ఓఆర్ఎస్ సృష్టికర్త ఎవరో తెలుసా?

ఓఆర్ఎస్ సృష్టికర్త ఎవరో తెలుసా?... editorial on ORS creator Dr Dilip Mahalanabis diarrhoea treatment

Update: 2022-12-16 18:45 GMT

1960 తొలినాళ్లలో ఆయన కోల్‌కతాలోని 'జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్'లో ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ పై విస్తృత పరిశోధనలు చేపట్టారు. 1975 నుండి 1979 వరకు అఫ్ఘానిస్తాన్, ఈజిప్ట్, యెమెన్ దేశాలలో కలరా వ్యాప్తి కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధిగా సేవలందించారు. 1980 దశకంలో ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ 'బ్యాక్టీరియా వ్యాధుల పరిశోధన మరియు నిర్వహణ' సలహాదారుగా కూడా నిరుపమాన సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలలో డయేరియా, అతిసారం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, మంచినీరు, గ్లూకోస్, ఉప్పు మిశ్రమాలతో డా. దిలీప్ మహాలనబిస్ ఆవిష్కరించిన ఓఆర్‌ఎస్ ద్రావకం చవకై అత్యుత్తమ పరిష్కారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది. 2002 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీ డా దిలీప్ మహాలనబిస్, డా నథానియేల్‌ను సంయుక్తంగా చంటిపిల్లల వ్యాధుల నిపుణులకు ఇచ్చే నోబెల్ పురస్కారానికి సరిసమానమైన 'పోలిన్' పురస్కారంతో సత్కరించింది.

వసరం ఆవిష్కరణలకు తల్లి'(Necessity is the Mother of Invention) అన్న ఆంగ్ల సామెత దాదాపు మనందరికీ సుపరిచితమే. ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే ఈ విషయం బోధ పడుతుంది కూడా. మానవుడు తన జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మలచుకోవడానికి అవసరమైన అధునాతన ఉపకరణాలతో పాటు జీవన ప్రస్థానంలో ఎదుర్కొంటున్న రుగ్మతల నుండి తనను కాపాడుకోవడానికి ఎన్నో నూతన ఆవిష్కరణలకు నాంది పలికాడు. ఒకప్పుడు మానవాళికి పెనుసవాళ్లుగా మారిన ప్లేగు, క్షయ (టీబీ), మశూచి (Smallpox), పోలియో, మొన్నటికి మొన్న ప్రపంచవ్యాప్తంగా కరాళ నృత్యం చేస్తూ మరణ మృదంగం మోగించిన కరోనా వైరస్ సైతం మానవ మేధస్సుకు తోక ముడవక తప్పలేదు. దోమలు, ఈగల ద్వారా వ్యాప్తి చెందే మలేరియా, కలరా సైతం ఒకప్పుడు ప్రాణాంతక వ్యాధులుగా పరిగణించబడేవి. కలరా ప్రధాన లక్షణమైన 'అతిసారం' (Diarrhea)నుండి ఉపశమనం పొందడానికి ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ (ఓ‌ఆర్‌ఎస్ ద్రావకం–శరీరం కోల్పోయిన లవణాలు, నీటిని తిరిగి వాటిని శరీరానికి నోటి ద్వారా అందించే ద్రావకం) మొదట కనిపెట్టింది దిలీప్ మహాలనోబిస్.

నిర్జలీకరణ (Dehydration) కారణంగా శరీరం కోల్పోయిన నీటిని నరాల ద్వారా ఎలక్ట్రోలైట్ రూపంలో పంపే ప్రక్రియకు బదులు సులువైన ప్రత్యామ్నాయంగా యావత్ ప్రపంచ వైద్య రంగం అబ్బురపడే విధంగా మానవాళికి మేలు చేసే మహత్తర ద్రావకం ఎంతో ప్రాచుర్యం పొందినప్పటికీ సృష్టికర్త అయిన పిల్లల వైద్య నిపుణుడు డా దిలీప్ మహాలనోబిస్ పేరు ప్రాచుర్యంలోకి రాకపోవడం మాత్రం చాలా ఆశ్చర్యం. ప్రపంచాన్ని పక్కనబెడితే అతిసారం నుండి బయట పడేందుకు ఓ‌ఆర్‌ఎస్ ద్రావణం వాడాలన్న సాధారణ విషయం తెలిసిన దాదాపు సగటు భారతీయుడిలా ఆయన పొరుగున ఉండేవారికి సైతం తెలియకపోవడం మరీ విడ్డూరం. కోల్‌కతా‌లోని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ లో రీసెర్చ్ స్కాలర్‌గా 1966లో ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్‌ను ఆయన అభివృద్ధి చేసారు. మృదుభాషి అయిన డా దిలీప్ మహాలనోబిస్ స్థానిక రిక్షావాళ్లకు మాత్రం 'డాక్టర్ బాబు'గా సుపరిచితుడు.

అనేకులు విగత జీవులు కావడంతో

సాధారణంగా కలరా, డయేరియాలతో నిర్జలీకరణ (Dehydration) పొందిన శరీరానికి కోల్పోయిన నీటిని నరాల ద్వారా ఎలక్ట్రోలైట్ రూపంలో పంపే ప్రక్రియకు భిన్నంగా ఓఆర్‌ఎస్ కు మారడం అంత సాఫీగా ఏమీ జరగలేదు. ఇందుకు గాను 1971 సంవత్సరం వేసవిలో పశ్చిమ బెంగాల్ సరిహద్దు పట్టణం బోంగావ్‌లోని ప్రయోగశాలలలో ఆయన అవిశ్రాంతంగా ప్రయోగాలు, సదస్సులు చేపట్టారు. పేగుల వ్యాధులలో ఈ ద్రావణం దివ్య ఔషధంగా పని చేస్తుందని శాస్త్రవేత్తలు, నిపుణులకు భరోసా కల్పించడానికి ఆయన ఎంతో శ్రమ పడాల్సి వచ్చింది. బంగ్లాదేశ్ విమోచన కోసం వేలాది మంది కాందిశీకులు భారత్ సరిహద్దులో గల శిబిరాలకు వలస పోయారు. రక్షిత మంచినీరు, మురుగునీటి వ్యవస్థ లేకపోవడంలో కలరా వ్యాధి బారిన పడ్డారు. ఎంతో మంది చంటిపిల్లలు విగతజీవులయ్యారు. ఒక పక్క కలరా వ్యాధి ప్రబలి విచ్చలవిడిగా అమాయక ప్రజల ప్రాణాలను హరించివేస్తున్న సమయంలో, మరో పక్క ఇంట్రావీనస్ (నరాల ద్వారా ఎక్కించే) శరీరంలోకి ఎక్కించే ద్రవ పదార్థ మందుల నిల్వలు తగ్గిపోయాయి.

ఈ ప్రక్రియలో చికిత్స చేసే నిపుణుల కొరత పరిస్థితిని మరింత దిగజార్చింది. వారికి అత్యవసరంగా అతిసారాన్ని అరికట్టే మందు ఇవ్వాల్సి రావడంతో ఆయన సాధారణ పంచదార, ఉప్పు మిశ్రమంతో ఏర్పాటు చేసిన ద్రావణాన్ని కనిపెట్టారు. ఇది అద్భుతంగా పని చేసి మరణాల రేటును గణనీయంగా తగ్గించింది. విరివిగా ఈ ద్రావణ వాడకం ద్వారా కాందిశీకుల శిబిరాలలో సత్ఫలితాలు రావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 105 దేశాలలో ఈ ప్రాజెక్టును చేపట్టి దీనిని చికిత్సా విధానంగా ప్రకటించింది. ఆ తరువాత ఎన్నో శిబిరాలలో ఐక్యరాజ్య సమితి వాడింది. ఒక అంచనా ప్రకారం 90 వ దశకంలో ఒక కోటి ఇరవై లక్షల మంది డయేరియా కారణంగా మరణించినప్పటికీ 2010 నాటికి ఆ సంఖ్య పది లక్షల దిగువకు పడిపోయింది. ఓ‌ఆర్‌ఎస్ ద్రావణం 20వ శతాబ్దపు ఒక అతి ముఖ్యమైన వైద్య ఆవిష్కరణ. ఇది అధునాతన ప్రయోగశాలలో సుదీర్ఘ పరిశోధనల అనంతరం వెలువడిన ఆవిష్కరణ కాదు. 1970 తొలినాళ్లలో బంగ్లాదేశ్ యుద్ధం సమయంలో కలరా ఒక్కుమ్మడిగా విరుచుకుపడి ఎందరో అమాయక ప్రజల ప్రాణాలను హరిస్తున్న సమయంలో యుద్ధప్రాతిపదికన కనుగొనబడిన సంజీవని లాంటి వైద్య ఆవిష్కరణ ఇది. ఇంతటి గొప్ప ఆవిష్కరణను దిలీప్ మహాలనోబిస్ తన గురువు ధీమన్ బారువా కు అంకితమివ్వడం ఆయన నిరాడంబరత్వానికి నిదర్శనం.

ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి

1960 తొలినాళ్లలో ఆయన కోల్‌కతాలోని 'జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ సెంటర్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్'లో ఓరల్ రీహైడ్రేషన్ థెరపీ పై విస్తృత పరిశోధనలు చేపట్టారు. 1975 నుండి 1979 వరకు అఫ్ఘానిస్తాన్, ఈజిప్ట్, యెమెన్ దేశాలలో కలరా వ్యాప్తి కట్టడికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధిగా సేవలందించారు. 1980 దశకంలో ఆయన ప్రపంచ ఆరోగ్య సంస్థ 'బ్యాక్టీరియా వ్యాధుల పరిశోధన మరియు నిర్వహణ' సలహాదారుగా కూడా నిరుపమాన సేవలందించారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి చెందుతున్న దేశాలలో డయేరియా, అతిసారం కారణంగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని, మంచినీరు, గ్లూకోజ్, ఉప్పు మిశ్రమాలతో డా. దిలీప్ మహాలనోబిస్ ఆవిష్కరించిన ఓఆర్‌ఎస్ ద్రావకం చవకై అత్యుత్తమ పరిష్కారమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అభివర్ణించింది.

2002 సంవత్సరంలో కొలంబియా యూనివర్సిటీ డా దిలీప్ మహాలనోబిస్, డా నథానియేల్‌ను సంయుక్తంగా చంటిపిల్లల వ్యాధుల నిపుణులకు ఇచ్చే నోబెల్ పురస్కారానికి సరిసమానమైన 'పోలిన్' పురస్కారంతో సత్కరించింది. అతిసారానికి ఓ‌ఆర్‌ఎస్ అత్యుత్తమ పరిష్కారమని, ఇది నరాల ద్వారా రోగికి అందించే ద్రావకానికి ప్రత్యామ్నాయంగా నోటి ద్వారా అందించే చికిత్సా విధానమని విశ్వాసం కలిగించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. ఈ విషయాన్ని విస్తృతంగా కరపత్రాలు, రేడియో ద్వారా ప్రచారం చేయడంతో కలరా శిబిరాలలో చికిత్స పొందే రోగుల సంఖ్య ముప్ఫై శాతం నుండి మూడు శాతానికి పడిపోయింది. ప్రపంచ మానవాళికి ఎంతో ఉపయుక్తమైన తన ఆవిష్కరణను అందించి లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన ఈ దిగ్గజ భారత జీవ శాస్త్రవేత్త తన 88 వ యేట ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 16 అక్టోబర్ 2022 న మరణించారు. డా దిలీప్ మహాలనోబిస్ కు యావత్ ప్రపంచం ఎప్పటికీ ఋణపడి ఉంటుంది.

యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్

88850 50822

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672.

Tags:    

Similar News