తెలుగు దర్శకుల్లో.. హాస్య గ్రంథులు ఉన్నాయా?

నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం..’ ఈ నానుడి హాస్య బ్రహ్మగా పేరుగాంచిన కీ.శే. జంధ్యాల సెలవిచ్చారు.

Update: 2024-05-25 00:45 GMT

‘నవ్వడం ఒక భోగం.. నవ్వించడం ఒక యోగం.. నవ్వలేకపోవడం ఒక రోగం..’ ఈ నానుడి హాస్య బ్రహ్మగా పేరుగాంచిన కీ.శే. జంధ్యాల సెలవిచ్చారు. ఇది వందకు వంద శాతం నిజం. నిత్యజీవితంలో మనుషులకు కుటుంబ బాధ్యతలు, సమస్యలు, ఆఫీసులో పని ఒత్తిడి నుంచి కాస్తంత రిలీఫ్ ఇచ్చేది సినిమా. అది ఏ భాష సినిమా అయినప్పటికీ అందులో ఎన్నో ఎమోషన్స్ కలగలిపి ఉన్నప్పటికీ.. కాస్తంత హాస్యం మనిషికి ఎంతో రిలీఫ్ ఇస్తుంది. గతంలో రేలంగి, రాజబాబు నుంచి మొదలుకుంటే.. ఇప్పటి తరంలో హాస్య నటులకు తెలుగు తెరపై ఆదరణ ఏమాత్రం తగ్గలేదు.

సూపర్‌స్టార్, మెగాస్టార్, భారీ తారాగణం, హీరోయిన్ల అందచందాలు, గ్రాఫిక్స్ వండర్స్ సినిమాను హిట్ చేయగలవో లేదో గ్యారంటీ ఇవ్వలేం..కానీ చిన్న చిన్న కమెడియన్లను పెట్టి తీసిన ఒక అధ్బుతమైన హాస్య కథా చిత్రం మాత్రం హిట్ కాగలదు.. కాసుల పంట పండించగలదని గ్యారెంటీ ఇవ్వగలం. ఇందుకు సిల్వర్ జూబ్లీ ఆడిన గత హాస్య చిత్రాలనే సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. హాస్యానికి అంతటి గ్యారెంటీ ఉంది మరి. అయితే నేడు తెలుగు తెరపై ప్రేక్షకులకి ఆరోగ్యకరమైన హాస్య చిత్రాలు కనుమరుగయ్యాయని చెప్పవచ్చు. కనీసం ఒక్క హాస్య సన్నివేశం కూడా లేకుండా నేటి తరం సినిమాలు వస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో.! సినిమాలో ఏ స్టార్ హీరో లేనప్పటికి.. ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురాగల దమ్ము హాస్యం ప్రధానంగా తీసిన ఏ లోబడ్జెట్ సినిమాకైనా ఉంటుంది. దానికి ఉదాహరణే డీజే టిల్లు, జాతిరత్నాలు లాంటి సినిమాల ఘన విజయాలు..

గత దశాబ్ద కాలంగా..

హీరో అంటే పూర్తిగా ఊహాజనితమైన పాత్రలా నేటి సినిమాలు తయారవుతున్నాయి. హీరో అంటే పది మంది రౌడీలను చితకబాది.. సమాజాన్ని కాపాడేవాడే అనుకునే రోజుల్లో.. రాజేంద్రప్రసాద్ హీరో పాత్రలతో సామాన్యుని జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూనే తనదైన శైలిలో నవ్వుల పూవులు పూయించి వెండితెర కామెడీ సూపర్ స్టార్‌గా వెలుగొందారు. ఒక్కో సమయంలో ఆయన సినిమాలు సూపర్ స్టార్లకు, మెగా స్టార్లకు కూడా పోటీ ఇచ్చాయంటే అది హాస్యరసం గొప్పదనమే. అప్పట్లో, జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన అన్ని సినిమాలు.. కథాబలంతో కామెడీ ప్రధానంగా వచ్చి ప్రేక్షకులను అలరించడమే కాక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించాయి. ఇక బ్రహ్మానందం ఒక సినిమాలో ఉన్నారంటే ఆ సినిమా హిట్టు అనే విధంగా తయారైన రోజులను సైతం మనం చూశాం. కానీ గత దశాబ్ద కాలంగా మన తెలుగు సినిమాను పరిశీలిస్తే.. సమాజంలోని సాధారణ కథాంశంతో హాస్య ప్రధానంగా వచ్చిన సినిమాలను వేళ్లపై లెక్క వేయవచ్చు. శ్రీను వైట్ల, ప్రస్తుతం అనిల్ రావిపూడి, త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు మాత్రమే నేటి తరానికి కొద్దోగొప్పో హాస్యాన్ని అందించి.. హాస్య నటుల నటనను కొంతలో కొంతైనా వినియోగించుకున్నారని చెప్పవచ్చు.

అగ్రహీరోలూ కామెడీ బాటలోనే...

వంద సినిమాలు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్లైన చిరంజీవి, బాలక్రిష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటివారు కామెడీ ప్రధానంగా సినిమాలు తీసి అలరించారు. కానీ, నేటి సూపర్ స్టార్లుగా పిలవబడుతున్నవారు మాత్రం.. హీరో కొడితే చచ్చిపోయే విలన్ల సంఖ్య ఆధారంగా సినిమా కథల్ని ఎంపిక చేసుకుంటున్నారు. అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని అప్ కమింగ్ హీరోలు సైతం సహజత్వానికి దూరంగా ఉండే మాస్ కథలనే ఎంచుకుంటూ ఊహా లోకంలో బ్రతికేస్తున్నారు. ఇక నేటి తరం దర్శకుల తీరు కూడా కేవలం మాస్ సినిమాను తెరకెక్కించడమనే ధ్యేయంతోనే సినిమా ఇండస్ట్రీకి వచ్చినట్టు కనిపిస్తుంది. దీంతో నేటి తెలుగు సినిమా దర్శకులకు హాస్య గ్రంథులు చచ్చిపోయాయా? అనే సందేహాలు సగటు ప్రేక్షకుడికి కలుగక మానవు.

బూతు కామెడీ ప్రోగ్రాములు

ఇక ప్రస్తుతం సింగిల్ స్క్రీనింగ్ సినిమా హాళ్లు మూసివేతకు గురయ్యాయి. కరోనా కాలం మినహా బహుశా ఇలాంటి స్థితి తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ చూసి ఉండరు. ఇలాంటి స్థితి రావడానికి ఎవరు కారణం అంటే.. ప్రధానంగా మూస సినిమాలు తీసి జనాలపై రుద్దే దర్శకులు, హీరోలే అని చెప్పవచ్చు. డీజే టిల్లు లాంటి సో సో బూతు కామెడీ ఉన్న సినిమానే ప్రేక్షకులను సినిమా హాళ్లకు తీసుకువచ్చిందంటే.. నేటి తరం ప్రేక్షకులు హాస్య ప్రధాన కథాంశం కలిగిన సినిమా కోసం ఎంత ముఖం వాచి ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా తెలుగు దర్శకులు, అప్ కమింగ్ హీరోలు తమ మూర్ఖపు ఆలోచనా ధోరణి మార్చుకొని తెలుగు సినిమాపై అదృశ్యం అయిన హాస్యాన్ని పండించి ప్రేక్షకులను అలరించాలి. లేదంటే రాబోయే కాలం బూతు కామెడీ ప్రోగ్రాములు చూసుకొని ఆనందించడమే ప్రేక్షకుల వంతు అవుతుంది. ఫలితంగా సినిమా ఓటీటీకే పరిమితమయి.. సింగిల్ సినిమా థియేటర్లు మూతపడే అవకాశాలున్నాయని గుర్తించుకోవాలి.

శ్రీనివాస్ గుండోజు,

జర్నలిస్ట్,

99851 88429

Tags:    

Similar News