వ్యాపార సరుకుగా నీరు.. ప్రమాదమెంత!?

Water is not a commodity and financial asset to be exploited

Update: 2023-06-28 00:00 GMT

నీటి వ్యాపారం ప్రపంచవ్యాప్తంగా నేడు పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. దాని విలువ 27 వేల కోట్ల డాలర్లు. నీటిపై వివిధ దేశాల్లో బడా బహుళజాతి సంస్థలు ప్రభుత్వాల నుంచి హక్కులు పొంది నీటి వ్యాపారం ద్వారా వేల కోట్ల రూపాయలను తరలించుకుపోతున్నాయి. దీంతో క్రమంగా సహజ నీటి వనరులపై ప్రజలు హక్కులను కోల్పోతున్నారు. ప్రకృతి సహజమైన నీరు సకల జీవరాసులకు సహజంగా లభించాలి. నీటిని తాగు, సాగు అవసరాలకై ప్రజలందరికీ అందేలా చూడటం ప్రభుత్వాల కనీస బాధ్యత. ఆ బాధ్యతను నెరవేర్చటంలో పాలక ప్రభుత్వాలు అత్యధికం విఫలమౌతూ వస్తున్నాయి. సహజమైన నీటి వనరులు లేకపోతే మానవ మనుగడే ప్రశ్నార్ధకమౌతుంది. ఇంతటి ప్రాధాన్యత గల సహజమైన నీరు గత మూడు దశాబ్దాలకు పైగా ప్రైవేట్ పరం చేయడం తీవ్రమైంది.

ఆర్థిక వస్తువుగా నీరు!

గత 70 సంవత్సరాలలో ప్రపంచ జనాభా మూడు రెట్లు పెరగగా, నీటి వాడకం ఆరురెట్లు పెరిగింది. పరిశ్రమల వాడకానికి నీటి వినియోగం ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. పరిశ్రమలకు నీటి అవసరాలు పెరుగుతున్న కొద్దీ ప్రభుత్వ రాయితీలతో, ప్రజల సొమ్ముతో తమ నీటి అవసరాలను తీర్చుకోవటమే కాకుండా, నీటిపై తమ గుత్తాధిపత్యం కోసం పెట్టుబడిదారుల ప్రయత్నాలు ప్రారంభమైనాయి. పెట్టుబడిదారుల సహజ లక్షణమైన తక్షణ లాభమే తప్ప వారికి నిలకడైన అభివృద్ధి పట్టదు. తాగునీటి అవసరాలు పెరగటంతో పెట్టుబడిదారులకు నీరు ఎంతో లాభసాటి వ్యాపారంగా మారింది. 1992లో డబ్లిన్ వాటర్ కాన్ఫరెన్స్, వరల్డ్ వాటర్ విజన్ నీటిని ఒక ఆర్థిక వస్తువుగా(సరుకు)గా అభివర్ణించింది. జీవించే హక్కు అనేది ప్రజల మౌలిక హక్కు. అందుకు ఆహారం, నీరు, గూడు ప్రజల మౌలిక హక్కుల్లో భాగం. నీరు లేకపోతే జీవితమే ఉండదు. అందువలన అది ప్రజల మౌలిక హక్కు. అది సరుకుగా చూడటం నేరం.

ముఖ్యంగా నీటి ప్రైవేటీకరణను సమర్థించే వారు రెండు వాదనలు ముందుకు తెస్తున్నారు. మొదటిది, ప్రైవేటీకరణ వలన నీటి వసతుల నిర్వహణ మెరుగుపడుతుందని, నిర్వహణ ఖర్చులు తగ్గుతాయని, సమర్ధవంతంగా నీరు అందుబాటులోకి వస్తుందని. రెండవది, నీరు ఉచితంగా లభించటం వలన అవసరానికి మించి ప్రజలు నీటిని వాడుతున్నారని, ప్రైవేటీకరించడం వలన డబ్బు చెల్లించవలసి రావడంతో నీటిని ప్రజలు పొదుపుగా వాడతారని. ఇవన్నీ ప్రైవేటీకరణను సమర్ధించే వాదనలు. నిజానికి నీరు వృధాగా పోతున్నట్లు ఎక్కడ కన్పించినా, ప్రజలు దానికి మరమ్మత్తులు చేస్తారు. రైతాంగం పైన కూడా ఇలాంటి విమర్శ చేయడం దారుణం. సాగు నీరు వృధా కాకుండా ఉండటానికి నీటి మీటర్లు బిగించాలనే ప్రతిపాదన తెచ్చి తీవ్ర వ్యతిరేకత రావటంతో చంద్రబాబు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నీటి ప్రైవేటీకరణ జరుగుతున్నది జల వనరుల సంరక్షణ కోసం కాదని, వ్యాపారుల దోపిడీ కోసమన్నది వీరు విస్మరించారు.

వారి ఒత్తిడితో...

నిజానికి ఏ ప్రైవేటీకరణ అయినా అది ప్రజల కోసం కాదని, బడా వ్యాపారుల కోసమే అన్నది వాస్తవం. నీటి ప్రైవేటీకరణ జరగడం వలన ఉచితంగా అందాల్సిన తాగునీరు డబ్బులు చెల్లించి ప్రజలు కొనుక్కోవాలి. ప్రైవేట్ కంపెనీలు అధిక మొత్తంలో లాభాలు గడించటమనే కోణం నుంచి నీటి నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలు ఉంటాయి తప్ప, ప్రజల అవసరాలను, దీర్ఘకాలిక నీటి మనుగడ దృక్పథం ఉండదు. బహుళ జాతి సంస్థలు ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల మద్దతుతో పబ్లిక్ నీటి వనరులను ప్రైవేటీకరించి తమతో కాంట్రాక్టు కుదుర్చుకోవడం కోసం అర్ధ వలస దేశాలపై విపరీతమైన ఒత్తిడి చేస్తున్నాయి. ఈ నీటి ప్రైవేటీకరణ మొదట లాటిన్ అమెరికాలో ప్రారంభమై నేడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు విస్తరించింది. దీంట్లో కూడా ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్ పాత్ర కీలకంగా ఉంది. వెనుకబడిన దేశాలకు రుణాలు మంజూరు చేసేటప్పుడు నీటిని ప్రైవేటీకరణ చేయాలని షరతులు విధిస్తున్నాయి.

అలాగే ప్రభుత్వాలు కూడా ప్రజలు నీటి వనరులను అసమర్ధంగా నిర్వహించటం లేదనే ప్రచారం చేసి ప్రైవేటీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలు అత్యధిక లాభాలకు నీటిని అమ్మడం అంటే, అది మానవ జీవనానికి అత్యంత మౌలిక అవసరమైన నీటిని సాధారణ ప్రజలకు నిరాకరించడమే. 75% వరకు నీటి వ్యాపారం కొన్ని యూరోపియన్ దేశాల, అమెరికా బహుళజాతి కంపెనీల అదుపులో ఉంది. ఈ కంపెనీలు వివిధ దేశాల ప్రభుత్వాలపై నీటిని, నీటి నిర్వహణను ప్రైవేటు పరం చేయాలని విపరీతమైన ఒత్తిడి పెట్టి విజయం సాధించాయి. నీటిని ప్రైవేటీకరణ చేసినప్పుడు బ్రిటన్‌లో 1988-95 మధ్య నీటి బిల్లులు 67% పెరిగాయి. బొలీవియాలో మునిపల్ నీటి సరఫరా ప్రైవేటీకరణ తర్వాతే నీటి బిల్లులు విపరీతంగా పెరిగాయి. ఆ దేశంలోని కొచమాంబ నగరంలో నీటి యుద్ధాలు జరిగాయి. ఫ్రాన్స్‌లో కూడా నీటి బిల్లులు 150% పెరిగాయి. ఆఫ్రికా ఖండంలో నీటి ప్రైవేటీకరణ తర్వాత ప్రజలకు నీటి హక్కు నిరాకరించబడింది. నీటి ధరలు 45% పెరగగా, కంపెనీ లాభాలు 692% పెరిగాయి. ఈ కంపెనీల సీఈఓల జీతాలు 700% పెరిగాయి.

మన దేశంలోని పరిస్థితి..

భారతదేశంలో కూడా నీటి ప్రైవేటీకరణ పెద్ద ఎత్తున కొనసాగుతున్నది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ కనుసన్నల్లో దేశ జల విధానాలు రూపొందించడం జరుగుతున్నది. 2002 భారత ప్రభుత్వం జాతీయ జల విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఈ విధానం ప్రకారం ఎక్కడ సాధ్యమైతే అక్కడ జల వనరుల పథకాల ప్లానింగ్, అభివృద్ధి, నిర్వహణ కోసం ప్రెవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నది. ఒక దశాబ్దం కాలంలోనే దేశంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో నడిసే ప్రాజెక్టుల సంఖ్య 300కు చేరింది. మహారాష్ట్రలో 48, కర్ణాటకలో 26, తమిళనాడులో 25, ఢిల్లీలో 20, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 15 ప్రాజెక్టులు ప్రైవేట్ భాగస్వామ్యంలో నడుస్తున్నాయి. నీటి సరఫరాలో ఇతర దేశాల్లో లాగానే భారత్‌లోనూ ప్రైవేట్ రంగం విఫలమైంది. టాటా సమూహానికి చెందిన జే‌యూ‌ఎస్‌సి‌ఓ, జెంషెడ్ పూర్‌తో పాటు మైసూర్, భోపాల్, గ్వాలియర్, కొలకతా, హాల్దియా, ముజఫర్‌పూర్, చెన్నయ్ నగరాల్లో జల నిర్వహణ బాధ్యతలు తీసుకుని విఫలమైనాయి.

దేశంలో జల విధానం రాక ముందే, భారతదేశంలో 1990లో జల వనరుల ప్రైవేటీకరణ ప్రారంభమైంది. శివనాధ్ నదిలో 23 కిలోమీటర్ల దూరం పాటు రేడియస్ వాటర్ సప్లయ్‌కి 22 సంవత్సరాలు మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1998లో ఒక కార్పొరేట్ సంస్థకు లీజుకు ఇచ్చింది. ఫలితంగా మొదటిసారి ఒక నది కార్పొరేట్ సంస్థ చేతుల్లోకి పోయింది. 23 కిలోమీటర్ల నదికి ఇరువైపుల కార్పొరేట్ సంస్థ కంచె వేసింది. ఫలితంగా ఆ పరిధిలో ఉన్న గ్రామాల ప్రజలు నీటిని వాడుకోవటం పైనా, చేపల వేటపైనా నిషేధానికి గురయ్యారు. ప్రైవేటీకరణ దుష్పరిణామాలను గమనించిన రాష్ట్ర పబ్లిక్ అకౌంట్ కమిటీ లీజు ఒప్పందాన్ని రద్దు చేయాలని సిఫార్సు చేసినా, మధ్యప్రదేశ్ ప్రభుత్వం లీజుని కొనసాగించింది. సూయజ్, విలెండి, థేమ్స్ వాటర్, బెక్టేల్ వంటి పెద్ద బహుళజాతి కంపెనీలు భారతదేశంలో నీటి ప్రాజెక్టులు నడుపుతున్నాయి.

అనుమతులు రద్దు చేయాలి!

నీటి వ్యాపారం ద్వారా బడా కంపెనీలు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తుండగా, ప్రజల జేబులు మాత్రం ఖాళీ అవుతున్నాయి. 1990లలో పార్లే కంపెనీ మనదేశంలో ‘బిస్లరీ' పేరుతో వాటర్ బాటిల్స్‌ను ప్రవేశపెట్టింది. ప్రస్తుతం దేశంలో 3వేల ఆర్గనైజ్డ్, 12వేల అన్-ఆర్గనైజ్డ్ వాటర్ బాటిల్ కంపెనీలు ఉన్నాయనే అంచనా ఉంది. పెప్సి, కోకాకోలా వంటి బహుళజాతి కంపెనీలు ఆక్వాఫీనా, కీన్లీ వంటి బ్రాండ్లతో నీటి వ్యాపారం ద్వారా వేల కోట్ల భారత సంపదను కొల్లగొడుతున్నారు. బిస్లరీ, కిన్లే, ఆక్వాపీనా, బెయిలీ, హిమాలయన్ మినరల్ వాటర్, మానిక్ చంద్ ఆక్సీరిస్ మినరల్ వాటర్, టాటా వాటర్ ప్లస్, రైల్ నీర్‌లు భారతదేశంలో అతిపెద్ద వాటర్ కంపెనీలు. 2022నాటికి భారత్‌లో 43,663 కోట్ల నీటి వ్యాపారం జరగగా, 2024 నాటికి ప్రతి సంవత్సరం 6,500 కోట్ల నీటి వ్యాపారం జరుగుతుందనే అంచనా ఉంది.

బడా వ్యాపార సంస్థల నీటి వ్యాపారం ప్రమాదంగా మారి ప్రపంచవ్యాపితంగా నీటి కొరత ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అనేక మంది నిపుణులు తెలియచేస్తున్నారు. భారతదేశంలో 2050 నాటికి నీటి సంక్షోభం ఏర్పడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని కూడా నివేదికలు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితుల నుంచి ప్రజలు బయటపడాలంటే, సహజ నీటి వనరులపై ప్రజలదే హక్కని, నీటి వనరులను ప్రైవేటీకరణ చేసే హక్కు ప్రభుత్వాలకు లేదని, బహుళజాతి కంపెనీల నీటి వ్యాపార అనుమతులను రద్దు చేయాలని ప్రపంచ దేశాల ప్రజలు, భారతదేశం ప్రజలు ఉద్యమించాలి.

బొల్లిముంత సాంబశివరావు

రైతు కూలీ సంఘం, కార్యవర్గ సభ్యులు

98859 83526

Tags:    

Similar News