సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తి ఇంకెప్పటికో!?
దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది' అన్నారు కొఠారీ. అలాంటి తరగతి గదులకు నిర్దేశకులు ఉపాధ్యాయులు. 'గురోరంధకారస్యాత్
దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుంది' అన్నారు కొఠారీ. అలాంటి తరగతి గదులకు నిర్దేశకులు ఉపాధ్యాయులు. 'గురోరంధకారస్యాత్ రకారస్తన్ని వారణాత్; అంధకార నిరోధస్యాత్ గురోరిత్యభియతా" అని శంకరాచార్యులు ప్రవచించారు. గుః అంటే అంధకారం, రుః అంటే తొలగించేది. అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుగులను ప్రసరింపచేయువారు గురువులు. కాబట్టి ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు అందరూ గురువులుగానే పిలువబడుతారు.
భారతీయ హృదయాలలో గురువుకు ఉన్న స్థానం అంతా ఇంతా కాదు. ఏకంగా గురువును బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోలుస్తూనే వారికంటే మిన్న అయిన పరబ్రహ్మ స్వరూపంగా కొలవడం జరుగుతుంది. మన సమాజం తల్లిదండ్రుల తరువాత స్థానాన్ని గురువుకిచ్చింది. గురువు లేని ప్రపంచాన్ని ఊహించడం కష్టం. అందుకే కబీర్‌దాస్ 'దేవుడు, గురువు ఒకేసారి ప్రత్యక్షమైతే నేను ముందుగా గురువుకే నమస్కరిస్తాను' అంటారు. ఆ దేవుడిని కూడా ఎలా ప్రార్థించాలో నేర్పింది గురువేగా అంటారు. అలాంటి గొప్ప గురువులు గౌరవింపబడే రోజు ఉపాధ్యాయ దినోత్సవం.
యేటా సెప్టెంబర్ ఐదున విద్యావేత్త, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి రోజున ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. 1962 నుంచి ఇది ఆనవాయితీగా వస్తోంది. రాధాకృష్ణన్ 1888 సెప్టెంబర్ ఐదున తమిళనాడులోని మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. పట్టుదలతో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆయన చదువులన్నీ మెరిట్ స్కాలర్‌షిప్‌లతోనే పూర్తయ్యాయి. చిన్ననాటి నుంచే ఆయన ఎంతో అసాధారణ ప్రతిభ కలిగినవారు.
కళాశాలలో తనకు విద్యా బోధన చేసిన విలియం స్కిన్నర్, హాగ్ వంటి వారిని ఆదర్శంగా తీసుకొని అధ్యాపకుడు కావాలనుకున్నారు. యూనివర్సిటీ చదువు పూర్తి కాగానే మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో తత్వశాస్త్ర అధ్యాపకుడిగా చేరారు. దేశంలోనే అత్యుత్తమ అగ్రశ్రేణి తత్వశాస్త్ర అధ్యాపకుడిగా, ఆచార్యులుగా పేరు గడించారు. యూరోప్, అమెరికాలకూ విజిటింగ్ ప్రొఫెసర్‌గా వెళ్లి తత్వశాస్త్రాన్ని బోధించారు. మైసూర్, కోల్‌కతా, బెనారస్, ఆంధ్ర యూనివర్సిటీలలో, ఆక్స్‌ఫర్డ్, హార్వర్డ్ వంటి విదేశీ విశ్వవిద్యాలయాలలోనూ సేవలందించారు. ఏక కాలంలో ఆంధ్ర, బెనారస్ విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సలర్‌గా కూడా వ్యవహరించారు.
రాధాకృష్ణన్ భారత రాజ్యాంగ పరిషత్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. రాజ్యాంగ రచనలో సలహాలు, సూచనలు అందించారు. స్వాతంత్ర్యానంతరం దేశంలో ఏర్పాటైన విశ్వవిద్యాలయాల తొలి కమిషన్‌కు చైర్మన్‌గా వ్యవహరించారు. విశ్వవిద్యాలయాలలో నూతన మార్పులకు శ్రీకారం చుట్టారు. తర్వాత రష్యాలో భారత్ రాయబారిగా నియమితులయ్యారు. అప్పటి రష్యా అధ్యక్షుడు స్టాలిన్ మన్ననలను పొందారు. సర్వేపల్లి బహుముఖ ప్రజ్ఞ, ఉన్నత వ్యక్తిత్వం, నిబద్ధతతో కూడిన జీవితం అనేక పదవులను తెచ్చిపెట్టింది.
భారత తొలి ఉపరాష్ట్రపతిగా ఎన్నికై రెండు పర్యాయాలు కొనసాగారు. రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో సమర్థవంతంగా విధులను నిర్వహించి అధికార, ప్రతిపక్షాల నాయకుల మెప్పు పొందారు. దేశానికి రెండవ రాష్ట్రపతిగా ఎన్నుకోబడి చైనా, పాకిస్థాన్ యుద్ధ సమయాలలో సమయస్ఫూర్తిగా వ్యవహరించారు.
రాధాకృష్ణన్ గొప్ప వక్త. ఆయన ఉపన్యాసాలు ఆద్యంతం భారతీయ జీవన ఉదాహరణలతో ఆసక్తికరంగా సాగేవి. భారతీయ తత్వశాస్త్రంపై చేసిన ప్రసంగాలు ప్రపంచ తత్వశాస్త్రంలోనే మహోన్నతమైనవి. గొప్ప రచయిత కూడా. తత్వశాస్త్రం, హిందూత్వం, భారతీయత వంటి వివిధ అంశాలపై ఆయన వెలువరించిన సంపుటాలు నేటికి ప్రామాణిక గ్రంథాలే.
భారతీయ తత్వశాస్త్రం, భారతీయ మతం, హిందూ భావవాద జీవన దృక్పథాలు, దమ్మపదం, ఉపనిషత్తులు, భగవద్గీత, రవీంద్రనాథ్ ఠాగూర్ దర్శనం, యుద్ధం-గాంధీ దృక్పథం, మతం-శాస్త్రం, సంస్కృతి మొదలగునవి వాటిలో ప్రధానమైనవి. ఆయన తత్వశాస్త్రంలో తర్కించి వ్రాసిన ప్రతి పుస్తకం వారిని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చింది.అనేక సంస్థలు, దేశాలు ఆయన ప్రతిభను గుర్తించాయి. బిరుదులను ఇచ్చి గౌరవించాయి. బ్రిటిష్ అకాడమీ రాధాకృష్ణన్‌ను సభ్యుడిగా చేర్చుకుంది. ఐక్యరాజ్య సమితి యునెస్కో కార్యనిర్వాహక విభాగపు సభ్యుడిగా, చైర్మన్‌గా నియమించి ఆయన సేవలను వినియోగించుకుంది. బ్రిటిష్, జర్మనీ ప్రభుత్వాలు గౌరవ పురస్కారాలతో సత్కరించాయి. 1954లో భారతదేశం అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నతో గౌరవించింది.
అధ్యాపకుడిగా, ఆచార్యుడిగా, వైస్ చాన్సలర్‌గా, రాయబారిగా, ఉప రాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా ఏ పదవిలో ఉన్నా క్రమశిక్షణతో నడుచుకుని పదవులకు వన్నె తెచ్చారు. తనకు అత్యంత తృప్తినిచ్చింది మాత్రం ఉపాధ్యాయ వృత్తే అని గర్వంగా ప్రకటించారు. అందుకే ఆయన ప్రతి ఉపాధ్యాయుడికి ఆదర్శం. నేడు ఉపాధ్యాయ వృత్తికి గౌరవం, విలువ తగ్గిపోతోంది. కొందరు ఉపాధ్యాయులు వృత్తిని నిర్లక్ష్యం చేయడం, ఇతర పనులలో నిమగ్నం కావడం ఇందుకు కారణం. అవినీతి రహిత, ఆదర్శ సమాజ నిర్మాణంలో, కులాతీత-మతాతీత జాతి రూపకల్పనలో ఆత్మవంచన లేకుండా పని చేస్తానని ప్రతి ఉపాధ్యాయుడు ప్రతీనబూనితే ఈ ఉపాధ్యాయ దినోత్సవానికి నిజమైన సార్థకత చేకూరుతుంది.
డా. సందెవేని తిరుపతి
చరిత్ర పరిరక్షణ సమితి, తెలంగాణ
9849618116