త్యాగమూర్తి రమాబాయి

అంబేడ్కర్ మనకు చదువు, గూడు, నీడ, స్వేచ్ఛగా బతికే జీవితం ఇచ్చారని అందరం చెప్పుకుంటాం. ఇవన్నీ మనకు ఇచ్చిన ఆయన తన కుటుంబానికి

Update: 2024-05-26 00:30 GMT

అంబేడ్కర్ మనకు చదువు, గూడు, నీడ, స్వేచ్ఛగా బతికే జీవితం ఇచ్చారని అందరం చెప్పుకుంటాం. ఇవన్నీ మనకు ఇచ్చిన ఆయన తన కుటుంబానికి మాత్రం ఏమిచ్చాడని ప్రశ్నించుకుంటే ఆయన భార్య రమాబాయి పోరాటం కన్పిస్తుంది‌. అణగారిన వర్గాల కోసం అంబేడ్కర్ చేసిన ప్రతీ పోరాటంలో.. చరిత్ర గుర్తించలేని రమాబాయి త్యాగాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంబేడ్కర్‌కు సహచరిగా ఆమె త్యాగమే నేటి ఈ బడుగు, బలహీన వర్గాల బతుకులు. ఆమె 9 ఏళ్ల వయస్సులో అంబేడ్కర్‌తో వివాహమైంది. ఆమె పొరాటం సామాన్యమైనది కాదు. అసామాన్యమైన త్యాగఫలం. అంబేడ్కర్ ఈ దేశానికి, స్త్రీలకు, అట్టడుగు వర్గాలకు, బి సి లకు చేసిన త్యాగం ఎన్నటికీ, ఎప్పటికీ మరువలేనిదే. కానీ చరిత్ర గుర్తించని, మరుగున పడిన మహనీయ చరిత తల్లి రమాబాయిది.

అంబేడ్కర్ పొందిన డిగ్రీలు..

భర్త భవిష్యత్తు కోసం, జాతి భవితవ్యం కోసం వేగంగా పరుగులెడుతుంటే.. ఆ మార్గంలో కుటుంబ సమస్యలు అనే ముల్లు అంబేడ్కర్‌కు గుచ్చుకోకుండా ఆ ముల్లుపై ఆమె చేతులు పెట్టి రక్తపు గాయాలతో ఆయనను ముందుకు సాగనంపింది. తన కడుపున పుట్టిన బిడ్డలు తన కళ్ళెదుటనే ఒకరి తర్వాత ఒకరిగా ఆకలితోనూ, సరైన వైద్యం అంద‌‌‌క మరణిస్తున్నా ఆ కడుపు కోతను భరిస్తూ భర్తని ముందుకు నడిపిస్తూ.. పిడకలు అమ్మి, పిల్లల ఆకలి తీరుస్తూ.. అంబేడ్కర్ చదువు కోసం డబ్బులు పంపేది.

అంబేడ్కర్‌ చదువులు కోసం లండన్‌ వెళ్లేటప్పుడు రమాబాయినే కుటుంబ అవసరాలు తీర్చారు. కుటుంబ జీవితంలో ఎన్ని కష్టాలు, నష్టాలు జరిగినా ఆమె ఏరోజు చలించిపోలేదు, సమస్యలకు లొంగిపోలేదు. అంబేడ్కర్‌ పొందిన ఎన్నో డిగ్రీలు.. రమాబాయి త్యాగనిరతికి ప్రతీకలు. భర్త అందరికీ దీపంలా వెలగటానికి.. ఆమె తన రక్తాన్నే చమురుగా మార్చింది. చివరకు రక్తహీనతతో 35 ఏళ్ల వయసులోనే మరణించింది. ఆమె చేసిన త్యాగం, పోరాటం ఎప్పటికీ మరువలేనిది. ఆమె త్యాగం విశ్వం ఉన్నంతవరకు చెరపలేని చరిత్ర. ఈ దేశం బంగారు భవిత కోసం సగానికిపైగా ఉన్న మహిళలు తమ దిశను తల్లి రమాబాయి వైపు నుంచి చూసుకుంటే ఆ కుటుంబం సమాజానికి చిరుదివ్వెలుగా వెలుగుతుంది. వారి ఆశయాలను సాధించడానికి వారు చూపిన మానసిక ధైర్యం అలవర్చుకొని.. అణగారిన వర్గాల కోసం ముందు నడవడమే మనం వారికి ఇచ్చే ఘన నివాళులు..

సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు.

78933 03516

Tags:    

Similar News