ఉచిత హామీలపై అదుపు లేదా?

No control over free guarantees

Update: 2023-10-31 00:30 GMT

త్వరలో జరగనున్న శాసనసభ ఎన్నికల్లో గెలుపే అంతిమ లక్ష్యంగా, విజయ బావుటా ఎగిరేయడమే సంకల్పంగా, అన్ని పార్టీలు ఉచిత హామీలు గుప్పిస్తున్నాయి. ‘అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న’ అన్నట్లు వాగ్దానాలలో ఒకరిని మించి ఒకరు ఉచిత హామీల వరద పారిస్తున్నారు. అయితే అన్నీ పార్టీలు పథకాలు ప్రకటిస్తున్నాయి తప్పా, ఎలా అమలు చేస్తారో చెప్పడం లేదు. ప్రస్తుతం ఉన్న పథకాలను అప్పులు చేసి అమలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో కొత్త వాటికి నిధులు ఎలా సమీకరిస్తారన్నది మాత్రం చెప్పడం లేదు. ఇంకోపక్క అన్ని రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలో పేర్కొన్న హామీల ఉచితానుచితాలపై ప్రజల్లో చర్చ జరిగిన సందర్భం లేదు. ఆయా జనాకర్షణ పథకాలు అమలు అయితే రాష్ట్రం అప్పులపాలు కావడం షరా మామూలే. ప్రజలకు విద్య, వైద్యం, న్యాయం మాత్రమే ఉచితంగా లభించాలన్న అంబేద్కర్ గారి ఆశయాలకు వ్యతిరేకంగా జనాకర్షణ పథకాలతో, అమలు కాని హామీలతో ఆయా పార్టీలు అధికారంలోకి రావడానికి ప్రజలను మభ్యపెడుతున్నాయి.

ధనం సమకూరేదెలా?

ప్రస్తుతం రాజకీయ పార్టీలు మేనిఫెస్టోలు ప్రకటిస్తున్న తీరు ప్రజాస్వామ్యబద్దంగా లేదనడంలో సందేహం లేదు. ఓటర్ మహాశయుని ప్రసన్నం చేసుకోవడానికి అనేక ఉచిత హామీలు ప్రకటిస్తున్నాయి. అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఆదాయ వ్యయాల స్పృహ లేకుండా కేవలం ప్రచారం కోసం ఓటర్లకు గాలం వేయడం కోసం ఇలాంటి హామీలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రైతులు, రేషన్ కార్డు లబ్ధిదారులు, ఆసరా పింఛనుదారులు, మహిళా సంఘాలు, పంట రుణాలు, ఉచిత విద్యుత్ మొదలైన అంశాలలో ఉచిత హామీలు ఇస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2.90 లక్షల కోట్లు. కానీ రాష్ట్ర రాబడులు రెండు లక్షల కోట్లకు మించవు. పైగా, వచ్చిన రాబడులలో సింహం భాగం సంక్షేమ పథకాలకే ఖర్చు పెడుతున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆ ఏడాది రాబడుల ద్వారా 1.92 లక్షల కోట్లు మాత్రమే సమకూరింది. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ పార్టీలు ప్రకటించిన మేనిఫెస్టోలలో ఉచిత పథకాలను అమలుపరచాలంటే బడ్జెట్లో రూ. 3.50 లక్షల కోట్లు కేటాయించాలి. జనాకర్షణ పథకాలతో జనాలను మోసం చేయడం తప్ప దేశ తలసరి ఆదాయాన్ని పెంచే వస్తువుల ఉత్పత్తి కుటీర పరిశ్రమల ఏర్పాటు, వ్యవసాయరంగంలో దిగుబడులు పెంచే పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. అందుకే ఉచిత హామీలు ఇచ్చే పార్టీలు అధికారంలోకి వస్తే ఈ హామీల అమలుకు నిధులు ఎక్కడి నుండి తెస్తాయి అన్నది కూడా స్పష్టం చేయాలి.

ఆ పార్టీల ఆట కట్టించాలి!

ఆర్థిక వ్యవస్థలో ఉచితంగా ఏది రాదు. ఉచితంగా ఏదైనా ఇస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇస్తున్నాయంటే అధికారంలోకి వచ్చాక ఆ ఉచిత కానుకలకు అయ్యే ఖర్చును మరోచోట వసూలు చేయాల్సిందే. లేకుంటే ఆర్థిక సమతుల్యత నశించి వ్యవస్థ కుప్పకూలుతుంది. కావున ఉచిత హామీల‌పైన ఎన్నికల కమిషన్ కొన్ని నిబంధనలు విధించాలి. హామీల అమలుకు నిధులు ఎక్కడి నుండి తెస్తాయి? అలాగే ఉచిత పథకాలకు బడ్జెట్ పద్దుల్లో వేటి పైన ఆయినా కోత విధిస్తారా? లేక వనరుల సమీకరణ కోసం కొత్త పన్నులు వేస్తారా అన్నది వివరించాలి. ప్రతి హామీ అమలుకు ఒక స్పష్టమైన కాల పరిమితి సూచించాలి. అధికారంలోకి వచ్చాక నిర్దిష్ట కాలపరిమితిలోగా హామీలను నెరవేర్చడంలో విఫలమైన పార్టీలు పదవి నుంచి తామంత తాముగా వైదొలిగేలా ఒక ప్రత్యేక చట్టం రూపొందించడంపై చర్చ జరగాలి. కేవలం ఓట్లు దండుకోవడం కోసం ప్రజలకు మోసపూరిత హామీలు ఇచ్చే పార్టీల ఆట కట్టించాలి. ఎన్నికల వేళ వివిధ రాజకీయ పార్టీలు ప్రజల కనీస అవసరాలు కూడు, గూడు, గుడ్డలతో సంబంధం లేని ఇతర అంశాలపై చర్చను మళ్లిస్తూ ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకుని ప్రయత్నాలు చేస్తుంటాయి. ఈ కుతంత్రాన్ని అడ్డుకునే ప్రజా చైతన్యం రావాలి. ఏదైనా ఉచితంగా ఎలా ఇస్తారంటూ ప్రజలే పార్టీలను నిలదీయాలి. లేకపోతే వెనిజులా దేశానికి పట్టిన గతే మన రాష్ట్రానికి పడుతుంది. అంతిమంగా ప్రజలపై అంతిమ భారం తప్పదు.

అంకం నరేష్

96036 50799

Tags:    

Similar News