స్వాతంత్య్ర సమరంలో తొలిసేనాని బుధు భగత్

స్వాతంత్య్ర సమరంలో తొలిసేనాని బుధు భగత్... Budhu Bhagat was the first soldier in the freedom struggle

Update: 2023-02-16 18:30 GMT

1795 నాటికి బెంగాల్, బీహార్, ఒరిస్సా ప్రాంతాల్లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో పట్టు సాధించింది. ఛోటానాగపూర్‌ లోకి అడుగుపెట్టిన ఆంగ్ల సైన్యాధిపతి కెప్టెన్ జాకబ్ ఖైముక్ 'విభజించి పాలించు' విధానంతో విభేదాలు సృష్టించి స్థానిక రాజ్యాలను ఆక్రమించి కంపెనీ పాలన ప్రారంభించారు. అప్పటివరకు స్థానిక రాజుల పాలనలో ప్రజలంతా శాంతిగా, ధార్మిక, భక్తి, సాంస్కృతిక జీవనంతో ఆర్థికంగా, సాంఘికంగా సుఖజీవనం గడిపేవారు. కానీ కంపెనీ ఇక్కడ అడుగుపెట్టాక ప్రజలను అణచివేసి, దోపిడీ చేస్తూ బానిసలుగా మార్చి ధర్మ, సంస్కృతులను అవహేళన చేసి, ఆధ్యాత్మిక కేంద్రాలను ఆక్రమించి మత మార్పిడి చేసేవారు. ఈ బాధలను భరించలేక ప్రజలు ఆంగ్ల పాలనను వ్యతిరేకిస్తూ స్వాతంత్య్ర సాధనకి తీవ్రంగా పోరాడారు. ఈ పోరాటానికి 1792 ఫిబ్రవరి 17న సిల్లీ గ్రామంలో జన్మించిన బుధు భగత్ కేంద్రమైనాడు. ఆయన మరుగునపడిన స్వాతంత్య్ర సమర యోధులలో ముఖ్యమైన వాడు.

దేశంలో 1832 వరకు ఆదివాసీలు బ్రిటిష్ వారిపై పోరాటం చేశారు. ఈ పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొనే 1857లో దేశమంతటా స్వాతంత్య్ర సాధనకు తొలి సంగ్రామం ఆరంభమైంది. భగత్‌కు దైవశక్తులు ఉన్నాయని ప్రజల విశ్వాసం. జీవిత సమస్యల్లో దిక్కుతోచని ప్రజలు ఆవేదనతో భగత్‌ను తలిస్తే దేవుని వలె ప్రత్యక్షమై పరిష్కరించేవాడని నమ్మకం. పరిసర గ్రామాల గిరిజనులంతా బుధు భగత్‌ను అనుసరించేవారు. అయితే ఆంగ్లేయులు బుధు భగత్‌ను విప్లవ నేతగా గుర్తించి ఆయన రాకపోకలపై నిఘా పెట్టి గ్రామాలల్లో సోదాలు చేస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసేవారు. అయితే ఎంత వెతికినా ఆయన ఆచూకీ తెలేసేది కాదు. చివరికి ఆయనను పట్టిస్తే వేయి రూపాయల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించినా ఆచూకీ ఎవరూ చెప్పలేదు. ప్రజలంతా భగత్‌ను తమ ఆరాధ్య దైవంగా భావించి ఆయనను రక్షించడం కర్తవ్యంగా భావించేవారు. ఓ సారి భగత్‌ను పట్టుకొమ్మని బ్రిటిష్ సైన్యాధికారి ఆదేశిస్తే సుమారు 4000 మంది సైన్యం అడవిలోకి ప్రవేశించగా ప్రజల రక్షణకు తోడుగా ప్రకృతి కనికరించడంతో భారీ వర్షం కురిసింది దీంతో సైన్యం వారి ప్రాణాలు కాపాడుకోవడానికి పారిపోయారు.

మరోసారి కెప్టెన్ ఇంఫె, భగత్ సిల్లీ గ్రామంలో ఉన్నాడని తెలుసుకొని దాడి చేశాడు. ఆ సమయంలో గ్రామంలోని యువకులు తమ ఆయుధాలతో భగత్‌‌ చుట్టూ రక్షణ వలయంగా ఏర్పడ్డారు. తమ ప్రాణాలు లెక్కచేయకుండా భగత్‌ను రక్షించడానికి ప్రయత్నించారు. కానీ భగత్‌కు అకస్మాత్తుగా తుపాకీ గుండు తాకడంతో ఆయన నేలకొరిగాడు. 1832 ఫ్రిబ్రవరి 17న క్రూరుడైన కెప్టన్ ఇంఫె భగత్‌, ఆయన అనుయాయుల తలలు నరికి పెద్ద పళ్లెంలో పేర్చి కమిషనర్‌కు పంపాడు. ఈ విషయాన్ని 1832 ఫిబ్రవరి 29 నాటి బెంగాల్ హారకరా పత్రిక ప్రచురించింది. బ్రిటిష్ సేనలకు సింహ స్వప్నంగా నిలిచిన బుధు భగత్ స్వాతంత్య్ర స్ఫూర్తిని ఆయన పోరాట చరిత్రను సి. రాయ్ చౌదరి భారత స్వాతంత్య్ర తొలి సంగ్రామంగా వర్ణించాడు. బుధు భగత్ ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో తొలి సేనానిగా చరిత్ర పుటల్లో నిలిచాడు.

(నేడు బుధు భగత్ జయంతి, వర్ధంతి)

గుమ్మడి లక్ష్మీ నారాయణ

9491318409

Tags:    

Similar News