నేటికీ.. ఓటు వినియోగానికి కారణాలివేనా?

National Voters' Day 2024: Even today, are these reasons to vote?

Update: 2024-01-25 00:45 GMT

మన ఓటును నీతి, నిజాయితీ, ప్రజా సంక్షేమం, అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థులకు వేసి గెలిపించుకోవడమే అసలు సిసలైన దేశభక్తి. అందుకే అభ్యర్థి ఏ పార్టీవాడని కాదు, ఏ పాటివాడో చూడు అని చెప్పిన కాళోజీ మాటలు అక్షర సత్యం. కాబట్టి ఓటు మన హక్కు మాత్రమే కాదు బాధ్యత కూడా.

ఓటు భారత రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆ హక్కును వినియోగించుకుని ఓటు వేసి, ఒక గొప్ప పని సాధించినట్లు ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో పని అయిపోయినట్లు అనుకోవడం అందరికీ అలవాటు అయ్యింది. కానీ ఓటు హక్కును వినియోగించుకునే ముందు పౌరులుగా ఎప్పుడైనా మన బాధ్యత ఏమిటని ఆలోచించామా? నిజంగా ఓటరుగా మన విధులను ఎప్పుడైనా నిర్వహిస్తున్నామా? ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే మొన్న 2023 నవంబర్ 30న తెలంగాణలో జరిగిన మూడో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అప్రజాస్వామికమైన విషయాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనందరికి తెలిసినవే.

వారి మాయలో పడి

ప్రజాస్వామ్యంలో ఎన్నికలనేవి, ప్రజలు పరిపాలన ద్వారా గ్రామం మొదలు దేశ స్థాయి వరకు సరైన రీతిలో అభివృద్ధి చేసుకోవడానికి సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు ఏర్పాటు చేసుకున్న ప్రక్రియ. ఈ ప్రక్రియలో పాలుపంచుకునేందుకు కనీస వయస్సు 18 ఏళ్లుగా నిర్ణయించారు. మరి ఆ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు విద్యావంతులై ఉండి కూడా ఎవరికి ఓటేయాలనే విషయంలో స్పష్టత లేక ఇతరులపై ఆధారపడడం విచారకరం. ఇప్పటికీ దేశంలో ఓటు హక్కును దేని కోసం వినియోగించుకుంటున్నామో తెలియని ప్రజలే అత్యధికులు. ప్రజల అమాయకత్వం, నిరక్షరాస్యత ఇప్పటికి ఎన్నికలకు పెద్ద సమస్యే. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు బంధువులా, స్నేహితులా అనే కాకుండా తమ కులమా, మతమా? అనే అంశాల ఆధారంగా ఎన్నుకోవడం దురదృష్టకరం. కొన్ని సందర్భాలలో పోటీచేస్తున్న వ్యక్తికి నాయకత్వ లక్షణాలు ఉన్నాయో లేవో చూడకుండానే, తమ సమస్యల పరిష్కారానికి ఎలాంటి ఆలోచన, పద్ధతులు పాటిస్తాడని గమనించకుండానే, ప్రచార సమయంలో వారు చేసే ఖర్చుల మాయలో పడి ఓట్లు వేయడం సహజంగా జరిగిపోతుంది. ఇంకొన్ని చోట్ల పదేపదే ఎన్నికలలో పోటీచేసి ఓడిపోయి నష్టపోయారని జాలితో కూడా ఓట్లు వేసి గెలిపించడం విషాదకరం.

మనకెందుకులే అనుకొనే..

ఇక అక్షరాస్యుల విషయం కూడా ఇంతకంటే నిరక్షరాస్యంగా కొనసాగుతోంది. వీరు విద్యావంతులు అయినప్పటికీ చదువు, ఉద్యోగం, ఇతర బాధ్యతలు, అనవసర వ్యాపకాల కారణంగా సామాజికాంశాలపై కనీస శ్రద్ధ పెట్టకపోవడం శోచనీయం. సమాజాభివృద్ధికి ప్రభుత్వాలు ప్రవేశపెట్టే పథకాలపై, ఉచితాలపై సరైన అవగాహన లేదు. ఆ పథకాలు ఎంతవరకు తమకు ప్రయోజనాన్ని కలిగిస్తున్నాయి, నష్టపరుస్తున్నాయనే అవగాహన వీళ్ళకు లేకపోవడం, వాటి గురించి కనీసం ఆలోచన చేయకపోవడం మరింత సిగ్గుచేటు. ప్రజాస్వామ్యం అంటేనే ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలు ఎన్నుకునే ప్రభుత్వం. కానీ ప్రస్తుత ఎన్నికల ప్రక్రియ రాజకీయ పార్టీలకు, కొందరు వ్యక్తులకు, కొన్ని కుటుంబాలకు మాత్రమే సంబంధించిన అంశంగా మారిపోయింది. దీనికి ప్రధాన కారణం ఓటర్లు వారి బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యం. సామాజికాంశాల విషయంలో మనకెందుకులే అనే నిర్లిప్తతలే ఇందుకు కారణం.

ఈ కనీస అవగాహన ఉండాలి!

ఇక ప్రజాప్రతినిధుల విషయానికి వస్తే,అధికారం సంపాదించుకున్న తరువాత రాజకీయ నాయకులు తమ తెలివి, బలం ఆధారంగానే సమాజం నడుస్తుంది, ఉద్దరింపబడుతుందనే అహంకారపూరిత ధోరణి ప్రదర్శించడం ఓటర్లలో రాజకీయాల పట్ల విరక్తి కలిగించేలా ఉంటుంది. దీనికి తోడు యథారాజా తథాప్రజా అన్నట్లు కొందరు చిన్న నాయకులు వారి స్వప్రయోజనాల కోసం పెద్ద నాయకులనే అనుసరించడం వీరి ప్రవర్తనను దగ్గరగా చూసిన ప్రజలు రాజకీయాలను అసహ్యించుకోవడం, అసలు రాజకీయాలు, ఎన్నికలు అనేవి తమకు సంబంధించినవి కావు అనే ధోరణిలోకి వెళ్లిపోతున్నారు. అందుకే ప్రతి ఓటరు తన వ్యక్తిగత విషయాలే కాకుండా సమాజంలో జరుగుతున్న ప్రతి అంశంపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి. ఇతరులలో కూడా ఈ విషయాలలో చైతన్యం తీసుకురావాలి. ఓటు ఎందుకు వేస్తున్నాం. దానితో ఎలాంటి మేలు, అభివృద్ధి జరుగుతుందో అనే కనీస అవగాహన అత్యంత అవసరం.

(నేడు జాతీయ ఓటరు దినోత్సవం)

నల్ల రాజేశ్వరి,

ఉపాధ్యాయురాలు

94912 43739

Tags:    

Similar News