వీసీలుగా నిఖార్సైన అధ్యాపకులుండాలి..!

ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే, ఆ దేశంపై అణు బాంబులు, క్షిపణులు ప్రయోగించనవసరం లేదు. ఆ దేశ విద్యావిధానంలోని నాణ్యతను తగ్గించడం

Update: 2024-05-24 00:45 GMT

‘ఏ దేశాన్నైనా నాశనం చేయాలంటే, ఆ దేశంపై అణు బాంబులు, క్షిపణులు ప్రయోగించనవసరం లేదు. ఆ దేశ విద్యావిధానంలోని నాణ్యతను తగ్గించడం, పరీక్షల్లో విద్యార్థులు మోసం చేయడాన్ని అనుమతించడం చేస్తే చాలు ఆ దేశాన్ని పూర్తిగా నాశనం చేయవచ్చు’ ఈ మాటలు ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఓ విశ్వవిద్యాలయ గోడలపై కనిపిస్తాయి. ఇది ముమ్మాటికీ నిజం.

గత పదేళ్లలో రాష్ట్రంలో ఉన్నత విద్య క్రమేణా కుంటుపడుతూ వచ్చిందన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. గత బీఆర్ఎస్ పరిపాలనలో ఒక్క అధ్యాపకుడి నియామకాలు చేపట్టలేదు. పైగా ప్రైవేటు విశ్వవిద్యాలయాలకూ విచ్చలవిడిగా అనుమతులు ఇచ్చి, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను గాలికి వదిలేయడంతో పేద, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య క్రమంగా దూరమవుతూ వచ్చింది.

గత ప్రభుత్వం కారణంగా..

గత పదేళ్లలో మౌలిక వసతుల కల్పన, నిధుల కేటాయింపులోనూ సవతి తల్లి ప్రేమే బీఆర్ఎస్ చూపించింది. క్రమేపీ.. విశ్వవిద్యాలయాలను వాటంతటవే ఆత్మహత్య చేసుకునే విధానాన్ని అవలంభించారు. ప్రసుత్తం అన్ని యూనివర్శిటీలు కనీసం 20 శాతం పూర్తిస్థాయి అధ్యాపకులు కూడా లేకుండానే నడుస్తున్నాయి. చాలా కాలం పాటు ఉపకులపతుల నియామకమే చేపట్టలేదు. పదేళ్లలో కేవలం రెండు పర్యాయాలు మాత్రమే ఉపకులపతులను నియమించింది. వీరిలో కొందరి నియామకం వివాదాస్పదమైన తీరు మనకు తెలిసిందే. తిరిగి అలాంటి పరిస్థితి తలెత్తకుండా మచ్చలేని, అందరినీ కలుపుకుని విశ్వవిద్యాలయాలను ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చే ముందు చూపున్న అధ్యాపకులకు వీసీలుగా అవకాశం ఇవ్వాలి. లేదంటే గతంలో జరిగిన నష్టం రెట్టింపు అవుతుందే తప్ప పరిస్థితిలో ఏ మార్పు ఉండదు.

ఫ్రొఫెసర్ లేకుండా..సగం విభాగాలు

ఏటికేడు ప్రొఫెసర్ల పదవీ విరమణతో యూనివర్శిటీల్లోని ఎన్నో విభాగాలు మూత పడే పరిస్థితికి చేరాయి. ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. సగానికిపైగా విభాగాలు కనీసం ఒక్క ప్రొఫెసర్ కూడా లేకుండానే నడుస్తున్నాయి. ఫలితంగా రోజురోజుకూ విద్యా ప్రమాణాలు పడిపోతూ వస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో రెండు సంవత్సరాల్లోనే విశ్వవిద్యాలయాలు దాదాపుగా మూతపడే పరిస్థితికి చేరుతాయి. ఆ దశ నుంచి తిరిగి పునర్వైభవం దిశగా విశ్వవిద్యాలయాలను మళ్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. లేదంటే... పేద, మధ్యతరగతి, గ్రామీణ యువకులకు ఉన్నత విద్య అందిస్తున్న పదిహేను రాష్ట్రీయ విశ్వవిద్యాలయాలు ఉనికి కోల్పోతాయి. నాణ్యమైన ఉన్నత విద్య కోసం ఇక ప్రైవేటు విశ్వవిద్యాలయాల వైపే చూడాల్సి ఉంటుంది. అప్పడు పేద, గ్రామీణ విద్యార్థులు ఉన్నతవిద్యకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పైగా వీలైనంత త్వరగా విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక నియామకాలు చేపట్టకపోతే... న్యాక్ సహా జాతీయ సంస్థల గుర్తింపు దక్కే అవకాశాలు లేవు. ఫలితంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, పరిశోధనా ప్రాజెక్టులు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇప్పటికే పూర్తి స్థాయి అధ్యాపకులు లేకపోవటం ద్వారా పీహెచ్‌డీ ప్రవేశాలు తగ్గిపోయాయి. పరిశోధనలూ కుంటుపడ్డాయి.

ఇంచార్జులున్నారని కాలయాపన చేస్తే..

ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో ఉన్న సమస్యలపై సమగ్ర అధ్యయనం జరపాలి. బోధన, బోధనేతర సిబ్బందిని నియమించే దిశగా అడుగులు వేయాలి. భవిష్యత్తు తరాలకు నాణ్యమైన ఉన్నత విద్యను అందించే దిశగా చర్యలు ప్రారంభించాలి. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుని ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించుకున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను నిలబెట్టాలి. ఇందుకోసం విద్యార్థి సంఘాలుగా సంపూర్ణ సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటాం. ఇటీవల యూనివర్సిటీల పదవీకాలం ముగియడంతో.. కొత్త వీసీల ఎంపిక కోసం ఇప్పటికే... ప్రభుత్వం సెర్చ్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో ఆశావహుల హడావుడి కూడా పెరిగింది. ఈ సారి పైరవీలు, అనర్హులకు కాకుండా.. నీతి, నిజాయితీ, దూరదృష్టి, పరిశోధనలు, విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలన్నది తెలంగాణ సమాజ అభిప్రాయం. అయితే, ప్రభుత్వం ఎన్నికల కోడ్ కారణంగా ఐఏఎస్ అధికారులను ఇంచార్జ్ వీసీలుగా నియమించింది. కోడ్ అయిపోగానే ప్రభుత్వం పూర్తి స్థాయి వీసీలను తొందరలోనే నియమించాలి. ఇంచార్జులు ఉన్నారని కాలయాపన చేస్తే ఇప్పటికే 10 సంవత్సరాలు విశ్వవిద్యాలయాలు నిర్వీర్యమైన పరిస్థితి. మరి కాస్త లేట్ చేస్తే విశ్వవిద్యాలయాల పరిస్థితి రోడ్డు పాలైనట్లే. ప్రస్తుతం తెలంగాణలో ప్రభుత్వ విశ్వవిద్యాలయాలను పటిష్ట పరిచే అవకాశం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలు విద్యావ్యవస్థను మెరుగుపరిచి సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చేలా ఉండాలి. లేదంటే భవిష్యత్ తరాలు పాలకవర్గాలను క్షమించవు.

జీవన్

ఏబీవీపీ, స్టేట్ యూనివర్సిటీస్ కన్వీనర్

88850 99930

Tags:    

Similar News