బ్రిటిషర్లను వణికించిన పులి

ఆంగ్ల మూకల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి టిప్పు సుల్తాన్ సాగించిన పోరాటం అజరామరం. పిన్న వయసులోనే టిప్పు చూపిన తెగువ

Update: 2024-05-04 00:45 GMT

ఆంగ్ల మూకల కబంధ హస్తాల నుండి దేశాన్ని రక్షించడానికి టిప్పు సుల్తాన్ సాగించిన పోరాటం అజరామరం. పిన్న వయసులోనే టిప్పు చూపిన తెగువ, ప్రదర్శించిన ధైర్య సాహసాలు ఊహకందనివి. సునిశిత పరిశీలన ద్వారా సాధించిన అపూర్వ మేధా పరిజ్ఞానం సాంఘిక, ఆర్థిక, సాంస్కృతిక , రాజకీయ పరిణామాల పట్ల ఆయనకున్న సాధికారత ఫ్రెంచ్, ఆంగ్లేయాధికారుల్ని సైతం ఆశ్చర్య చకితుల్ని చేసింది.

జాతీయ, అంతర్జాతీయ విషయాలపై టిప్పు వ్యక్తపరిచిన అభిప్రాయాలను, దౌత్య వ్యూహాలను ఆయన శత్రువు డోవ్ టన్ (DOVETON) లాంటి బ్రిటిష్ అధికారి సైతం ప్రశంసించకుండా ఉండలేకపోయాడు. పదిహేనేళ్ళ పిన్న ప్రాయంలోనే టిప్పు రాజ్యపాలనా వ్యవహారాల్లో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ యుద్ధాల్లో పాల్గొన్నాడు. మొదట బ్రిటిషర్ల కూటమి నుండి నిజాంను దూరం చేయడానికి సాగిన ప్రయత్నాల్లో భాగంగా ఎంతో పరిణితితో, నేర్పుతో, దౌత్య కార్యాన్ని నడిపినప్పుడు ఆయన వయసు కేవలం పదిహేడేళ్ళు. టిప్పు ప్రదర్శించిన రాజనీతికి ముగ్దుడైన నిజాం టిప్పుని ఫతే అలీఖాన్ అన్న బిరుదుతో సత్కరించాడు.

రాజ్యాధికారం స్వీయ లాభానికి కాదంటూ..

చిన్న వయసులోనే వీరాధి వీరుడిగా, ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసిన టిప్పు సుల్తాన్ యుద్ధ భూమిలో తండ్రి హైదర్ అలీ మరణానంతరం టిప్పు 1782లో మైసూరుకు రాజయ్యాడు. ప్రజా సంక్షేమంలోనే రాజ్య సంక్షేమం, రాజు సంక్షేమం దాగుందందని బలంగా నమ్మే టిప్పు రాజ్యాభిషేకం రోజునే, 'ప్రజల్ని విస్మరించి , ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా పనిచేస్తే నేను నా జీవితాన్ని, నా సంతానాన్ని, చివరికి నా స్వర్గాన్ని కూడా కోల్పోవచ్చు. ప్రజల సంక్షేమం , వారి సంతోషంలోనే నా సంతోషం, సంక్షేమం ఇమిడి ఉన్నాయి. దీనిని ఇష్టంగా, అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే రాజ్యాధికారం ప్రజలకు సేవ చేయడానికే గాని , స్వీయ లాభం పొందడానికి కాదు.' అని విస్పష్టంగా ప్రకటించాడు.

అన్ని మతాలను సమానంగా చూస్తూ..

ప్రజల జీవితాలను సుఖమయం చేయడానికి టిప్పు వినూత్న విధానాలను అవలంబించాడు. స్వదేశీ విజ్ఞానాన్ని విదేశీ పరిజ్ఞానంతో మేళవించి ప్రజోపయోగానికి వినియోగించిన ప్రప్రధమ స్వదేశీ పాలకుడిగా ఖ్యాతి గడించాడు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహాన్నందించాడు. చేతివృత్తులను అభివృద్ధి పరిచాడు. సహకార వ్యవస్థను పటిష్టం చేశాడు. వర్తక, వాణిజ్య రంగాల్లో ప్రభుత్వ పాత్రను విస్తరించేందుకు టిప్పు ఆనాడే ప్రభుత్వ వ్యాపార సంస్థను ఏర్పాటు చేశాడు. టిప్పు సుల్తాన్ వ్యవసాయ రంగాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాడు.

అలాగే నీటిపారుదల రంగంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచాడు. రైతన్నకు భూహక్కును కల్పించాడు.

జాగీర్దారీ వ్యవస్థకు రద్దు చేశాడు. రైతన్నలు మూడేళ్ళ వరకూ పన్ను రద్దు చేశాడు. వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తరఫున రుణ సౌకర్యం కల్పించాడు. దీంతో టిప్పు జనరంజక పాలనలో ప్రజలు సుఖశాంతులతో జీవించారని, దేశంలోని ఇతర అన్ని ప్రాంతాల కంటే ఇక్కడి ప్రజలు సంతోషంగా ఉన్నారని, పంటలు పుష్కలంగా పండాయని ప్రఖ్యాత చరిత్రకారుడు జేమ్స్ మిల్ తన గ్రంథంలో పేర్కొన్నాడు.

ఆంగ్లేయులకు సింహ స్వప్నం..

టిప్పు అన్ని మతాలను సమానంగా , గౌరవభావంతో చూసేవాడు. ఈస్టిండియా పాలకులతో పోరాడుతున్నా క్రైస్తవ మతాచార్యులను అమితంగా గౌరవించేవాడు. మసీదు, మందిరాల మధ్య ఎలాంటి తారతమ్యం చూపలేదు. మైసూరు రాజ్యంలోని అనేక ఆలయాలకు ప్రతి ఏడాది గ్రాంటులను, ప్రత్యేక నిధులను మంజూరు చేశాడు. సైన్యం విషయంలో కూడా టిప్పు ఆదర్శాన్ని నెలకొల్పాడు. ఆయన సైన్యంలోని 19 మంది సేనాపతుల్లో ఏడుగురు హిందువులే! అసమాన ధైర్య సాహసాలతో తండ్రికి తగ్గ తనయుడిగా, పిన్న వయసులోనే అనేక విజయాలు సాధించారు. మలబారు ప్రాంతంలో ప్రారంభమైన ఆ యుద్ధవీరుని జీవితం అటు ఈస్టిండియా కంపెనీతో, ఇటు స్వదేశీ పాలకులైన నిజాం, మరాఠాలతో పోరులోనే గడిచింది. చివరి శ్వాస వరకూ బ్రిటిష్ ముష్కర మూకలను భారతదేశం నుండి తరిమికొట్టడానికి అవిశ్రాంతంగా పోరాడిన ఏకైక స్వదేశీ పాలకుడిగా ఖ్యాతి గడించిన టిప్పు చివరికి ,1799 మే నాలుగో తేదీన రణ భూమిలోనే తుది శ్వాస వదిలాడు. బ్రిటిష్ అధికారి జనరల్ హ్యారీ టిప్పు సుల్తాన్ శవాన్ని స్వయంగా పరిశీలించి, మరణించాడని నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే 'ఈరోజు నుండి భారతదేశం మాది' అని ప్రకటించే సాహసం చేయగలిగాడంటే, ఈ మైసూరు పులి ఆంగ్లేయులకు ఎంత సింహ స్వప్నంగా మారాడో అర్థం చేసుకోవచ్చు. టిప్పు అమరత్వం అజరామరంగా నిలిచి ఉంటుంది.

(నేడు టిప్పు సుల్తాన్ వర్ధంతి)

-యండి .ఉస్మాన్ ఖాన్,

సీనియర్ జర్నలిస్ట్

99125 80645

Tags:    

Similar News