డయాగ్నాస్టిక్ సేవలు పునరుద్ధరించాలి!

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అన్ని ఖర్చులతో పాటు వైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వైద్యం కోసం

Update: 2024-05-25 01:00 GMT

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అన్ని ఖర్చులతో పాటు వైద్య ఖర్చులు కూడా విపరీతంగా పెరిగాయి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులకు వైద్యం కోసం పేదలు, మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలు వెళ్ళే పరిస్థితులు లేవు. డాక్టర్ల ఫీజులు, వైద్య పరీక్షలు, ఔషధాలను కొనుగోలు చేసే ఆర్థిక స్థితిగతులు కనిపించడం లేదు.

కోవిడ్ అనంతరం ప్రజలకు విద్యా, వైద్య, ఉద్యోగ, ఉపాధి సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి. మొదటి నుంచి విద్యా, వైద్య సౌకర్యాలను కల్పించటంలో దేశంలో కేరళ రాష్ట్రం ముందంజలో ఉంది. ఆ తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో వైద్య సౌకర్యాలు మెరుగ్గా ఉన్నాయి. ఆయన నాయకత్వంలో ఢిల్లీ నలుమూలల బస్తీ దవాఖానలు నెలకొల్పారు. ఉన్నత ప్రమాణాలతో లక్షలాది మంది ప్రజలకు ఉచిత వైద్యం, మందులు అందించడం మొదలు పెట్టారు. ఇవి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా స్పూర్తిని కలిగించాయి. అందుకే ఢిల్లీ నగరంలోని గల్లీ వైద్యశాలల తరహాలో, తెలంగాణలో అన్ని నగరాలలో బస్తీ దవాఖానాలను గత ప్రభుత్వం ప్రారంభించింది.

ఆధునిక డయాగ్నాస్టిక్ సెంటర్లు

ఈ రోజుల్లో వైద్యానికి ముందు రోగ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవడం అత్యవసరం. గతంలోనైతే ఈ వైద్య పరీక్షలకు తప్పనిసరిగా రోగులు ఖరీదైన ప్రైవేట్ డయాగ్నాస్టిక్ సెంటర్లను ఆశ్రయించక తప్పేది కాదు. అందుకే ఈ సమస్య పరిష్కారం కోసం తెలంగాణలో గత ప్రభుత్వం పూనుకుని ఆధునిక హంగులు గల డయాగ్నాస్టిక్ సెంటర్లు నెలకొల్పి రాష్ట్ర ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 36 డయాగ్నాస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉచిత వైద్య పరీక్షలు చేయడం మొదలెట్టింది ఇందులో 134 రకాల వైద్య పరీక్షలు అందుబాటులోకి తెచ్చారు. వైద్య సేవలు అందించటంలో తెలంగాణను దేశంలో ఆదర్శంగా నిలపడానికి ఆనాడు తెలంగాణ ప్రభుత్వం బాగానే కృషి చేసింది. అయితే, ఇవి అందుబాటులోకి వచ్చిన ఆరు నెలల వరకు సజావుగా సాగాయి. కానీ ప్రస్తుతం ఆ డయాగ్నాస్టిక్ కేంద్రాలు నిర్వహణ లోపంతో ఉంటున్నాయి. బిల్లుల చెల్లింపులు ఆలస్యం కావడంతో వీటి సేవలు గత ఆరు నెలలుగా మధ్యలోనే స్థంభించాయి.

కొత్త ప్రభుత్వానికి నిధుల కటకట

దీనిపై గత ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు.. లక్షలాది మంది పేదలకు ఆర్థిక భారం పడకుండా నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నాస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వాహణ లోపంతో ఉండటం బాధాకరమని, దేశానికి ఆదర్శంగా నిలిపిన ఈ డయాగ్నాస్టిక్ సెంటర్ల సిబ్బందికి, డాక్టర్లకు గత ఆరు నెలలుగా జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిపై ఆయన విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆ సెంటర్లలో పనిచేసే సిబ్బందికి, వైద్యులకు వెంటనే పెండింగ్ జీతాలు చెల్లించాలని.. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆయన వారి ప్రభుత్వం ఉన్న నిధులన్నీ ఖర్చు చేయడంతో ఈ పరిస్థితి సంభవించిందని తెలిసినా కొత్త ప్రభుత్వంపై ఈ తరహా విమర్శలు చేయడం తగునా? కొత్త ప్రభుత్వానికి ఏ పనులు చేద్దామన్నా ఖాళీ ఖజానా దర్శనం ఇస్తోంది. ఇప్పటికే అత్యవసర అవసరాలను నెరవేర్చడం కోసం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరిమితంగా ఉన్న వనరుల లభ్యతతో పాటు బ్యాంకుల నుండి అప్పులు తెచ్చి ప్రభుత్వాన్ని నడిపిస్తుంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టేంతవరకు ఈ ఇబ్బందులు నూతన ప్రభుత్వానికి తప్పవు. కాబట్టి విమర్శకులు, మీడియా కాస్త సంయమనం పాటించాలి. త్వరలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను అధిగమించి ప్రజలకు అన్ని విధాలా మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెస్తుందని ఆశిద్దాం.

డా. కోలాహలం రామ్‌‌కిశోర్

98493 28496

Tags:    

Similar News