క్షయరహిత భారత్‌లో పాలుపంచుకుందాం!

ప్రపంచంలో ప్రతీ ఏట 10 మిలియన్ల ప్రజలకు టీబీ సోకితే అందులో 1.5 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఐరాస గణాంకాలు

Update: 2024-05-26 00:45 GMT

ప్రపంచంలో ప్రతీ ఏట 10 మిలియన్ల ప్రజలకు టీబీ సోకితే అందులో 1.5 మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఐరాస గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. భారత్‌, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇండోనేషియా, నైజీరియా, ఫిలిప్పీన్స్‌, దక్షిణాఫ్రికా లాంటి‌ స్వల్ప, మధ్య ఆదాయ దేశాల్లోనే ఈ టీబీ తాకిడి అధికంగా కనిపిస్తున్నది. 2021 వివరాల ప్రకారం.. భారత్‌లో దాదాపు 2.9 మిలియన్ల టీబీ కేసులు నమోదైతే.. అందులో దాదాపు 5 లక్షల మంది మరణించారని స్పష్టం అవుతున్నది. ప్రపంచవ్యాప్త టీబీ కేసుల్లో దాదాపు 30 శాతం వరకు భారత్‌లోనే నమోదు అవుతున్నాయి.

మానవాళి కోవిడ్‌-19 విపత్తు కట్టడి చర్యలతో టీబీ నిర్మూలన కార్యక్రమాలు కొంత మందకోడిగానే జరిగినట్లు తెలుస్తున్నది. దీంతో క్షయ వ్యాధి నిర్థారణలో ఆలస్యం కావడం.. చికిత్స అందించడంతో నిర్లక్ష్యం కారణంగా టీబీ ప్రాణాంతకంగా మారుతున్నది. క్షయవ్యాధి లేదా టీబీ (ట్యూబర్‌క్యులోసిస్‌) అతి ప్రమాదకర ఊపిరితిత్తులకు సంబంధించిన అంటువ్యాధి. ఇది మానవాళి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా అనాదిగా ప్రాణాలను సహితం కబలిస్తున్నది. ఇది శరీరంలో చర్మం నుంచి మెదడు వరకు ఏ అవయవ భాగానికైనా రావచ్చు. ఈ రోగాన్ని అశ్రబ్ధ చేస్తే ప్రాణాలను తీస్తుందని గమనించాలి. నోబెల్‌ బహుమతి గ్రహీత రాబర్ట్‌ కోచ్ తొలిసారి 1882లో గుర్తించిన టీబీ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి దగ్గినా, తుమ్మినా లేదా ఉమ్మినా గాలి ద్వారా ఇతరులకు సోకుతుంది. ‌టీబీ వ్యాధి ఏ వయస్సులోని వారికైనా రావచ్చు. ఈ రోగమొచ్చి చికిత్స చేయించుకోని టీబీ రోగుల్లో 67 శాతం వరకు (ప్రతి ముగ్గురిలో ఇద్దరు) మరణిస్తున్నారు.

దీర్ఘకాలం దగ్గు కొనసాగినప్పుడు..

దేశంలో 2020 - 25 మధ్య క్షయ వ్యాధికి చరమగీతం పాడాలనే సంకల్పంతో భారత ప్రభుత్వం ‘జాతీయ‌ టీబీ నిర్మూలన క్రార్యక్రమం (ఎన్‌టిఈపి)’ రూపంలో ప్రణాళికలు అమలు చేయడం చేస్తుంది. 2025 నాటికి భారతాన్ని క్షయరహిత దేశంగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పెద్ద ఎత్తున పెద్దలకు కూడా బిసిజీ టీకాలను ఇవ్వడానికి ప్రతిన బూనింది. 60 ఏండ్లు దాటిన వయోజనులు.. మద్యం బానిసలు, టీబీ వ్యాధిగ్రస్తులకు సమీపాన ఉండే పెద్దలు.. ఐదేళ్లు పైబడి టీబీ వ్యాధిగ్రస్తులున్న కుటుంబ సభ్యులు, బిఎంఐ (బాడీ మాస్‌ ఇండెక్స్‌) 18 లోపు నమోదైన పెద్దలందరికీ వెంటనే ప్రాధాన్యతా క్రమంలో ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన ఎనిమిది రాష్ట్రాలు, జిల్లాల్లో.. తొలి విడతలో ఇవ్వడం ప్రారంభం అయ్యింది. మలివిడతలో తెలంగాణలోని ఎంపిక చేసిన 17 జిల్లాల్లో జూలై - ఆగష్టు మాసాల్లో ప్రారంభించి మూడు మాసాల్లో పూర్తి చేయనున్నారు. ఇంటింటా సర్వే నిర్వహించి ఎంపిక చేసిన 18 ఏండ్లు దాటిన పెద్దలకు టీబీ లేదా బీసీజీ టీకాలను యుద్ధ ప్రాతిపదికన ఇవ్వనున్నారు. హైదరాబాద్‌కి చెందిన భారత్ బయోటెక్‌ కంపెనీ రూపొందించిన బిసిజీ ‘ఎంటీబీవ్యాక్‌ (ఎంటిబీవిఏసి)’‌ టీకాలు పిల్లలు/ పెద్దలకు ఇస్తున్నారు. టీబీ సోకే అవకాశాలు అధికంగా ఉన్న ప్రజలు.. వెంటనే టీబీ టీకాను తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేతులు శుభ్రంగా కడుక్కోవడం, దగ్గినప్పుడు నోటిని కండువాతో కప్పుకోవడం, వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండడం. వైద్యులు సూచించిన మందులు విధిగా వాడడం, గాలి వీచే వెలుతురు ఉన్న గదుల్లో జీవించడం, దీర్ఘకాలం పాటు దగ్గు కొనసాగినపుడు పరీక్షలు చేయించుకోవడం లాంటి చర్యలు తీసుకుంటూ.. క్షయ రహిత ఆరోగ్య భారత నిర్మాణంలో పాలుపంచుకుందాం.

డా. బుర్ర మధుసూదన్ రెడ్డి

9949700037

Tags:    

Similar News