Agriculture: రైతును రాజుగా చూడాలంటే?

Agriculture: రైతును రాజుగా చూడాలంటే?... editorial on agriculture farming in our country

Update: 2022-12-22 18:30 GMT

ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోతుంటే మరోవైపు ప్రభుత్వం నుండి వచ్చే రుణాలందక కౌలు రైతు వ్యవసాయం పట్ల విముఖత చూపాల్సిన పరిస్థితి ఉంది. నాణ్యమైన విత్తనాల కొరతతో పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు పెట్టుబడి పెరిగిపోతోంది. పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర గిట్టుబాటు ధర లేక, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక రైతులు నష్టపోతున్నారు. అప్పులు తీర్చడం కొరకు రైతులు కూలీలుగా మారుతున్నారు. కొందరు ఇతర పనుల మీద ఆధారపడి బతుకుతున్నారు. మరికొందరు భూములను కౌలుకిచ్చి పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారు. కొంతమంది బ్యాంకు రుణాలందక పంట పండించడానికి అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ఈ పరిస్థితి ఇప్పటికైనా మారాలి. రైతును రాజుగా చూసే రోజులు రావాలి.

దేశ రక్షణ కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా అర్పించేవాడు జవాన్ (సైనికుడు). మనిషి ఆకలిని తీర్చడానికి అవిశ్రాంతంగా శ్రమించేవాడు కిసాన్ (రైతు). దేశానికి వీరు ఇద్దరూ ఎంతో ముఖ్యం. ఈ ఇద్దరి శ్లాఘనీయ సేవలకు గుర్తింపుగా 'జై జవాన్- జై కిసాన్'(jai jawan-jai kisan) నినాదాలతో దేశం వారిని కీర్తిస్తుంది. ఆహారం లేకుండా మనిషి జీవించలేడు మనిషి జీవనానికి ఆహారం అత్యవసరం. ఆహారాన్ని సృష్టించే రైతన్నే లేకుంటే మనిషి జీవించడం అసాధ్యం. అందుకే రైతును దేశానికి వెన్నెముకగా అభివర్ణించి 'రైతే రాజు' అన్నారు. భారత మాజీ ప్రధాని, ప్రఖ్యాత కర్షక నాయకుడు చౌదరీ చరణ్‌సింగ్ 23 డిసెంబర్ 1902న ఉత్తరప్రదేశ్ లోని ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించారు. స్వాతంత్ర్యం పోరాటంలో మహాత్మాగాంధీని(mahatma gandhi) అనుసరించడమే కాక, అనేక సార్లు జైలు శిక్ష కూడా అనుభవించారు. 1930లో ఉప్పు చట్టాలను ఉల్లంఘించినందుకు బ్రిటిష్‌వారు ఆయనను 12 సంవత్సరాలపాటు జైలుకు పంపారు.

స్వాతంత్ర్యానంతరం ఆయన రైతుల ప్రయోజనాల కోసం, రైతు చట్టాల కోసం ఎనలేని కృషి చేశారు. ఆయన రాజకీయం మొత్తం గ్రామీణ భారతదేశం, రైతు సామ్యవాద సూత్రాలపై పరిభ్రమించేది. ఉత్తరప్రదేశ్ కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా సేవలందించారు. ముఖ్యమంత్రిగా ఉంటూనే భూసంస్కరణ చట్టాలలో మార్పు, జమీందారీ వ్యవస్థ రద్దు కోసం అవిశ్రాంతంగా కృషి చేశారు. వ్యవసాయానికి బ్యాంకు రుణాలు అందించే విధానాన్ని ప్రవేశపెట్టిన తొలి ప్రధాని చౌదరీ చరణ్‌సింగ్(chowdary charan singh). రైతు చట్టాల మార్పు కోసం కృషి చేసి 'రైతుబంధు'గా పేరుగాంచారు. రైతుల కోసం ఆయన చేపట్టిన కార్యక్రమాలకు గుర్తుగా ఆయన జయంతిని ప్రభుత్వం 'జాతీయ రైతు దినోత్సవం'గా(national farmers day) ప్రకటించింది. ఆయన సమాధికి 'కిసాన్ ఘాట్'గా(kisan ghat) నామకరణం చేసింది.

చట్టాలు మారినా, కష్టాలు మారలే

మన దేశంలోని అన్ని రంగాలు అభివృద్ధి సాధిస్తున్నాయి. కానీ, ఒక వ్యవసాయరంగం మాత్రమే అభివృద్ధికి ఆమడదూరంలో ఉండడం శోచనీయం. సారవంతమైన భూములు, తగినంత నీరు, సకల సౌకర్యాలన్నీ ఉన్నా, గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతు మనుగడ సామర్థ్యాన్ని బలహీనపరుస్తున్నది. రైతుల సంక్షేమమే తమ ధ్యేయమని ప్రభుత్వాలు చెబుతున్నా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టడంలో మాత్రం క్రియా శూన్యంగా ఉంటున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న రాయితీలు, రుణమాఫీలు కేవలం వ్యవసాయం చేయని భూస్వాములకు అందుతున్నాయి తప్ప భూమిలేక ప్రత్యక్షంగా దుక్కి దున్ని వ్యవసాయం చేస్తున్న కౌలు రైతుకు మాత్రం అందడం లేదు. పది ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే రుణాలు అందుతున్నాయి. కానీ, గుంట భూమి లేని కౌలు రైతులకు రుణాలందకపోవడం శోచనీయం.

ఒకవైపు గిట్టుబాటు ధర లేక రైతు నష్టపోతుంటే మరోవైపు ప్రభుత్వం నుండి వచ్చే రుణాలందక కౌలు రైతు వ్యవసాయం పట్ల విముఖత చూపాల్సిన పరిస్థితి ఉంది. నాణ్యమైన విత్తనాల కొరతతో పంట దిగుబడి తగ్గిపోవడంతో పాటు పెట్టుబడి పెరిగిపోతోంది. పండించిన పంటకు ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర గిట్టుబాటు ధర లేక, సరైన మార్కెటింగ్ వ్యవస్థ లేక రైతులు నష్టపోతున్నారు. అప్పులు తీర్చడం కొరకు రైతులు కూలీలుగా మారుతున్నారు. కొందరు ఇతర పనుల మీద ఆధారపడి బతుకుతున్నారు. మరికొందరు భూములను కౌలుకిచ్చి పట్టణ ప్రాంతాలకు వలస పోతున్నారు. కొంతమంది బ్యాంకు రుణాలందక పంట పండించడానికి అధిక వడ్డీలకు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు ఈ పరిస్థితి ఇప్పటికైనా మారాలి. రైతును రాజుగా చూసే రోజులు రావాలి.

కోట దామోదర్

93914 80475

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News