ప్రభుత్వ కళాశాలలు బలోపేతమవ్వాలంటే..

If government colleges are to be strengthened..

Update: 2024-05-05 01:15 GMT

రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గత మూడు సంవత్సరాల ఫలితాలను విశ్లేషిస్తే.. 2021- 22 విద్యా సం.లో.. ప్రథమ సం.లో 47.70% ఉత్తీర్ణత నమోదు కాగా, ద్వితీయ సం.లో 63.56% ఉత్తీర్ణత నమోదయింది. అదే 2022-23 వి.సం.లో.. ప్రథమ సం.లో 40% , ద్వితీయ సం.లో 54%, ఈ విద్యా సంవత్సరం (2023-24 )లో ప్రథమ సం.లో 38.21% మరియు ద్వితీయ సం.లో 49.13% ఉత్తీర్ణత నమోదయింది. ఇలా గత 3 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉత్తీర్ణత శాతం క్రమక్రమంగా తగ్గుతున్నట్టు మనకు స్పష్టంగా తెలుస్తుంది.

ఎంతోమందిని ఉన్నత శిఖరాలను అధిరోహింపజేసిన ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నేడు మౌలిక సదుపాయాల లేమితో ఫలితాలలో వెనుకంజలో ఉన్నాయి. మొన్న ప్రకటించిన ఇంటర్ ఫలితాలలో ప్రైవేట్ కాలేజీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉత్తీర్ణత శాతం తగ్గినప్పటికీ, అత్యధిక మార్కులు పొందిన జాబితాలో చోటు కైవసం చేసుకున్నాయి. కొఠారి కమిషన్ (1964-66) సిఫార్సులను అనుసరించి ఉన్నత విద్య దేశవ్యాప్తంగా ఒకే రీతిలో ఉండే నూతన విద్యా పథకం 10 +2+3 (10 సంవత్సరాలు పాఠశాల విద్య, 2 సంవత్సరాలు ఇంటర్ విద్య/ ప్రీ డిగ్రీ విద్య, 3 సంవత్సరాలు డిగ్రీ విద్య) అమలులోకి వచ్చింది. దీనిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1969-70 విద్యా సంవత్సరం నుండి అమలు పరిచి ఇంటర్మీడియట్ విద్యను విశ్వవిద్యాలయ పరిధి నుంచి తప్పించి చట్టం ప్రకారం ఇంటర్మీడియట్ విద్యా మండలి ‘ఇంటర్మీడియట్ బోర్డు’ను 1971సంవత్సరంలో నెలకొల్పింది. ఈ మండలికి "స్టాట్యుటరీ బాడీ" అధికారాన్ని ఇచ్చారు.

ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలు..

అసలు ఈ కళాశాలల్లో ఉత్తీర్ణత తగ్గడానికి కారణాలను విశ్లేషిస్తే.. పదవ తరగతి రెగ్యూలర్‌గా పాసైన విద్యార్థులను తల్లిదండ్రులు అన్ని వసతులతో కూడిన రెసిడెన్షియల్ కళాశాలల వైపు లేదా ప్రైవేట్ కళాశాలల వైపు పంపుతున్నారు. కానీ సప్లమెంటరీ పరీక్షలలో ఉత్తీర్ణులైన (స్లోలెర్నర్స్) వారిని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశం పొందడం, రెగ్యులర్ ఉపాధ్యాయులు లేకపోగా.. గెస్ట్ ఫ్యాకల్టీని సగం విద్యా సంవత్సరం ముగిసే వరకు భర్తీ చేయకపోవడం, అరకొర నిధులు విడుదల చేయడం, ఈ కళాశాలల పర్యవేక్షణ లేకపోవడం, అధ్యాపకులకు వృత్యంతర శిక్షణలు నిర్వహించక పోవడం, ఈ కళాశాలలలో పేరెంట్ - టీచర్ సమావేశాలు నిర్వహించకపోవడం, ఈ కళాశాలల్లో ఎక్కువ శాతం విద్యార్థులు గ్రామీణ ప్రాంత నివాసితులై, పేద తల్లిదండ్రులు ఉండటంతో.. విద్యార్థులు తల్లిదండ్రులకు సహాయ పడటం కోసం కళాశాల తరగతులకు ప్రతిరోజు హాజరు కాకపోవటం కూడా ఉత్తీర్ణతా శాతం తగ్గుటకు ఒక కారణం.

అడ్మిషన్లు తగ్గడానికి కారణాలు..

కళాశాలల్లో అన్ని వసతులతో కూడిన హాస్టల్ సదుపాయం, మధ్యాహ్న భోజన సౌకర్యాలు లేకపోవడం, ప్రతిభావంతులైన పిల్లలకు.. ఐఐటీ, నీట్ వంటి కోచింగ్ తరగతులు లేకపోవడం, క్రీడలు, సాంస్కృతిక అంశాలపై పోటీలు నిర్వహించకపోవటం, విద్యాసంవత్సరం ప్రారంభంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకులందరికీ సప్లమెంటరీ పరీక్షల డ్యూటీ ఉండటం, ఎక్కువ రోజులు మూల్యాంకనంలో పాల్గొనడంతో.. కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులకు తరగతుల నిర్వహణ సరిగా జరగకపోవడంతో తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేట్ కళాశాలపై మక్కువ చూపుతున్నారు.

కళాశాలల బలోపేతానికై..

మధ్యాహ్న భోజన ఏర్పాట్లు, ఏకరూప దుస్తులు సమకూర్చడం, బోధనలో సాంకేతికతను జోడించడం, గ్రంథాలయాలను తీర్చిదిద్దడం, సరిపడా నిధులు సమకూర్చడం, వ్యాయామ ఉపాధ్యాయుల నియామకం చేపట్టడం, గురుకులాల మాదిరి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కాలేజెస్ ఏర్పాటు చేయడం, తరచూ పర్యవేక్షణ చేస్తూ అనుభవం కలిగిన అధ్యాపకుల చేత మాదిరి ప్రశ్న పత్రాలను రూపొందించి స్పెషల్ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, యూనిట్ టెస్టులు నిర్వహిస్తూ ఉండటం, ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం నీట్ , ఎంసెట్, ఐఐటి వంటి జాతీయ స్థాయి పరీక్షల ఎంపికకు అకాడమిక్ గైడెన్స్ సెల్ (ఎజిఎస్) ను ఏర్పాటు చేసి శిక్షణ తరగతులు నిర్వహించడం. మూల్యాంకనానికి ప్రభుత్వ, ప్రైవేటు మరియు ఎయిడెడ్ కళాశాలల అధ్యాపకులందరినీ తప్పనిసరిగా పాల్గొనేలా చర్యలు చేపట్టి, అధ్యాపకులను కళాశాల విధులలో పాల్గొనే అవకాశం కల్పించడం, ప్రభుత్వ జూనియర్ కళాశాలలలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలలో.. ఉద్యోగ అవకాశాలలో ఎక్కువ ప్రాధాన్యత వంటి చర్యలను ప్రభుత్వం తీసుకుంటే జూనియర్ కళాశాలలు బలోపేతమవుతాయి. తెలంగాణాలో ఏర్పడిన కొత్త ప్రభుత్వమైన విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయిలో స్థిరపడడానికి, విద్యలో రాణించటానికి మరియు ఇంటర్ విద్యలో ప్రభుత్వ కళాశాలలు మరింత బలోపేతమవటానికి దోహదపడుతుందని కోరుకుందాం.

-షేక్. జాన్ పాష

అధ్యాపకులు, ప్రభుత్వ జూనియర్ కళాశాల. నెమ్మికల్

73868 47203

Tags:    

Similar News