ఈమె జమానా అంతా వివాదాలే!

All the days that Tamilisai Soundararajan served as governor were controversies!

Update: 2024-03-20 01:00 GMT

వాస్తవానికి బ్రిటిష్ పాలననాటి అవశేషమే గవర్నర్ల వ్యవస్థ. రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రభుత్వ అధినేతగా ఉంటే, గవర్నర్ రాష్ట్ర అధినేతగా ఉంటారు. మౌలికంగా మనది సమాఖ్య వ్యవస్థ. ఫెడరలిజమే స్ఫూర్తి కావాలని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించారు. అయితే, సమాఖ్య వ్యవస్థకు అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు తూట్లు పొడుస్తున్నాయి .దీని ఫలితంగానే, గవర్నర్ల వ్యవస్థ చుట్టూ వివాదాలు నెలకొంటున్నాయి.

తమిళిసై ఒక వివాదాస్పద గవర్నర్. రాజ్‌భవన్‌ను సమాంతర అధికార కేంద్రంగా తయారు చేయడానికి తమిళిసై ప్రయత్నించారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ప్రజాదర్బార్ వివాదం తెలంగాణ సమాజంలో దుమారం రేపింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉండగా, గవర్నర్ ప్రజాదర్బార్ అంటూ కార్యక్రమం నిర్వహించడమేంటన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై ఒకటి కాదు...రెండు కాదు అనేక వివాదాలను మూటగట్టుకున్నారు.

ప్రజా ప్రభుత్వానికి సమాంతరంగా..

ఒకవైపు ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉంటే మరో వైపు జనం సమస్యలు తెలుసుకోవడానికి ప్రజా దర్బార్ పేరుతో నానా హంగామా చేశారు తమిళిసై. ప్రజల కష్టాలు తెలుసుకోవడం వాటికి పరిష్కారమార్గాలు కనుగొనడం ప్రభుత్వాల పని. ఈ ప్రక్రియలో గవర్నర్ జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రజా ప్రభుత్వానికి సమాంతరంగా రాజ్‌భవన్‌ను తెరమీదకు తీసుకురావడమే లక్ష్యంగా ఆమె ప్రజా దర్బార్ నడిపింది. ఈ వివాదం తెలంగాణ సమాజంలో దుమారం రేపింది. ఒక్క బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలూ గవర్నర్ తమిళిసై తీరుపై మండిపడ్డాయి. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఉండగా, గవర్నర్ ప్రజాదర్బార్ అంటూ కార్యక్రమం నిర్వహించడమేంటన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది.

గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను నామినేట్ చేయాలన్న గత తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనలను కూడా గవర్నర్ హోదాలో తమిళిసై తిరస్కరించారు. రాజ్యాంగంలోని 171 (3), 171 (5) అధికరణాల్లో నిర్దేశించిన మేరకు సాహిత్యం, విజ్ఞాన శాస్త్రం, కళలు, సహకార ఉద్యమం, సమాజ సేవా రంగాల్లో ప్రత్యేక ప్రావీణ్యత అటు శ్రవణ్‌ ఇటు సత్యనారాయణకు లేవన్నది అప్పట్లో తమిళిసై చేసిన వాదన. అందువల్లనే ఆ ఇద్దరి అభ్యర్థిత్వాలను తిరస్కరిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో తమిళిసై స్పష్టం చేశారు. అంతకుముందు పాడి కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫార్సు చేసినప్పుడు కూడా తమిళిసై మోకాలడ్డారు.

కమిషన్ సిఫార్సులున్నా..

ఇలాంటి విషయాల్లో గవర్నర్‌కు విచక్షణాధికారాలు ఉన్న మాటను ఎవరూ కాదనలేరు. అయితే గవర్నర్ విచక్షణాధికారాలు కూడా రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్తికి లోబడే ఉంటాయి. విచక్షణాధికారాలను అడ్డం పెట్టుకుని ప్రజలెన్నుకున్న ప్రభుత్వం చేసిన సిఫార్సులను ఎడమచేతితో తోసిపుచ్చడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. గవర్నర్ల నియామకాలకు సంబంధించి సర్కారియా కమిషన్ గతంలో అనేక సూచనలు చేసింది. ముఖ్యంగా రాజకీయ నేపథ్యం ఉన్నవారిని గవర్నర్లుగా నియమించరాదంటూ సర్కారియా కమిషన్ కరాఖండీగా పేర్కొంది. కానీ కమిషన్ సిఫార్సులను నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెత్తబుట్టలోకి పడేసి తెలంగాణకు గవర్నర్‌గా నియమించింది. ఈమె పూర్వాశ్రమంలో తమిళనాడులో బీజేపీ రాష్ట్ర శాఖలో కీలక పదవిలో పనిచేశారు. రాజకీయ నేపథ్యం నుంచి గవర్నర్‌గా నియమితులైన తమిళిసై అదే రాజకీయరంగాన్ని సాకుగా చూపించి ఇద్దరు బలహీనవర్గాలకు చెందిన దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ పేర్లను తిరస్కరించడమే విచిత్రాలలోకెల్లా విచిత్రం. రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించాల్సిన గవర్నర్, కేంద్రంలోని అధికార పార్టీకి ఏజెంట్‌గా పనిచేస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. అంతిమంగా గవర్నర్ల వ్యవస్థే వివాదాస్పదంగా మారుతోంది.

-ఎస్. అబ్దుల్ ఖాలిక్,

సీనియర్ జర్నలిస్ట్,

63001 74320

Tags:    

Similar News