్తు అగమ్యగోచరం అయింది. ఇబ్రహీం రైసీ కఠిన నిర్ణయాలు, తప్పుడు ప్రసంగాలు, వారసత్వం కోసం (సుప్రీం లీడర్) నియంతృత్వ పోకడలు, అధికార దుర్వినియోగం, ఆర్థిక వ్యవస్థ అవినీతిమయం వలన మూడేళ్లలో ఆర్థిక గణాంకాలు చాలా కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. పైగా ప్రభుత్వ వ్యతిరేకుల హత్యలు, జైలు శిక్ష, బలవంతపు అదృశ్యం, హింస, అత్యాచారం, లైంగిక హింస వంటి నేరాలను ప్రోత్సహించడం వంటివన్నీ హిజాబ్ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన మహసా అమిని అనే మహిళ పోలీసు కస్టడీలో మరణించిన తర్వాత అర్థమయింది. అందుకే అమిని మరణాన్ని నిరసిస్తూ వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చారు. అప్పుడు రైసీ అణచివేత ప్రపంచానికి తెలిసింది.

మొసద్‌పై అనుమానం

ఇలా దేశంలోనే కాదు రైసీ విదేశాలతోనూ సఖ్యతగా ఉండలేదు..1979 నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ సంబంధాలు అంతగా బాలేవు.. పైగా1982 లెబనాన్ యుద్ధంలో ఇరాన్ లెబనీస్ షియా, పాలస్తీనియన్ మిలిటెంట్లకు మద్దతు ఇచ్చి ఇజ్రాయెల్‌పై యుద్ధం చేసి ఓడిపోయింది. ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపడానికి ఇజ్రాయెల్ చేసిన ప్రయత్నాలు సఫలమవ్వటంతో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ తారస్థాయికి చేరింది. ఇజ్రాయెల్‌పై నలువైపులా దాడులకు నాంది ఇరాన్ దేశం అని గుర్తించి అనేకసార్లు దాడులు జరిపినా బుద్ధి మార్చుకోని నేపథ్యంలో.. ఇరాన్‌ని నిలువరించటానికి మొసద్ పావులు కదిపిందని ప్రపంచం కోడైకూస్తోంది. ఒక దేశాధ్యక్షుడు ప్రయాణించిన బెల్ 212 అమెరికా రకానికి చెందిన హెలికాప్టర్‌పై అత్యాధునికమైన స్పేస్ లేజర్ వెపన్‌తో దాడి జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అధ్యక్షుడి ఎస్కార్ట్ హెలికాప్టర్‌లు రెండూ సురక్షితంగా ల్యాండ్ అయ్యి, అధ్యక్షుడి హెలికాప్టర్ ల్యాండ్ అవ్వకపోవటం..అనుమానం కలిగిస్తోంది. తన 63 ఏళ్ల వయస్సులో, ఇబ్రహీం రైసీ "సుప్రీం లీడర్" కావాలనే తన అంతిమ కలను సాకారం చేసుకోకుండానే మరణించాడు. ఆయన మరణంపై భారత్‌లో ఒక రోజు సంతాప దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అయితే ఇరాన్‌లోని కొంతమంది ప్రజలు మాత్రం ఇబ్రహీం రైసీ మరణాన్ని పండగలాగా జరుపుకున్నారు. రోడ్లపైకి వచ్చి.. గుంపులు గుంపులుగా ఏర్పడి.. బాణసంచా కాల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ.. మందు తాగుతూ ఎంజాయ్ చేశారు. ఇది దేనికి సంకేతం.

నూతలపాటి రవికాంత్

97044 44108

Tags:    

Similar News