బిలియనీర్ల భారత్‌గా దేశ పయనం..!

బ్రిటిష్ రాజ్యాధికారాన్ని పారదోలి ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించాలని ఆనాడు కోరుకున్న కలలన్నీ చెదిరిపోతున్నాయి. దేశంలో డెమోక్రసీ

Update: 2024-05-26 01:15 GMT

బ్రిటిష్ రాజ్యాధికారాన్ని పారదోలి ప్రజాస్వామ్య దేశంగా భారత్ అవతరించాలని ఆనాడు కోరుకున్న కలలన్నీ చెదిరిపోతున్నాయి. దేశంలో డెమోక్రసీ ఫ్లూటోక్రసీగా మారింది. దేశ పాలనలో అవినీతిపరులు కోటీశ్వరులుగా.. మహా కోటీశ్వరులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అవినీతి విశృంఖలమై.. నేర చరిత్ర కలవారు మన పాలకులయ్యి దేశం అల్లాడిపోతుంది. ప్రజల ఆదాయాలు జాతీయ ఆదాయంలో వారి వాటా క్రమంగా తగ్గిపోతున్నది.

దేశ ఆర్థిక అభివృద్ధి తిరోగమనంలో ఉన్నప్పటికీ కార్పొరేట్ వర్గాలకు చెందిన పై స్థాయి బిలియనీర్ల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతుంది. వీరి సంపదలోని పెరుగుదల ఏ విధమైన ఉత్పత్తి క్రమం నుంచి వచ్చింది కాదు. దేశ సహజ వనరులను దేశ సంపదను ప్రభుత్వమే కార్పొరేట్లకు తాయిలాలుగా ఇస్తోంది. దేశంలో బడా కార్పొరేట్ సంస్థ చేతుల్లో దేశంలోని పోర్టులలో 25 శాతం, సిమెంట్ ఉత్పత్తులలో 45 శాతం, స్టీల్ పరిశ్రమంలో 33 శాతం, టెలికాంలో 60 శాతం, బొగ్గు ఎగుమతుల్లో 45 శాతం కేంద్రీకృతమై ఉన్నాయి. అయితే, దేశం సంపద ప్రైవేట్ గుత్త సంస్థల చేతుల్లో కేంద్రీకృతం కారాదని ప్రభుత్వం అలా కాకుండా చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల్లో 39వ అధికరణలో స్పష్టంగా పొందుపరిచారు. మరి సంపద కేంద్రీకృతం అవుతుండడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా?

ప్రభుత్వ సంస్థల అమ్మకాలు..

ఒక పక్క ద్రవ్యలోటు పేరుతో ప్రభుత్వ సంస్థలను కారు చౌకగా అమ్మేస్తున్నారు. మరో పక్క బడా బాబులు బ్యాంకులకు బకాయి పడ్డ లక్షల కోట్ల బకాయిలు మాఫీ చేస్తున్నారు. గత తొమ్మిదేళ్లలో బ్యాంకులకు బకాయిలు పడిన పెద్దలు 14.56 లక్షల కోట్ల బకాయిలను మాఫీ చేసి కేవలం 15 శాతం మాత్రమే వసూలు చేయగలిగారు. మూడేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు 12కి కుదించారు. 2021-22 లో ఎఫ్‌డీఐ రూపేనా 4.37 లక్షల కోట్లు మన దేశ ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశిస్తే.. 2022-23 సంవత్సరంలో మన దేశంలోకి విదేశీ పెట్టుబడులు భారీగా తగ్గి 3.67 లక్షల కోట్లు మాత్రమే వచ్చాయి. విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు దేశ ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతిస్తున్నాయో ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థల పతనం చూస్తే తెలుస్తుంది. ఇన్ని దశాబ్దాల అనుభవం ఉన్న ప్రభుత్వాలు విదేశీ పెట్టుబడుల కోసం ఎగబడుతూ చేయని పనిలేదు.

బిలియనీర్ల రాజ్యం ఎవరికోసం?

1944లో బాంబే ప్లాన్ ప్రకారం.. స్వాతంత్ర్య అనంతరం ప్రభుత్వ సహాయంతో పరిశ్రమ నెలకొల్పి పారిశ్రామికీకరణ జరపాలని నిర్ణయించారు. స్వాతంత్ర్యం తొలి రోజుల్లో సామ్యవాద తరహా సమాజాన్ని స్థాపించాలని.. మన పాలకులు భారత రాజ్యాంగాన్ని రాసుకుని ప్రభుత్వమే అనేక సంస్థలను స్థాపించి సంక్షేమ రాజ్యం బాట పట్టించింది. కానీ నేడు విదేశీ పెట్టుబడులతో స్టాక్ మార్కెట్లో నిధులు కలిసి దేశాన్ని బిలినీయర్ల రాజ్యంగా మారుస్తున్నారు. స్వదేశీ విదేశీ పెట్టుబడి వర్గాల ప్రయోజనాల రక్షణకు భారీగా సబ్సిడీలు కల్పించి ప్రజా బహుళ ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు.

కార్పొరేట్ రంగానికి సబ్సిడీలా?

1991లో ఆర్థిక మంత్రి హోదాలో ఉన్న డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రపంచ బ్యాంకులో 8 ఏళ్ల పాటు పనిచేసిన అనుభవంతో యూపీఏ ప్రభుత్వ హయాంలో లైసెన్సులపై ఆంక్షలను ఎత్తివేసి గుత్త సంస్థల నిరోధక చట్టాన్ని నామరూపాలు లేకుండా చేశారు. దేశీయ ఆర్థిక వ్యవస్థ తాళాలను, తాళం చెవులతో సహా విదేశీ గుత్త సంస్థలకు వీరి నీడలో ఎదుగదలుచుకున్న స్వదేశీ పారిశ్రామిక గుత్త సంస్థలకు పాలకులు అప్పగించారు. మేము మీ కన్నా గొప్ప దేశభక్తులమని ఎన్డీఏ ప్రభుత్వం దేశాన్ని బిలీనియర్ల రాజ్యంగా మారుస్తున్నది . ప్రస్తుతం దేశంలో 200 మంది బిలియన్లు ఉన్నారు.. అమెరికా చైనా తర్వాత ఎక్కువ మంది బిలియనీర్లు ఉన్న దేశం మనదే. ప్రభుత్వం ప్రజల నుండి గడిస్తున్న ఆదాయం ఎవరి ప్రయోజనాల కోసం కార్పొరేట్ రంగానికి సబ్సిడీలు ఇచ్చేందుకేనా? ఉచితంగా భూములు కేటాయింపు వడ్డీ లేని రుణాలు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలు చౌకరేట్లకు సహజ వనరుల అమ్మకాలు ఇవన్నీ ఎవరి కోసం? ఇక ప్రభుత్వాలు ఎందుకు? ప్రభుత్వ స్థానాన్ని ప్రైవేటు కార్పొరేట్ రంగం మెల్లగా అనుభవిస్తున్నది. రాజ్యాంగాన్ని రాసుకున్నది సర్వ సమానత్వాన్ని కోరుకునేది ఇందుకేనా?

మార్చి 2024 లో వరల్డ్ ఇన్ క్వాలిటీ ల్యాబ్ అనే గ్లోబల్ పరిశోధన సంస్థ వారు భారత్ బిలినీయర్ల రాజ్యం వైపుగా పరుగులు తీస్తున్నదని తెలియజేసినారు. బ్రిటిష్ రాజ్యం నుంచి బిలియనీర్లు రాజ్యాంగ భారత్ పరిణామం చెందుతున్నదని తెలిపారు. మన దేశంలో ఉన్నత ఆదాయ వర్గం వారు ఒకే ఒక శాతం ఉన్నప్పటికీ దేశంలోని జాతీయ ఆదాయంలో 22.6% పొందగలుగుతున్నారు. ఇంకా చెప్పాలంటే 0.1 శాతం ధనికులు మన దేశ జాతీయ ఆదాయంలో పది శాతం చేజిక్కించుకుంటున్నారు. ఇది ప్రపంచ దేశాల్లోనే ఎక్కువ.

ఆదాయ సంపదలో అసమానతలు

ఇంకా సంపద విషయానికొస్తే 2022-23 లో ఒక శాతం ధనికుల దగ్గర 40.1 శాతం సంపద ఉన్నది. అనేక ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా 1990ల నుంచి ఈ ఆదాయ సంపద అసమానతలు గణనీయంగా పెరిగిపోయాయి. 1990 మధ్యకాలంలో ఇద్దరే ఇద్దరు ఉన్న మన బిలినీయర్లో ప్రస్తుతం 200 మందికి చేరారు. ఆనాడు ఆ ఇద్దరు బిలినీయర్ల ఆస్తుల విలువ 3.2 బిలియన్ డాలర్లు మాత్రమే. నేడు ఉన్న 200 బిలినీయర్ల ఆస్తుల విలువ 954 బిలియన్ డాలర్లు. ఈ విధంగా దేశ సంపద కొంతమంది చేతుల్లోకి పోవడం వలన ఆదాయ అసమానతలు పెరిగి మానవాభివృద్ధి కుంటుపడింది. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ న్యాయ ప్రత్ అనే మేనిఫెస్టో ద్వారా, మరొకవైపు బీజేపీ సంకల్ప ప్రత్ అనే మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఏ మేరకు ఉచితాలతో నోరూరిస్తూ అధికారంలోకి ఎలా రావాలి అని తాపత్రయ పడుతున్నారే తప్ప ఆశేష పేద ప్రజానీకానికి సౌకర్యాలను వారి ఆర్థిక అభివృద్ధి తద్వారా సంక్షేమాన్ని ఆలోచిస్తున్నారా? అనే అనుమానం రాకపోదు.

డాక్టర్ ఎనుగొండ నాగరాజ నాయుడు

రిటైర్డ్ ప్రిన్సిపాల్, తిరుపతి

98663 22172

Similar News