23 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న సినిమాహాళ్లు! ఎక్కడంటే?

దశాబ్దాలుగా కాశ్మీరులో అన్ని దిక్కులా అందరూ ఒకటే పరుగు. బాంబుల మోత, మృత్యుతాండవం. ఆ పందెం ఎవరు పెట్టారో, ఎవరు గెలిచారో,

Update: 2022-09-23 18:45 GMT

అలనాటి సినిమాలలో ప్రేమ, రోమాన్స్‌కు కాశ్మీర్ పర్యాయ పదం. అక్కడి అందమైన దృశ్యాలు, దాల్ లేక్ నీలి దనం, చెట్ల పచ్చదనం, హిమాలయాల తెల్లని మెరుపు ప్రధాన నేపథ్యాలుగా అప్పటి సినిమాలు రూపొందాయి. స్వాతంత్ర్యానంతర కాలం నుంచి బాలీవుడ్ సినిమాకు లవ్, రొమాన్స్ ప్రధాన ఇతివృత్తాలు. అందుకే కాశ్మీర్ అప్పటి చలన చిత్రకారులకు స్వర్గధామంగా నిలిచింది. జంగ్లీ, కాశ్మీర్‌ కీ కలీ, జబ్ జబ్ ఫూల్ ఖిలే, కభీ కభీ, ఆప్ కీ కసం, బాబీ, సిల్‌సిలా, బేతాబ్ ఇలా ఎన్నో సినిమాలు కాశ్మీర్ అందాలను అందిపుచ్చుకొని ప్రేక్షకులను అలరించాయి. ఆ కాలంలో సినిమావాళ్లకు కాశ్మీర్ అంటే లొకేషన్లే తప్ప అక్కడి జీవన పరిస్థితులు, స్థానిక నటులు తదితర అంశాలేవీ పట్టేవి కావు.

దశాబ్దాలుగా కాశ్మీరులో అన్ని దిక్కులా అందరూ ఒకటే పరుగు. బాంబుల మోత, మృత్యుతాండవం. ఆ పందెం ఎవరు పెట్టారో, ఎవరు గెలిచారో, ఎవరు ఓడారో? అంతా తెలిసినట్టూ, ఏమీ తెలియనట్టూ ఉంటుంది.హింస దాదాపు ఏ రంగాన్నీ వదలలేదు. జనం గుప్పిటలో ప్రాణాల్ని పెట్టుకుని నెట్టుకొచ్చారు. ఇంకా నెట్టుకొస్తున్నారు. చాలా కాలం ఇంటర్నెట్ ఆపారు. వాటన్నింటితో పాటు అక్కడ 'వెండితెర' కు విరామం పడి చాలా యేళ్లయింది. సినిమాహాళ్లు మూతబడి శిథిలమైపోయాయి.

అక్కడ ఎప్పటికైనా సినిమాల టైటిల్సూ, శుభం కార్డులూ పడతాయా? అని అందరూ ఎదురు చూసారు. కాశ్మీర్‌లో మొత్తం వినోద రంగం, ముఖ్యంగా సినిమా తీవ్ర ఉత్కంఠకు గురైంది. 1990లో ఉగ్రవాద ఉధృతితో కాశ్మీరులో వెండితెర కనుమరుగైంది. 1996–98 నడుమ బ్రాడ్వే, నీలం టాకీసులను ప్రారంభించాలనుకున్నారు. కానీ, ఆ ప్రయత్నం ఫలించలేదు.

సుదీర్ఘ కాలం తరువాత

23 యేళ్ల విరామం తర్వాత కాశ్మీరీ సినిమా తెరకు విముక్తి కలిగింది. ఈ నెల 18 ఆదివారం రోజున జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పుల్వామా, షోఫియాన్ జిల్లాలలో సినిమాహాళ్లను ప్రారంభించారు. గతంలో అత్యంత మిలిటెన్సీ ఉన్న ఆ జిల్లాలలో వినోదం అందించేందుకు టాకీసులను తిరిగి తెరిచారు. ఇక యువకులకు వినోదాత్మక విజ్ఞానం అందుతుందని భావిస్తున్నారు. దీనితో పాటు శ్రీనగర్‌లోని శివపురా ప్రాంతంలో 'మల్టీ‌ప్లెక్స్' కూడా 'విక్రం వేదా' పొన్నియన్ సెల్వన్ సినిమాతో త్వరలో మొదలు కానుంది. నిజానికిది మంచి పరిణామమే. దశాబ్దాలుగా సినిమా వినోదానికి దూరమైన కాశ్మీరీవాసులకు ఆనందదాయకమే.

ప్రపంచంలో ఇవ్వాళ దృశ్య మాధ్యమం ఎంతగా అభివృద్ధి చెందిందో, ఎంతగా విస్తరించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు. అందరమూ చూస్తున్నదే. అనుభవిస్తున్నదే. ఆ స్థితిలో ఒక ప్రాంతం సినిమా ప్రదర్శనకు దూరం కావడం అభిలషణీయం కాదు. ఆ ఆనందం సుహృద్భావ వాతావరణంలో కొనసాగాలని కోరుకుందాం. అక్కడ వివిధ భాషా సినిమాలే కాకుండా కాశ్మీరీల సొంత సినిమా ఎదగాల్సి వుంది. అందుకు పాలకులు రక్షణ, వసతులు కల్పించాలి. సినిమాల నిర్మాణానికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. అప్పుడే నిఖార్సయిన కాశ్మీరీ ప్రాంతీయ సినిమా పాదులు వేసుకుని విస్తరిస్తుంది.

ఎన్నో అందమైన సినిమాలు

భారతీయ సినిమా నిర్మాణంలో కాశ్మీర్‌ది విలక్షణ స్థానం. 'మేరె సప్నోంకి రాణి కభ్ ఆయేగితూ' 'కభీ కభీ మేరె దిల్ మే ఖయాల్ ఆతా హయ్ ' 'పర్‌దేశీయోసే న అఖియా మిలానా' ఇలా ఒకటేమిటి, అనేక హిందీ సినిమాలు, పాటలలో కాశ్మీరీ అందాలు కనిపిస్తాయి. ఎన్టీ రామారావు 'ఆరాధన' శోభన్‌బాబు-జయలలిత 'డాక్టర్‌బాబు' లాంటి అనేక తెలుగు సినిమాలు కూడా కాశ్మీర్ నేపథ్యంలో రూపొందినవే. అలనాటి సినిమాలలో ప్రేమ, రోమాన్స్‌కు కాశ్మీర్ పర్యాయ పదం. అక్కడి అందమైన దృశ్యాలు, దాల్ లేక్ నీలిదనం, చెట్ల పచ్చదనం, హిమాలయాల తెల్లని మెరుపు ప్రధాన నేపథ్యాలుగా అప్పటి సినిమాలు రూపొందాయి. స్వాతంత్ర్యానంతర కాలం నుంచి బాలీవుడ్ సినిమాకు లవ్, రొమాన్స్ ప్రధాన ఇతివృత్తాలు.

అందుకే కాశ్మీర్ అప్పటి చలన చిత్రకారులకు స్వర్గధామంగా నిలిచింది. జంగ్లీ, కాశ్మీర్‌ కీ కలీ, జబ్ జబ్ ఫూల్ ఖిలే, కభీ కభీ, ఆప్ కీ కసం, బాబీ, సిల్‌సిలా, బేతాబ్ ఇలా ఎన్నో సినిమాలు కాశ్మీర్ అందాలను అందిపుచ్చుకొని ప్రేక్షకులను అలరించాయి. ఆ కాలంలో సినిమావాళ్లకు కాశ్మీర్ అంటే లొకేషన్లే తప్ప అక్కడి జీవన పరిస్థితులు, స్థానిక నటులు తదితర అంశాలేవీ పట్టేవి కావు.

వారికి లభించని అవకాశాలు

నిజానికి కాశ్మీర్ నుంచి బాలీవుడ్‌లో ఎదిగి వచ్చిన నటులు అతి స్వల్పం. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఒకప్పటి హీరో రాజ్‌కుమార్ (కుల్‌భూషణ్ పండిట్). 'నీల్‌కమల్' నుంచి అనేక సినిమాలలో హీరోగా నటించి తనదైన ప్రత్యేక సంభాషణల ఒరవడితో నిలదొక్కుకున్న నటుడు రాజ్‌కుమార్. ఇంకా కాశ్మీర్ నుంచి వచ్చినవారిలో అనుపమ్ ఖేర్, రాజ్ జుత్సి, రాహుల్ భట్, ఆర్‌కే రాయినా, ఎంకే రాయినా, రోహిత్ రాయినా, ఆమిర్ భషీర్, లలిత్ పరిమో, సోని రాజ్‌దాన్‌లాంటివారు కొంత నిలదొక్కుకున్నారు. తొలిరోజులలోనే సప్రూ, అతని కొడుకు తేజ్ సప్రూ, జీవన్ అతని కుమారుడు కిరణ్‌కుమార్ బాంబే సినిమాలలో స్థానం సంపాదించుకున్నారు.

తొలుత కాశ్మీర్ అందాలకే పరిమితమైంది. తర్వాత ఉగ్రవాదం లాంటి సమస్యల మీద సినిమాలు తీసినప్పటికీ, అందులోని కాశ్మీరీ పాత్రలలో బాంబే నటులే నటించడం చూసాం. పఠాన్ పాత్రలకు మాత్రమే కాశ్మీరీ కళాకారులకు అవకాశమొచ్చేది. రోజా, దిల్ సే, మిషన్ కాశ్మీర్, యహా, చాహా, రాక్ స్టార్, హైదర్, హైవే, ఫనా లాంటి అనేక సినిమాలు కాశ్మీర్ నేపథ్యంలో వచ్చినప్పటికీ, అందులో హిందీ నటులే తప్ప కాశ్మీరీ నటీ నటులకు అవకాశాలే రాలేదు.

ఆందోళనకర పరిస్థితులు

మొదట కాశ్మీరీ భాషా చిత్రాల నిర్మాణం అక్కడే జరిగింది. మొదటి కాశ్మీరీ సినిమా 'మైంజ్ రాత్' 1964లో హిందీ, ఉర్దూ భాషలలో విడుదలైంది. జగజీ‌రామ్ దర్శకత్వం వహించారు. 1972లో కాశ్మీరీ కవి మహజూర్ జీవిత చరిత్ర ఆధారంగా 'షాయర్ ఎ కాశ్మీర్ మహ్జార్' సినిమా వచ్చింది. దర్శకుడు ప్రభాత్ ముఖర్జీ. జమ్మూ కాశ్మీర్ సమాచార శాఖ సహకారంతో ఈ సినిమాను రూపొందించారు. తర్వాత నాలుగు దశాబ్దాలకు 'బాబాజీ' రూపొందింది. జ్యోతి సారూప్ దర్శకత్వం వహించారు. ఇది కాశ్మీర్ లో విడుదల కాలేదు. 1989లో నిర్మించిన 'ఇన్‌క్విలాబ్' ఆందోళనకర పరిస్థితులలో విడుదల కాలేదు. అప్పటి నుంచి కాశ్మీరీ సినిమా ఉనికే లేకుండా పోయింది. నిర్మాణంలోనే కాదు, ప్రదర్శన రంగం కూడా తీవ్ర ప్రభావానికి లోనైంది. 1989లో సినిమా టాకీసులన్నీ మూసేసారు. డిజిటల్ పైరసీ పెరిగిపోయింది. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వ చొరవతో 1996లో బ్రాడ్వే, రీగల్, నీలం లాంటి సినిమాహాళ్లు తెరుచుకుని 'కరీబ్' లాంటి సినిమాలను ప్రదర్శించాయి. 2015 తర్వాత మళ్లీ మూతబడ్డాయి.

బషీర్ బద్గామీ, సిరాజ్ ఖురేషీ లాంటి వారి టీవీ సినిమాలు నిర్మాణమవుతున్నాయి. డాక్యుమెంటరీ విభాగంలో కాశ్మీర్ కొంత విజయాన్ని సాధించింది. అశ్విన్ కుమార్ రూపొందించిన 'పంపోష్', 'ఇన్‌షా అల్లా' డాక్యుమెంటరీలు కేన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించబడ్డాయి. ఇలా కాశ్మీరీ సినిమా కుదేలైనప్పటికీ, ఇటీవలి కాలంలో కాశ్మీరీ నటీనటులు తమ ఉనికిని చాటుకుంటున్నారు. ప్రధాన స్రవంతిలో నోట్‌బుక్, హమీద్, లైలా మజ్నూలాంటి సినిమాలలో మీర్ సర్వర్, మావుజం భట్, వికాస్ కుమార్ లాంటి నటులు ప్రధాన భూమికలను పోషించారు. ఇండిపెండెంట్ సినిమాలలో తమ కథలను తామే తెరపై ఆవిష్కరించుకుంటున్నారు. ఆమిర్ బషీర్ తీసిన 'హారుద్', మూసా సయ్యీద్ తీసిన 'వాలీ ఆఫ్ సెయింట్స్', డేనిష్ రెంజు తీసిన'హాఫ్ విడో', హుసేన్ ఖాన్ రూపొందించిన 'కాశ్మీర్ డైలీ' వీటిలో ముఖ్యంగా చెప్పుకోదగినవి.


వారాల ఆనంద్

94405 01281

Tags:    

Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News