కాంగ్రెస్.. మైండ్ గేమ్ ఆడుతోంది!

ఎన్డీఏ కూటమి 400 లోక్ సభ సీట్లు కైవసం చేసుకోవడానికి ఎన్నికల బరిలోకి దిగడంతో బీజేపీ మనుగడను నిరంతరం ద్వేషించే

Update: 2024-05-24 00:45 GMT

ఎన్డీఏ కూటమి 400 లోక్ సభ సీట్లు కైవసం చేసుకోవడానికి ఎన్నికల బరిలోకి దిగడంతో బీజేపీ మనుగడను నిరంతరం ద్వేషించే కాంగ్రెస్ పార్టీ మైండ్ గేమ్ ఆడటం మొదలు పెట్టింది. బిజెపి 200 సీట్లు కూడా సాధించలేదని, ఈసారి ఎన్నికలలో 'ఇండియా' కూటమి జయభేరి మోగిస్తుందని, తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది తామేనని కాంగ్రెస్ నాయకులు బీరాలు పలకడం మొదలుపెట్టింది. వీరి ప్రగల్భాలు విని, దేశంలోని రాజకీయ విశ్లేషకులే కాకుండా ప్రపంచ రాజకీయ విశ్లేషకులు సైతం ముక్కు మీద వేలు వేసుకున్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాన అంటే తందానంటూ కాంగ్రెస్ నాయకుల పల్లవిని ఎత్తుకున్నది. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి కూటమిలో మమతా బెనర్జీ చేరికనే వ్యతిరేకిస్తూ, ఆమెతో పోరాటం చేస్తూ ఉండటం ఇక్కడ గమనార్హం. కాంగ్రెస్ రాకుమారుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేదని పత్రికల ముందు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉంది. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ఎన్ని సీట్లు సాధిస్తుందో చెప్పలేకపోయిన ఈ పెద్దమనిషి ప్రత్యర్థి పార్టీ గురించి అవాకులు చవాకులు పేలుతున్నారు.

మోడీపై ఇంత ద్వేషం దేనికి?

బీజేపీ ఉత్తరాది పార్టీ అని, దక్షిణాది వారు ఆ పార్టీని తిరస్కరిస్తారని, బీజేపీ వ్యతిరేక పార్టీ నాయకులు చేసే ఆరోపణలు జూన్ 4వ తేదీ పటాపంచలవుతాయి. దక్షిణాదిలో సైతం ఆ పార్టీ ఊహించని విజయాలతో విజయ ఢంకా మోగించడం ఖాయం. ఈ దేశం నాది అనే భావన కలిగిన ప్రజలందరూ నరేంద్ర మోడీ మూడోసారి ఢిల్లీ పీఠాన్ని అధిరోహించాలని ఆశిస్తున్నారు. ఇక మోదీని నిరంతరం దూషించే, ద్వేషించే వ్యక్తులకు, పార్టీలకు ఈ ఎన్నికలు తగిన గుణపాఠాన్ని నేర్పుతాయనేది అక్షర సత్యం.

బీజేపీపై అపనమ్మకం అసాధ్యం

ప్రపంచ దేశాల్లో ఈ దేశ గౌరవం రెట్టింపు కావడానికి నరేంద్ర మోడీ శక్తి వంచన లేకుండా కృషి చేశారని, దేశ సమైక్యత, సమగ్రత, హిందూ ధర్మ పరిరక్షణలో నేర్పు, ఓర్పు, సహనం, పట్టుదల కలిగిన నేతగా ఈ దేశ ప్రజలు ఆయనను గుర్తించారు. 500 సంవత్సరాలుగా ముడిపడిన అయోధ్య రామ మందిర సమస్యను కోర్టు ద్వారా పరిష్కరించి, భవ్యమైన రామ మందిరం నిర్మించడం అనితర సాధ్యమని ఇది మోడీ సామర్థ్యంతోనే సాధించబడినదని ఈ దేశంలోని మెజారిటీ ప్రజల విశ్వాసం. ఇటువంటి విశ్వాసాన్ని పొందిన బిజెపేతర నేతలు ప్రతిపక్ష పార్టీలలో కనుచూపుమేరలో కూడా కనిపించరు. ఈ విషయం కాంగ్రెస్ నాయకులకు బాగా తెలుసు. అయినప్పటికీ ప్రజలను మభ్యపెట్టి, ఏదో ఒక విధంగా బీజేపీపై అపనమ్మకం కలిగించి, ఓట్లను తగ్గించి, లోక్ సభ సీట్లను తగ్గించాలని ఆపసోపాలు పడుతుంది కాంగ్రెస్ పార్టీ. అయితే, కాంగ్రెస్ దాని తోక పార్టీలు ఎన్ని ప్రయత్నాలు చేసినా, రాబోయే ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధించడాన్ని ప్రపంచంలో ఏ శక్తీ అడ్డుకోలేదు.

ప్రజలు నమ్మని 'ఇండియా కూటమి'

ఇక చివరగా ఇండియా కూటమిలోని పార్టీలను ఈ దేశంలోని చాలామంది ప్రజలు నమ్మడం లేదు అనే విషయాన్ని- కూటమికి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ గ్రహిస్తే దానికి భవిష్యత్తు ఉంటుంది. దేశ భద్రత, దేశ సమైక్యత ,సమగ్రత విషయంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడకుండా స్పష్టతతో కూడిన జాతీయ విధానాన్ని ఆ పార్టీ ప్రజల ముందుకు తేకుండా అధికారంలోకి రావాలని కోరుకోవడం నేల విడిచి సాము చేయడం లాంటిదే!

ఉల్లి బాలరంగయ్య,

సామాజిక, రాజకీయ విశ్లేషకులు

94417 37877

Tags:    

Similar News