ఎంపీపై దాడి విషయంలో నిజం తెలియకపోతే.. సామాన్య మహిళల పరిస్థితి ఏంటి?

ఎక్కడో ఢిల్లీలో స్వాతిమలివాల్‌పై దాడి జరిగితే మనకెందుకులే అని మనలో చాలా మంది అనుకోవచ్చు.. కానీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఏ మహిళపై ఐనా, ఎంపీపై ఐనా, పార్టీ సభ్యురాలి

Update: 2024-05-25 01:15 GMT

ఎక్కడో ఢిల్లీలో స్వాతిమలివాల్‌పై దాడి జరిగితే మనకెందుకులే అని మనలో చాలా మంది అనుకోవచ్చు.. కానీ ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఏ మహిళపై ఐనా, ఎంపీపై ఐనా, పార్టీ సభ్యురాలి పైన ఐనా సరే... దాడి జరిగితే.. అది అంతర్గతంగా పరిష్కరించుకునే వ్యక్తిగత విషయం కాదు. కుటుంబ పెద్దలు అడుగుపెట్టి సామరస్యంగా పరిష్కరించే చిన్న విషయం కూడా కాదు. ఇందులో రాజ్యాంగపరమైన అధికారాలు.. స్త్రీల గౌరవం దాగి ఉంది. సాధారణ పౌరుడి తరఫున నిలబడతామని ప్రకటించిన ఆప్ పార్టీ నుండి ప్రజలకు తెలుసుకునే హక్కు ఉంది.

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసంలో ఏం జరిగింది? స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్ దాడి చేశారా? లేదా అన్న విషయంలో ఎవరికి నిజం తెలియని పరిస్థితి నెలకొంది. భారతదేశంలోని ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు హింసకు గురవుతున్నారు. ఈ గణాంకం స్వాతి మలివాల్‌కి తెలిసే ఉంటుంది. స్వయంగా తనపైనే దాడి జరిగినందున ఈ అంశంపై జాతీయ పార్టీగా ఆప్ 'దుష్ప్రవర్తన' గురించి ఆమె మరింత స్పష్టంగా చెప్పాలి. ఇలా చెప్పడం వల్ల బాధిత మహిళలందరికీ సందేశం చేరుతుంది. అన్ని పార్టీలకూ కనువిప్పు కలుగుతుంది.

ముందొక మాట. తర్వాతొక మాట

లిక్కర్ దందా కేసులో అరెస్టై బెయిల్‌పై జైలు నుంచి బయటికొచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. మే 13 సోమవారం ఉదయం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం ఉన్న ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్‌కు వచ్చారు. ఆమె సీఎం డ్రాయింగ్ రూమ్‌లో అధినేతను కలవడానికి వేచి ఉండగా, ముఖ్యమంత్రి సహాయకుడు బిభవ్ కుమార్ ఉన్నట్టుండి అక్కడికి వచ్చి ఆమె ముఖం, ఛాతీ, కడుపుపై పలుసార్లు చెప్పుతో కొట్టాడు. ఈ సంఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. దాడి జరిగిన రోజు నుంచి మూడు రోజుల తర్వాత పోలీసులకు మాలివాల్ చేసిన వాంగ్మూలం ప్రకారం, కుమార్ తన శరీరం దిగువ భాగంపై నిష్కారణంగా తన్నాడని ఆరోపించారు. అయితే ఈ అంశంపై మరో ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్, విలేకరుల సమావేశంలో.. మలివాల్‌తో బిభవ్ కుమార్ అసభ్యంగా ప్రవర్తించాడని అంగీకరించారు. ముఖ్యమంత్రికి ఈ ఘటన గురించి తెలుసునని, ఆయనే చర్య తీసుకుంటారని చెప్పారు. కానీ కేజ్రీవాల్ ఈ ఘటనపై సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు.ఇది జరిగిన కొద్ది గంటల్లోనే మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించిన 52 సెకన్ల వీడియో వైరల్‌గా మారింది. అందులో కేజ్రీవాల్ ఇంటి నుంచి వెళ్లిపోవాలని కోరిన సెక్యూరిటీ యూనిఫాంలో ఉన్న పురుషులతో మలివాల్ వాగ్వాదానికి దిగినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందిస్తూ నేను పోలీసులకు ఫోన్ చేశానని, ఉద్యోగాలు పోగొట్టుకుంటారని బెదిరించానని, ఈ మొత్తం వ్యవహారంలో చాలా ప్రశాంతంగా వ్యవహరించానని మలివాల్ చెబుతున్నారు. ఆ తర్వాత బిభవ్ కుమార్‌ని అరెస్టు చేశారు. అటు ఆప్ ఈ విషయంలో పూర్తి వ్యతిరేకంగా స్పందించింది. బీజేపీ కోరిక మేరకు మలివాల్ తమ పార్టీపై బురదజల్లుతున్నారని పేర్కొంది.

ప్రశ్నల మీద ప్రశ్నలు

అయితే, బిభవ్ కుమార్ మలివాల్‌తో ‘అసభ్యంగా ప్రవర్తించాడని’ సంజయ్ సింగ్ చెప్పినప్పుడు దాని అర్థం ఏమిటి? దాడి జరిగినట్టే కదా..! మహిళా ఎంపీపై దాడి జరగడం చిన్న విషయం కాదు. కుటుంబ పెద్ద పంచాయితీ ద్వారా సమస్యను పరిష్కరించే చిల్లర విషయం అంత కంటే కాదు. దీంట్లో రాజ్యాంగపరంగా చట్టసభ సభ్యురాలి గౌరవాన్ని కాపాడే అంశం ఉంది. బిభవ్ తప్పు చేశాడని ముందుగా అంగీకరించి.. ఆ తర్వాత దానికి విరుద్ధంగా ప్రకటిస్తే పార్టీ విశ్వసనీయతపై సందేహించే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, ఇక్కడ దాడికి గురైన మలివాల్ అయిదు రోజుల తర్వాత తన వైద్య పరీక్షను ఎందుకు ఆలస్యంగా చేయించుకున్నారనేది మరో ప్రశ్న.. ఎదురవుతోంది?

విశ్వసనీయత లేమి!

దాడి ఆరోపణలపై పార్టీలు ఎలా స్పందిస్తాయనే విషయంలో గత కొన్నేళ్లుగా.. శోచనీయమైన ధోరణి ఉంది. బాధితులకు న్యాయం చేయడం కంటే విపక్షాలను ఇబ్బంది పెట్టాలనే లక్ష్యంతో పార్టీ శ్రేణులు, నేతలు వ్యవహరిస్తున్నారు. ఉదాహరణకు సందేశ్‌ఖాలీలో, టీఎంసీ నాయకుడు షేక్ షాజహాన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలపై చోటు చేసుకున్న మలుపులు ఎవరినైనా దిగ్భ్రాంతికి గురిచేస్తాయి. ఇది ఒక స్టింగ్‌ ఆపరేషనా? నిజంగానే లైంగిక వేధింపు జరిగిందా? ఒక బాధిత మహిళ తన తొలి ప్రకటనను ఎందుకు వెనక్కి తీసుకుంది అనేది చెప్పడం కష్టంగా మారింది. సీబీఐ, పోలీసులతో సహా సకల ఏజెన్సీలు రాజకీయీకరణకు గురయ్యాయి. కాబట్టి ప్రతి దర్యాప్తులోనూ విశ్వసనీయత లోపిస్తోంది.

కర్ణాటకలో, బీజేపీ మిత్రపక్షమైన జేడీ(ఎస్)కి చెందిన ప్రజ్వల్ రేవణ్ణ చిత్రీకరించినట్లు చెబుతున్న దాదాపు 3,000 వీడియోలు ఆ రాష్ట్రంలో సంచలనం కలిగించాయి. కానీ ప్రధాన ప్రశ్న ఏమిటంటే ప్రజ్వల్‌కి ఉన్న అపఖ్యాతి గురించి బీజేపీకి తెలీదా? హాసన్‌కు చెందిన 33 ఏళ్ల సిట్టింగ్ ఎంపీ భూమ్మీద ఎక్కడ ఉన్నారో.. ఆరోపణలను ఎదుర్కొనేందుకు వారంలో తిరిగి వస్తానని వాగ్దానం చేసిన తర్వాత ఇప్పటికీ ఎందుకు కనిపించడం లేదు. ఆ వీడియోలలో ముఖాలు కనిపించే మహిళలకు ఇప్పుడు ఏమి జరుగుతుంది, వీరిలో చాలామంది తమ వేధింపుల గురించి వారి కుటుంబాలకు సైతం చెప్పలేదు. వారికి రక్షణ కోసం ఏం చేస్తున్నారు?

సున్నిత విషయాల్లోనూ నిజాయితీ లేక..

ఏ రాజకీయ పార్టీ వ్యవహారాలైనా ప్రజల పరిశీలనలోకి వచ్చాక దాపరికంతో ఉండకూడదు. ఒక వ్యక్తి దుష్ప్రవర్తన పై చర్య తీసుకుంటానని వాగ్దానం చేసి, అతనితో కలిసి ఎన్నికల ర్యాలీకి వెళుతున్నట్లు కనిపిస్తే.. అతనిపై వచ్చిన ఆరోపణలను మీరు ఎంత తీవ్రంగా పరిగణిస్తారో ప్రజలకు అర్థమైపోతుంది. ఇలాగే వ్యవహరిస్తే ఇకపై నేతలు బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రత గురించి వాగ్దానాలు చేయలేరు. మహిళలపై వేధింపులు వంటివి బయటపడినప్పుడు ప్రతి రాజకీయ పార్టీ ఇతర పార్టీలపై బురదజల్లడానికి ప్రయత్నిస్తున్నప్పుడు బాధిత మహిళలు న్యాయం కోసం ఎక్కడికెళ్లాలి? ఎన్నికల్లో పార్టీల తలరాతలను మార్చివేసే శక్తి మహిళలకు ఉందని గ్రహిస్తున్నప్పటికీ రాజకీయ పార్టీలు ఇలాంటి సున్నిత విషయాల్లో నిజాయితీని ప్రదర్శించడం లేదు. ఒకటి మాత్రం నిజం. ఆరోపణలు, ప్రత్యారోపణల నడుమ ఆ రోజు ఏమి జరిగిందో మనకు అసలు నిజం ఎప్పటికీ తెలియకపోవచ్చు. ఇది పార్టీకి మాత్రమే కాదు... ప్రజా జీవితంలో సురక్షితంగా ఉండే హక్కు తమకు ఉందని నమ్మే మహిళలకు కోల్పోయిన అవకాశంగానే చెప్పాల్సి ఉంటుంది.

ప్రత్యూష

79893 74301

Tags:    

Similar News