కీర్తి విగ్రహం.....!?

Update: 2023-04-13 23:45 GMT

వెలి వాడల చీకట్లను తరిమిన నీలిపొద్దా

మా ఇంటి ఆకాశాన పూసిన నీలి వెన్నెల పువ్వా

ఇంతింతై వటుడింతై అన్నట్లు

ఆకాశమంత ఎత్తేదుగుతుంది నీ కీర్తి విగ్రహంలా

నీ ఆశయాల ఆచరణ మాత్రం ఏ మురికి కాలువలోకో మూసిలోకో ప్రవాహంలా

ఒక ఓటుకు ఒకే విలువన్న నీ మాటకు

ఒక్కో పార్టీ ఒక్కో రేటుకు కొనుక్కుంటారు

ప్రజలు నచ్చిన రేటు కమ్ముకుంటారు

ఇదే ఇప్పుడిక్కడ నడుస్తున్న ప్రజాస్వామ్యం

నీవిప్పుడూ... ఓ అంగడి సరుకు

విగ్రహంగా వ్యాపారస్తులకు

వాగ్దానంగా రాజకీయ నాయకులకు

నినాదంగా నిన్నమ్ముకునే వారలకు

విగ్రహంగా నినుచూడ్డానికెత్తే మా తలలు

నీ ఆలోచనల ఆచరణకు మాత్రం నేలన తాకుతాయి

అచ్చం... నింగిని చూసి చటుక్కున నేలరాలే గడ్డి పూల మాదిరి

అయినా మాకు ఆశగానే ఉంది

నినాదం గానైనా బ్రతుకుతున్న నీ ఆశయం

చీకటి మెదళ్ళలో మిణుగురై వెలుగుతున్నందుకు

అయినా మాకు నమ్మకముంది

నిదానంగానైనా నీ ఆలోచనల భావధార

దేశమంతా ఎడారవుతున్నవేళ సజీవంగా సాగుతున్నందుకు

అయినా మాకు విశ్వాసముంది

నీ కలలరాజ్యం చేరుకుంటామని

నీ ఆలోచనల వెలుగుదారులల్లోనే....

(ఏప్రిల్ 14 అంబేడ్కర్ జయంతి)

దిలీప్.వి - 8464030808

Tags:    

Similar News