కవిత: నేనూ పోలీసునైతే

poem on police commemoration day

Update: 2022-10-20 18:30 GMT

ఆ రోజు అక్టోబరు ఇరవై

అందరూ అనుకుంటుంటే విన్న

అమరుడైనాడని మా నాన్న

అమరుడంటే అర్థంగాక

అదే పనిగా

గుచ్చిగుచ్చి అడిగితి అమ్మను!

నోట మాట రాక

నాన్న ఫొటో వంక చూస్తూ

చతికిలబడిపోయింది అమ్మ

కంటికీ మంటీకి ఏకధారైంది కన్నీరు

గాలి ఆగిపోయింది

చెట్టూ లేదు పక్షులెగురలేదు

పొయ్యి రాజుకోలేదు

పచ్చిమంచి నీళ్లు ముట్టుకోలేదు

అమ్మ అడుగులో అడుగేసుకుంటూ

ఇంట్లోనే ఉన్న

ఇవరమడిగితే అంత బాధైతే

ఇంకోసారి అడుగొద్దనుకున్న

మరుసటి రోజు అక్టోబరు ఇరువయ్యెకటి

పోలీసు బ్యారకుల పక్కన పరేడు గ్రౌండు

తురగపదాతి దళములతో

పటాలములన్నీ పయనమై వచ్చినాయి

సూర్యోదయ సమయాన

సైరన్ మోతలు పైలట్ కూతలు విని

నేనూ పడుగెడితిని పరేడు గ్రౌండుకు

ముఖ్యమంత్రి గృహమంత్రి డీజీపీ తదితర

ఉన్నత పోలీసు అధికారులు అగుపించిరక్కడ!

అందరి ముఖాల్లో ప్రస్ఫుటమైన విషాధచాయలు

భారమైన హృదయాలతో చదివిరి పేర్లు

తెలియజేసిరి రక్షకులు అమరులైనారని

బాధ్యతలను గుర్తు చేసుకొని వారి ఆశయ సాధనకు

పునరంకితం కావాలని ముక్త కంఠంతో పూనిరి ప్రతిన

చదివిన పేరులందు స్పష్టంగానే వింటి మా నాన్న పేరు

హోదా కానిస్టేబులు! వివరణ స్పష్టం! విశదీకరణ సుస్పష్టం!

ధర్మభూమి జన రక్షణ సమరాగణమందు

సర్వశక్తులు ఒడ్డి దేశ ద్రోహులను మట్టి గరిపించుటకై

చేసిరట సాహసోపేతమైన పోరాటం!

శత్రువు మాటువేసి చాటు నుండి వేసిన దొంగ దెబ్బకు

అబ్బా! అనకుండ అధైర్యపడకుండా మందుకు సాగుతూ

అలజడి మూకలను మట్టిగరిపించి

పరలోకాలకు పారిపోతున్న దేశ ద్రోహ శక్తులను

చివరంటూ తరిమి తరిమి నరకలోకాన పాతెనట!

ఆపై అమరలోకం ఆహ్వానంపై అచట కేగుతూ

తన సహచరులకు ఆదర్శప్రాయుడై సందేశ ప్రదీప్తియై

పసితనంలోనే పండుతాకయినాడంట!

సందర్భోచిత నిర్ణయాలతో మా నాన్న ప్రదర్శించిన

వీరోచిత పోరాట పటిమ గురించి విని గర్వించి

అది పర్వంగా భావించాను నేను!

ఆయన జీవితపుటద్దంలో దర్శించితినిపుడు

స్వచ్ఛమైన వీరత్వాన్ని! అచ్చమైన అమరత్వాన్ని!

అందుకే ఈ పర్వదినాన ప్రతినబూనితినిదిగో నాన్నా!

నేనూ పోలీసునౌతాను! వెలుగులు నిండిన

నీ అమరత్వాన్ని అష్టదిక్కులకూ చాటుతాను!

నీవు మిగిల్చిన కార్యభారాన్ని మోయడానికి

కర్తవ్యపరాయణ దీక్షా కంకణాన్ని ధరించాను!

నీ ఆశయ సాధనను వరించాను!అడుగుముందుకు వేశాను

భారతావనికి మునుపటి తేజాన్ని తెస్తాను

అమరులందరి ఆత్మలకు శాంతిని చేకూరుస్తాను!

అవుతాను భారతదేశ పోలీసుల్లో కలికితురాయిని!

అమరలోకం నుండి ఆశీర్వదించు నాన్నా! ఆనందించు నాన్నా!!

పెద్దిరెడ్డి తిరుపతిరెడ్డి

94400 11170

Tags:    

Similar News