మనువాద భావాజాలం రుద్దడానికేనా..?

BJP wants 400 seats to implement Hindutva ideology?

Update: 2024-05-09 00:45 GMT

ప్రాంతీయ పార్టీలను లోబర్చుకుని ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పట్ల ఆగ్రహంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ఓట్లు ప్రాంతీయ పార్టీలకు పడేలా చేసి ఓట్ల చీలికతో గెలుపును సునాయాసం చేసుకుంటోంది బీజేపీ. గత రెండు ఎన్నికల్లో ఈ విషయం సుస్పష్టం అయింది. ఇప్పటికైనా దేశంలోనీ ఈ వర్గ ప్రజలు ఏకమై బీజేపీ కబంధ హస్తాలలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు దూరంగా ఉండి కాంగ్రెస్‌కు మద్దతుగా ఉండి తమ హక్కులను కాపాడుకోవాలి.

ఈ పది సంవత్సరాల మోడీ ప్రభుత్వ హయాంలో ఒక్కటంటే ఒక్క చట్టం కూడా ప్రజల జీవితాలలో వెలుగులు తీసుకురాకపోగా వారి బతుకులను 10 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్ళింది. ఆర్థికంగా ప్రజలు నలిగిపోయి వారి జీవితాలు అగమ్యగోచరంగా తయారు అయ్యాయి. నోట్ల రద్దుతో దేశంలో అవినీతి లేకుండా చేస్తాం అని, ఉగ్ర జాడలు లేకుండా చేస్తాం అని తెలిపి ప్రజలను నమ్మించి వారిని వారి జీవితాలను చౌరస్తాలో నిలబెట్టారు. నల్లధనం పోకపోగా బడాబాబుల దగ్గర ఉన్న పైసలు అన్ని మోడీ పుణ్యమా అని వైట్ మనీగా మారిపోయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2018 ఆగస్టులో ప్రచురించిన ఒక నివేదిక ప్రకారం.. 99 శాతం బ్యాంకు నోట్లు బ్యాంకులకు తిరిగి వచ్చాయి. నోట్ల రద్దు వల్ల నల్ల ధనాన్ని బయట పెట్టలేకపోయారు అనే విషయం అర్థమైపోయింది.

వ్యవసాయ చట్టాలు పేరుతో ...

అదానీ, అంబానీలకు ఈ దేశాన్ని పూర్తిగా రాసి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చి ఈ దేశ రైతును కార్పొరేట్ వ్యవస్థకు ఊడిగం చేసేలా, బానిసగా నిలిచేలా చట్టం రూపొందించి అమలు చేసే ప్రయత్నం చేశారు. కానీ, కాంగ్రెస్ పార్టీ అదే ప్రజల్ని జాగృతి చేస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతూ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా సాగే పోరాటానికి నాయకత్వం వహించింది. దేశంలోని అనేక రాష్ట్రాల నుండి రైతులు చేస్తున్న పోరాటాన్ని చూసి మోడీ ప్రభుత్వం వెనుక అడుగు వేయక తప్పలేదు. అసలుకే ఎసరు వచ్చేలా ఉందని గ్రహించి రైతులను చర్చలకు పిలిచి నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంది ఈ ప్రభుత్వం. కానీ వీరి నిరంకుశ వైఖరి వల్ల ప్రాణాలు కోల్పోయిన రైతుల ప్రాణాలు ఐతే తిరిగి ఇవ్వలేకపోయారు.

కేంద్ర ప్రభుత్వం చేసే దమనకాండను ఏ మేధావి ప్రశ్నించినా, ఏ యూనివర్సిటీ విద్యార్థి నిలదీసినా, ఏ ప్రజాస్వామ్యవాది ఎత్తి చూపినా అతని మీద అర్బన్ మావోయిస్టు ముద్ర వేసి వారి ఇళ్లలో సోదాలు పేరుతో దాడులు నిర్వహించి రోజులు తరబడి జైలో ఉంచుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఆప్ కి బార్ మోడీ సర్కార్ ఫిర్ ఏక్ బార్ మోడీ సర్కార్ పేరుతో 400 సీట్లు కావాలి అనీ, తద్వారా దేశంలో 100 రోజులు లోనే సమూల మార్పులు తీసుకొస్తామని పేర్కొంటున్నారు, బలహీన వర్గాల ప్రజల హక్కులను కాలరాసే మరిన్ని చట్టాలు తెస్తారు ఏమో అనే భయం ఇప్పుడు ప్రతి ఒక భారతీయుడి మదిలో కదులుతోంది.

రాబోయే తరాలకూ ప్రమాదం

మోడీ నేతృత్వంలో బీజేపీ 400 సీట్లు కావాలి అంటోంది. వారన్నట్లు 400 సీట్లు వస్తే జమ్మూ కాశ్మీర్ మీద ప్రయోగించిన ఆర్టికల్ 370 రద్దు లాంటి నిర్ణయాలు మిగతా రాష్ట్రాల మీద ప్రయోగించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బీజేపీని ఎప్పుడూ ఆదరించని ఈ రాష్ట్రాల మీద తమ అధికారం ఉపయోగించి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఉండే ఉంటుంది. దేశంలో మనువాద భావజాలం నడవాలి అంటే 400 సీట్లు సాధించే దిశగా ముందుకు సాగాలి అని ఆర్ఎస్ఎస్ కూడా బీజేపీని నిర్దేశించినట్లు చెబుతున్నారు, ఇప్పటికైనా దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏకమై బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే భవిష్యత్తు తరాలు మనల్ని క్షమించవు. రాబోయే తరాలకు, మన వారసులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.

బిచ్చాల అన్వేష్

యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఖమ్మం

96669 17596

Tags:    

Similar News